Kakarakaya Pakoda: రొటీన్ పకోడీకి గుడ్‌బై.. సాయంత్రం స్నాక్స్‌కు కాకరకాయతో యమ్మీ ట్రీట్
చల్లని సాయంత్రం వేళలో వేడివేడిగా, కరకరలాడే పకోడీ తింటే ఆ అనుభూతే వేరు. సాధారణంగా అందరూ ఉల్లిపాయ పకోడీనే ఇష్టపడతారు. అయితే, ఎప్పుడూ రొటీన్‌కు భిన్నంగా కాస్త వెరైటీగా ఉండే కాకరకాయ పకోడీని ఇంట్లో తయారుచేయండి. కాకరకాయ అంటే చేదు అని వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు. దీని రుచి చూస్తే పిల్లల కూడా మళ్లీ మళ్లీ కావాలంటారు.

సరైన పద్ధతిలో చేస్తే, ఈ పకోడీలు అస్సలు చేదు లేకుండా, కరకరలాడుతూ, పిల్లలు సైతం ఇష్టంగా తినేంత రుచిగా ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా, ఈ ప్రత్యేకమైన వంటకం తయారీ, అందులోని కీలక చిట్కాలను ఇప్పుడు చూద్దాం. కాకరకాయ కూర తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ, అదే కాకరకాయతో పకోడీలు చేసుకుంటే, వాటి రుచి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా కాకరకాయలోని చేదును సులభంగా తొలగించవచ్చు.
కావలసిన పదార్థాలు:
కాకరకాయలు: 1/2 కిలో
శనగపిండి, బియ్యప్పిండి, కార్న్‌ఫ్లోర్: తలో 2 టేబుల్‌స్పూన్లు
ఉప్పు, కారం: సరిపడా (కారం 1 టీస్పూన్)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
మసాలాలు: జీలకర్ర పొడి (1/2 టీస్పూన్), వాము (1/4 టీస్పూన్), పసుపు (1/4 టీస్పూన్)
అదనపు పదార్థాలు: పచ్చిమిర్చి (2), కొత్తిమీర తరుగు, కరివేపాకు రెమ్మలు (3)
నూనె: వేయించడానికి.
తయారీ పద్ధతి :
ముక్కలు చేయాలి: కాకరకాయలను శుభ్రంగా కడిగి, చివరలు కట్ చేయాలి. వాటిని రెండు లేదా మూడు భాగాలుగా కోసుకోవాలి. మధ్యకు కట్ చేసి, ముదిరిన గింజలు ఉంటే తీసేయాలి. లేత గింజలు ఉంచవచ్చు.
పొడవుగా కోయాలి: కాకరకాయ ముక్కలను పొడవుగా, సన్నగా కోసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
ఉప్పుతో నానబెట్టాలి: ఈ ముక్కలలోకి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. మూత పెట్టి 10 నిమిషాలు పక్కన ఉంచాలి.
రసం తీయాలి (ముఖ్య చిట్కా): 10 నిమిషాల తరువాత, కాకరకాయ ముక్కలను చేతితో గట్టిగా పిండి, రసాన్ని తీసేయాలి. ఈ రసం తీయడం వలన కాకరకాయలోని చేదు పూర్తిగా పోతుంది. రసం తీసిన ముక్కలను మరో గిన్నెలోకి మార్చాలి.
పిండి మిశ్రమం తయారీ:
రసం తీసిన ముక్కల్లోకి శనగపిండి, బియ్యప్పిండి, కార్న్‌ఫ్లోర్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, వాము, పసుపు వేయాలి.
సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి కలపాలి.
చుక్క నీరు కూడా కలపకుండా పదార్థాలన్నీ ముక్కలకు బాగా కలిసేలా మిక్స్ చేయాలి. ముక్కల నుంచి వచ్చిన తేమ పిండి కలవడానికి సరిపోతుంది. ఒకవేళ జారుగా అనిపిస్తే కొంచెం పిండిని అదనంగా కలుపవచ్చు.
వేయించే విధానం:
స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్‌ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి.
కలిపి పెట్టుకున్న పకోడీ పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ నూనెలో వేయాలి.
మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, గరిటెతో రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేవరకు, కరకరలాడే వరకు వేయించాలి.
వేగిన పకోడీలను ప్లేట్‌లోకి తీసుకుంటే రుచికరమైన, చేదు లేని కాకరకాయ పకోడీ సిద్ధం.




