Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Satya Ndella: సామాన్యుడు నుంచి మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా ఎదిగిన తెలుగు తేజం సత్య నాదెళ్ల పుట్టిన రోజునేడు

Happy Birthday Satya Ndella: ప్రపంచంలో భారత దేశ ప్రతిష్టతను పెంచిన వ్యక్తుల్లో ఒకరు సత్య నాదెళ్ల. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ చైర్మన్ గా ఉన్న సత్య నాదెళ్ల గత కొన్నేళ్లుగా ఆ సంస్థకు సీఈఓగా..

Satya Ndella: సామాన్యుడు నుంచి మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా ఎదిగిన తెలుగు తేజం సత్య నాదెళ్ల పుట్టిన రోజునేడు
Satya Nadella
Follow us
Surya Kala

|

Updated on: Aug 19, 2021 | 11:23 AM

Happy Birthday Satya Ndella: ప్రపంచంలో భారత దేశ ప్రతిష్టతను పెంచిన వ్యక్తుల్లో ఒకరు సత్య నాదెళ్ల. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ చైర్మన్ గా ఉన్న సత్య నాదెళ్ల గత కొన్నేళ్లుగా ఆ సంస్థకు సీఈఓగా ఉంటూ మైక్రోసాఫ్ట్‌ను ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్లారు. కృషి, పట్టుదల ఉంటె.. సామాన్యుడు కూడా సంచలన విజయాలను సొంతం చేసుకోవచ్చని నేటి తరానికి రుజువు చేసిన వ్యక్తి సత్య నాదెళ్ల పుట్టిన రోజు నేడు.. ఈ సందర్భంగా ఆయన స్ఫూర్తివంతమైన జీవితం గురించి తెలుసుకుందాం..

బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ , ప్రభావతి దంపతులకు సత్య నాదెళ్ల 19 ఆగస్టు 1967 న హైదరాబాద్‌లో జన్మించారు. తండ్రి యుగంధర్ 1962 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. తల్లి సంస్కృత లెక్చరర్. సత్య ప్రాథమిక విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లోనే సాగింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రాధమిక విద్యనభ్యసించారు. మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివారు. 1988లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బీఈ పూర్తి చేశారు. 1996లో చికాగోలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా తీసుకున్నారు.

ఉద్యోగ ప్రస్థానం:

‘సత్యనారాయణ నాదెళ్ల అలియాస్ ‘సత్య నాదెళ్ల’ అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, చికాగో యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లోనూ మాస్టర్స్ డిగ్రీ చేశారు. అనంతరం సాఫ్ట్‌వేర్ రంగంలో పలు హోదాల్లో పనిచేశారు. అమెరికా పౌరసత్వం తీసుకుని అక్కడే స్థిరపడ్డారు. కొంతకాలం సన్ మైక్రో సిస్టమ్స్‌లో పనిచేసిన తర్వాత 1992లో ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన మైక్రోసాఫ్ట్‌లోకి అడుగుపెట్టారు. ఆ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా 2014 ఫిబ్రవరి 4 న నియమితులయ్యారు. వ్యాపార సేవల విభాగంలో కీలక పాత్ర పోషించి ఐదేళ్లలోనే కంపెనీ వ్యాపారాన్ని దాదాపు రూ. 9 వేల కోట్ల నుంచి రూ. 31 వేల కోట్లకు చేర్చారు. కొత్త సవాళ్లను స్వీకరించి సమర్థంగా నిర్వహిస్తూ ఆ తర్వాత పదేళ్లలోనే కంపెనీలో ఉన్నత స్థానాలను చేరుకున్నారు.

వ్యక్తిగత జీవితం:

సత్యనాదెళ్ల తండ్రి యుగంధర్‌ ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే వివాహాన్ని తన సహచరుడు కెఆర్ వేణుగోపాల్ కుమార్తెతో అతి సాధారణంగా జరిపించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లోనే చదివిన అనుపమను సత్య 1992లో పెళ్ళి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి. అమెరికాలోని వాషింగ్టన్లో నివసిస్తున్నారు. పుస్తకాలు చదవడం, ఆన్‌లైన్ కోర్సులు పూర్తి చేయడంపై సత్య ఆసక్తి చూపుతుంటారు. ఎప్పుడూ కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉండకపోతే గొప్ప పనులు చేయలేమన్నది ఆయన విశ్వాసం.

మరోవైపు నాదెళ్లకు మొదటి నుంచి క్రికెట్‌పై చాలా ఆసక్తి . స్కూల్ క్రికెట్ జట్టులో సత్య కూడా సభ్యుడే. బృందంతో సమన్వయంగా వ్యవహరించడం, నాయకత్వ లక్షణాలను క్రికెట్ నుంచే నేర్చుకున్నట్లు ఆయన ఇప్పటికీ చెబుతుంటారు. హెచ్‌పీఎస్ పూర్వ విద్యార్థుల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 2013 లో జరిగిన పాఠశాల 90వ వార్షికోత్సవంలో కూడా సత్య పాల్గొన్నారు. క్రికెట్‌తో పాటు, సీటెల్‌లో ఉన్న ప్రొఫెషనల్ అమెరికన్ ఫుట్‌బాల్ టీమ్ అయిన సీహాక్స్‌కు కూడా అతను పెద్ద అభిమాని. అతను తన ఫిట్‌నెస్ గురించి చాలా శ్రద్ధ తీసుకుంటాడు. అందుకే 54 ఏళ్ల వయసులో కూడా అతను చాలా యంగ్‌గా కనిపిస్తారు. తన కుమారుడికి బుద్ధిమాంద్యం ఉండటంతో అలాంటి పిల్లల కోసం హైదరాబాద్‌లో పాఠశాల పెట్టారు.

సత్య ఆల్ రౌండర్, నిజాయతీపరుడు, సహాయకారి, సాంకేతిక నిపుణుడు, ఆలోచనాపరుడు, దార్శనికుడు, ఆత్మవిశ్వాసం గల నాయకుడు. అందరితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడంలో ఆయన దిట్ట. సాదాసీదాగా ఉంటారు. ఎదుటి వారు చెప్పేది శ్రద్ధగా వింటారు. ఈ స్వభావాలే ఆయన్ని అందలానికి చేర్చాయంటారు సన్నిహితులు. ఒక సామాన్యుడు మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ గా ఎదగడం తెలుగు వారికి గర్వకారణం. భారతీయ యువత ఎంతో స్ఫూర్తి పొందే అవకాశం ఉంది సత్య నాదెళ్లను చూసి యువతరం, భావితరం ఉజ్వలంగా ప్రకాశించాలని కోరుకుందాం.. ఆయన మరెన్నో అద్భుతమైన పుట్టినరోజులు జరుపుకోవాలని టీవీ 9 శుభాకాంక్షలను తెలుపుతుంది.

Also Read:  మనదేశంలో జీరో రూపీ నోట్ ఉందని తెలుసా.. ఈ నోటు ఎక్కడ దొరుకుంటుంది.. ఎలా వాడాలంటే..