గురకను లైట్ తీసుకుంటున్నారా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?
చాలా మంది గురకను లైట్ తీసుకుంటారు. కానీ ఇది స్లీప్ అప్నియా అనే ప్రమాదకరమైన సమస్యకు ఫస్ట్ అలారం కావచ్చు. సాధారణ గురకకు, స్లీప్ అప్నియాకు మధ్య తేడాను తెలుసుకోవడం చాలా ముఖ్యం. పగటిపూట అలసట, గురక మధ్యలో శ్వాస ఆగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. సకాలంలో పరీక్షలు, సరైన చికిత్స తీసుకోవడం ద్వారా సీరియస్ సమస్యలను నివారించుకోవచ్చు.

మనలో చాలా మంది గురకను మామూలుగానే భావిస్తారు. కానీ నిపుణులు చెప్పినట్లుగా ఇది కొన్నిసార్లు స్లీప్ అప్నియా అనే తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సూచన కావచ్చు. మీ నిద్ర నాణ్యతను, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. గురక, స్లీప్ అప్నియా మధ్య తేడాను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
సాధారణ గురక
అలసట, వయసు పెరగడం, మద్యం తాగడం లేదా నిద్రపోయే భంగిమ మారడం వంటి కారణాల వల్ల వచ్చే గురకను సాధారణ గురకగా పరిగణించవచ్చు. ఈ గురక వల్ల మీరు రాత్రిపూట నిద్రలోంచి మేల్కోకపోతే లేదా పగటిపూట అలసటగా అనిపించకపోతే అది పెద్ద సమస్య కాకపోవచ్చు.
స్లీప్ అప్నియా
అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (Obstructive Sleep Apnea) అనే సమస్యలో మీరు నిద్రలో ఉన్నప్పుడు శ్వాసనాళం తాత్కాలికంగా మూసుకుపోతుంది. దీని వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?
- శ్వాస కొన్ని సెకన్ల పాటు ఆగిపోతుంది.
- ఇది ఒక రాత్రిలో చాలా సార్లు జరుగుతుంది.
- మెదడు మిమ్మల్ని నిద్రలోంచి కొద్దిగా మేల్కొలిపి మళ్లీ శ్వాస తీసుకునేలా చేస్తుంది.
- దీని వల్ల ఎంత నిద్రపోయినా పగటిపూట అలసటగా, నిద్రగా అనిపిస్తుంది.
గురక వర్సెస్ స్లీప్ అప్నియా
- సాధారణ గురక.. శబ్దం ఒకే రకంగా, నిరంతరంగా ఉంటుంది. శ్వాసలో విరామాలు ఉండవు.
- స్లీప్ అప్నియా.. గురక శబ్దం ఆగిపోయి, హఠాత్తుగా మళ్లీ మొదలవుతుంది. ఈ మధ్యలో శ్వాస ఆగిపోవడం జరుగుతుంది.
- లక్షణాలు.. స్లీప్ అప్నియా ఉన్నవారికి పగటిపూట విపరీతమైన నిద్ర, చిరాకు, ఏకాగ్రత లోపం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణ గురకలో ఈ లక్షణాలు ఉండవు.
స్లీప్ అప్నియా లక్షణాలు
- బిగ్గరగా, అస్తవ్యస్తంగా గురక పెట్టడం.
- నిద్రలో శ్వాస ఆగిపోవడం.
- రాత్రిపూట తరచూ మేల్కొనడం.
- ఉదయం తలనొప్పి.
- పగటిపూట అలసటగా ఉండటం, ఏకాగ్రత లేకపోవడం.
- మానసిక మార్పులు (కోపం, నిరాశ).
- అధిక బరువు, అధిక రక్తపోటు ఉండటం.
చికిత్స చేయకపోతే స్లీప్ అప్నియా గుండె జబ్బులు, స్ట్రోక్, మధుమేహం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.
పరిష్కార మార్గాలు
- మీకు స్లీప్ అప్నియా అనుమానం ఉంటే వెంటనే నిపుణుడిని సంప్రదించి స్లీప్ టెస్ట్ పాలిసోమ్నోగ్రఫీ (Polysomnography) చేయించుకోవాలి.
- చికిత్సలో భాగంగా.. CPAP యంత్రం వాడటం, బరువు తగ్గడం, కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స కూడా అవసరం కావచ్చు.
గురక చిన్నదే అనుకోకండి. దాని వెనుక స్లీప్ అప్నియా లాంటి ప్రమాదకరమైన సమస్య దాగి ఉండవచ్చు. పగటిపూట అలసట, శ్వాస ఆగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




