Health Tips: ఆ భయంతో చపాతీ తినడం మానేస్తున్నారా..? అసలు విషయం తెలిస్తే అవాక్కే..
గోధుమ పిండితో చేసే వంటకాలు చాలా మందికి సాధారణ ఆహారం, కానీ గోధుమ పిండి ఆరోగ్యానికి హానికరం అని కొందరు అంటుంటారు. కానీ ఇది ఎంతవరకు నిజం..? రోజూ చపాతీలు తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయా..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

భారతీయ వంటకాల్లో చపాతీ చాలా ముఖ్యమైనది. చాలా మంది రోజులో ఒక్కసారైనా చపాతీ తింటారు. కానీ ఇటీవల కాలంలో ఫిట్‌నెస్ విషయంలో శ్రద్ధ పెరిగిన చాలామంది ప్రజలు చపాతీ తినడం మానేస్తున్నారు. గోధుమల్లో గ్లూటెన్ అనే పదార్థం ఉంటుందని, ఇది ఆరోగ్యానికి హానికరమని కొందరు భావిస్తున్నారు. చపాతీ తినడం వల్ల బరువు పెరుగుతుందని, షుగర్ లెవెల్స్ పెరుగుతాయని కూడా నమ్ముతున్నారు. అయితే నిజంగా చపాతీ తినడం హానికరమా? నిపుణులు ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం.
నిపుణులు ఏమంటున్నారు?
హోలిస్టిక్ డైటీషియన్ డాక్టర్ గీతికా చోప్రా ప్రకారం.. గోధుమ అనేది ఒక సంక్లిష్ట కార్బోహైడ్రేట్. ఇది రోజంతా మీ శక్తి స్థాయిలను నిలకడగా ఉంచడంలో సహాయపడుతుంది. శుద్ధి చేసిన పిండి లాంటి సాధారణ కార్బోహైడ్రేట్లు శక్తిని త్వరగా పెంచి, త్వరగా తగ్గిస్తాయి. కానీ గోధుమ రోటీలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
చపాతీ కలిగే లాభాలు:
బరువు నియంత్రణ: చపాతీ త్వరగా కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దీనివల్ల అతిగా తినడాన్ని తగ్గించుకోవచ్చు, తద్వారా బరువును నియంత్రించుకోవచ్చు.
కండరాల పెరుగుదల: గోధుమల్లో కండరాల నిర్మాణానికి అవసరమైన ప్రోటీన్ ఉంటుంది.
విటమిన్లు, ఖనిజాలు: ఇందులో విటమిన్ బి, ఐరన్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇవి జీవక్రియ, రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయి.
గుండె ఆరోగ్యం: గోధుమలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఎవరు తినకూడదు..?
కొంతమందికి గ్లూటెన్ పడదు. అలాంటి వారికి చపాతీ తిన్న తర్వాత కడుపు ఉబ్బరం, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి, గోధుమలకు బదులుగా రాగి, జొన్న వంటి గ్లూటెన్ రహిత పిండితో చేసిన రోటీలను తీసుకోవడం మంచిది. ఒకవేళ మీకు గ్లూటెన్ పడకపోతేనే గోధుమ రోటీని మానేయండి. మిగిలిన వారందరికీ గోధుమ రోటీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉన్న పోషకాలు మీ మొత్తం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




