Cooking Oils : దేశంలో పెరిగిన వంట నూనెల డిమాండ్..! విదేశాల నుంచి భారీగా దిగుమతులు.. అత్యధిక వాటా పామాయిల్ దే
Cooking Oils : గత కొన్ని రోజులుగా వంటనూనెల ధరలు విపరీతంగా పెరిగిన సంగతి అందరికి తెలిసిందే. మార్కెట్లో కిలో
Cooking Oils : గత కొన్ని రోజులుగా వంటనూనెల ధరలు విపరీతంగా పెరిగిన సంగతి అందరికి తెలిసిందే. మార్కెట్లో కిలో వంట నూనె 150 రూపాయల నుంచి 200 వరకు పలుకుతుంది. పేదలు కొనలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకప్పుడు భారతదేశం వంటనూనెలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే పరిస్థితిలో ఉండేది. కానీ ఇది 1970కి ముందు మాట. తరువాతి కాలంలో వంటనూనెల దిగుమతులు మొదలయ్యాయి.1994 డబ్ల్యూటీవో ఒప్పందంపై భారత్ సంతకం తరువాత మరింత విచ్చలవిడిగా దేశంలోకి దిగుమతులు పెరిగాయి. ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో ముందుకెళుతున్నప్పటికీ వంటనూనెల కోసం ఇంకా దిగుమతులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.
చైనా, యూరోప్ దేశాల నుంచి వంటనూనెలు దిగుమతి అవుతాయి. మలేషియా, ఇండోనేషియాల నుంచి పామాయిల్ దిగుమతి అవుతుంది. ఉక్రెయిన్ నుంచి సన్ ప్లవర్ ఆయిల్ దిగుమతి అవుతుంది. దేశంలో వంట నూనెల డిమాండ్ 25 మిలియన్ టన్నులు. ఏడాదికి దాదాపు 15 మిలియన్ టన్నుల వంటనూనెలను దిగుమతి చేస్తున్నారు. భారత్ దిగుమతుల్లో అత్యధిక వాటా పామాయిల్ దే. ఇందులో 82 శాతం వాటా ఇండోనేషియా, మలేషియా నుంచి వస్తోంది. దేశంలో 3.3 లక్షల హెక్లార్లలో పామాయిల్ సాగు చేస్తున్నారు. ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, అసోం, చత్తీస్ గఢ్, కర్నాటక, కేరళ, మిజోరం, ఒడిశా, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు. దేశంలో పామాయిల్ ఉత్పత్తిలో కర్ణాటక తొలి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో ఏపీ, తెలంగాణ ఉన్నాయి. మిగతా నూనెలతో పోలిస్తే ఫామాయిల్ ధరలు 30-40 శాతం తక్కువగా ఉండటంతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పామాయిల్ వినియోగం అధికంగా ఉంటుంది.
2021-22 బడ్జెట్లో.. క్రూడ్ పామాయిల్ దిగుమతి సుంకం 27.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. సోయాబీన్, సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ 35 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. మరోవైపు క్రూడ్ పామాయిల్ పై సెస్ 17.5శాతం, క్రూడ్ సోయాబీన్, క్రూడ్ సన్ ఫ్లవర్ నూనెలపై 20 శాతం విధించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఆయిల్ దిగుమతులకు సంబంధించి… ప్రతి ఏటా నవంబర్-అక్టోబర్ మధ్య కాలాన్ని ఒక ఆయిల్ సంవత్సరంగా తీసుకుంటారు. గత సంవత్సరంతో పోల్చితే దిగుమతులు పెరగనప్పటికీ అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరగడంతో దిగుమతుల భారం పెరిగింది.వంటనూనెల దిగుమతులపై సుంకాల పేరుతో ఖజానాకు భారీగా సొమ్ములు చేకూరుతుండటంతో కేంద్రం అటువైపే మొగ్గు చూపుతుంది. 2020-21 ఆయిల్ సంవత్సరానికిగాను వంటనూనెల దిగుమతుల ద్వారా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు 45 వేల కోట్లు లభించాయి.