కరోనా రాకుండా ఉండేందుకు కషాయాలు తాగేస్తున్నారా ? అయితే రిస్క్ తప్పదు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
Corona Virus: కరోనా సెకండ్ వేవ్ మరింత భయంకరంగా వ్యాపిస్తోంది. దీని లక్షణాలు కూడా కాస్తా భిన్నంగా ఉన్నాయి. కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా ప్రాణాలను హరిస్తుంది.

Corona Virus: కరోనా సెకండ్ వేవ్ మరింత భయంకరంగా వ్యాపిస్తోంది. దీని లక్షణాలు కూడా కాస్తా భిన్నంగా ఉన్నాయి. కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా ప్రాణాలను హరిస్తుంది. ఈ మహమ్మారి సోకకుండా ఉండాలంటే కషాయాలు ఎక్కువగా తాగాలి. ఇలాంటి వార్తలన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంకేముంది వైరస్ నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఇంట్లోని వంటశాలలో ఉండే మసాలాలతో కషాయాలు రెడీ చేసుకోని సమయం సందర్బం లేకుండా తాగేస్తున్నారు. ఇక వైరస్ రాకుండా ఉండడమే కాకుండా.. రోగ నిరోధక శక్తిని పెంచుతాయంటూ.. అవసరానికి మించి మసాలాలను కలిపి సేవిస్తున్నారు. దీంతో కరోనా రావడం ఏమో కానీ.. ఇతర శరీర సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే కషాయాలు అదే పనిగా తాగడం కూడా మంచిది కాదు. దీనివల్ల గ్యాస్ట్రెయిటిస్, పొట్టలో ఇరిటేషన్ రావచ్చు. అందువలన వీటిని సరిపడినంతగా పరిమిత మోతాదులోనే తీసుకోవాలి. కాస్త కారం, ఘాటుగా ఉండాలి. కానీ మరీ ఘాటు ఉండకూడదు. అలాగే రోజులో ఎక్కువసార్లు తీసుకుంటే అల్సర్ వచ్చే ప్రమాదం లేకపోలేదు. గ్యాస్ సమస్య ఉన్నవారికి ఆ సమస్య మరింత పెరుగుతుంది. అందుకే కషాయాలు కేవలం పలుచగా 150 ఎంఎల్ నుంచి 200 ఎంఎల్ లోపు పరిమాణంలో తీసుకుంటే సరిపోతుంది. పుదీనా, మునగాకు, అల్లం, మరియాలు.. ఇతర పదార్థాలతో కషాయాలు రెడీ చేస్తున్నారు. కానీ గుర్తుంచుకోండి.. ఏదైనా మన శరీరానికి సరిపడేట్టుగా ఉండాలి.
ఇక ఆహారం విషయానికి వస్తే.. సాధారణంగా మనిషి ఎత్తు, బరువును బట్టి ఒక కిలోకి 0.75 గ్రాము నుంచి 1 గ్రాము ప్రోటీన్ సరిపోతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి 170 సెం.మీ. ఎత్తు ఉంటే 70 కిలోల బరువు ఉండాలి. ఎత్తు, బరువును పరిగణలోకి తీసుకొని అతనికి 70 గ్రాముల ప్రోటీన్ అవసరం పడుతుంది. అలాగని 80 కిలోలు ఉంటే 80 గ్రాముల ప్రోటీన్ అవసరం లేదు. వాళ్ళ ఐడియల్ బాడి వెయిట్ ఎంత ఉందో అంత ఇస్తే సరిపోతుంది. అలాగే రోజులో కనీసం 15 నుంచి 30 నిమిషాల పాటు శరీరానికి సూర్యరశ్మి తగిలేలా చూసుకొండి. ఇలా చేయడం వలన విటమిన్ డి లోటు తీరుతుంది. అలాగే ఎక్కువ తీపి పదార్థాలు, ఉప్పు, మసాలాలు ఆహార సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఇక మన శరీరానికి జింక్ కూడా చాలా అవసరం. కరోనా సహా ఏ అనారోగ్య సమస్యలు అయినా సరే ధ్వంసమైన కణాల స్థానంలోకి కొత్త కణాలు తయారుకావాలంటే జింక్ చాలా అవసరం. ఇందుకోసం పిస్తా, బాదం, జీడిపప్పు, పల్లీలు, గుమ్మడి గింజలు, ఫ్లాక్ సీడ్స్ నుంచి జింక్ ఎక్కువగా లభిస్తుంది. అలాగే మొలకెత్తిన గింజల్లో కూడా జింక్ తగినంత ఉంటుంది. అందుకే కషాయాలకు బదులుగా ఇలాంటి సహజ పదార్థాలను తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండడమే కాకుండా.. కరోనా సోకే ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.
Also Read: ఎండాకాలంలో మీ ముఖాన్ని కాపాడుకోవడానికి మామిడి పండ్లు చాలా ఉపయోగపడతాయి… కానీ ఎలా వాడాలి అంటే..




