ఆరోగ్యానికి కొత్త టార్గెట్.. రోజుకు 7000 అడుగులు నడవండి చాలు..! జరిగే మ్యాజిక్ చూసి ఆశ్చర్యపోతారు..!
కొత్త పరిశోధన ప్రకారం.. రోజుకు కేవలం 7000 అడుగులు నడవడం ద్వారా గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్, డిప్రెషన్ వంటి తీవ్రమైన వ్యాధుల వల్ల వచ్చే అకాల మరణాల ప్రమాదాన్ని సగానికి తగ్గించవచ్చని తేలింది. ఇది ఖరీదైన వ్యాయామం కాదు.. అందరూ చేయగలిగే ఒక సులభమైన ఆరోగ్య రహస్యం.

ప్రతి రోజూ 10,000 అడుగులు నడవాలని మనలో చాలా మంది అనుకుంటారు. కానీ కొత్త పరిశోధన ప్రకారం.. కేవలం 7,000 అడుగులు నడవడం ద్వారా గుండె జబ్బులు, మధుమేహం, డిప్రెషన్ వంటి తీవ్రమైన సమస్యలతో వచ్చే అకాల మరణాల ప్రమాదాన్ని సగానికి తగ్గించవచ్చని తేలింది. ఒక ప్రతిష్టాత్మక ఆరోగ్య పత్రికలో ప్రచురితమైన ఈ అధ్యయనం, అధిక ఆరోగ్య ప్రయోజనాలు పొందడానికి 7,000 అడుగుల లక్ష్యం చాలని స్పష్టం చేసింది.
పరిశోధనలో ఏం తేలిందంటే..?
ప్రపంచవ్యాప్తంగా 57 వేర్వేరు అధ్యయనాలను విశ్లేషించిన నిపుణులు.. రోజుకు 7,000 అడుగులు నడిచిన వారికి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు గుర్తించారు. 2,000 అడుగులు నడిచే వారితో పోలిస్తే వీరికి..
- అకాల మరణం వచ్చే ప్రమాదం 47 శాతం తక్కువ.
- గుండె జబ్బులు వచ్చే అవకాశం 25 శాతం తక్కువ.
- గుండె సంబంధిత మరణాలు 37 శాతం తగ్గాయి.
- క్యాన్సర్ మరణాలు 38 శాతం తగ్గాయి.
- జ్ఞాపకశక్తి తగ్గే ప్రమాదం 22 శాతం తక్కువ.
- టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం 28 శాతం తగ్గుతుంది.
ఈ అధ్యయనం ప్రకారం.. 7,000 అడుగుల తర్వాత కూడా లాభాలు పెరుగుతాయి.. కానీ దాని పెరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి 10,000 అడుగులు తప్పనిసరి కాదని తేలింది.
వాకింగ్
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచంలో ఎక్కువ మంది సరైన వ్యాయామం చేయడం లేదు. దీంతో గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. కానీ నడక అనేది ఎటువంటి ఖర్చు లేకుండా అందరూ చేయగలిగే ఒక సులభమైన వ్యాయామం. కేవలం మంచి బూట్లు వేసుకుని నడవడానికి సిద్ధంగా ఉంటే చాలు.
రోజువారీ లక్ష్యం ఎందుకు..?
సాధారణంగా నిపుణులు వారానికి 150 నిమిషాల వ్యాయామం చేయమని చెబుతుంటారు. కానీ బిజీగా ఉండే వారికి.. వృద్ధులకు ఇది కాస్త కష్టమైన పని. అందుకే రోజూ అడుగుల సంఖ్యను లెక్కించడం సులభమైన పద్ధతి. రోజుకు 7,000 అడుగులు నడవాలనే లక్ష్యాన్ని సాధించడం సులభం. ఇది ఆచరణీయమైనది కూడా.
రోజుకు 7,000 అడుగులు నడవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, అకాల మరణం వచ్చే అవకాశాన్ని తగ్గించడం పూర్తిగా సాధ్యమే. ఇది ఖరీదైన వ్యాయామ పద్ధతులు లేకుండా.. అందరూ ఆచరించగలిగే మంచి మార్గం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




