Sri Rama Navami: రాములోరి కల్యాణంలో ప్రసాదంగా పానకం, వడపప్పు.. దీని వెనుక ఆరోగ్య రహస్యం.. తయారీ విధానం మీకోసం
శ్రీరామ నవమి వేడుకలు చైత్రమాసం నవమి రోజున జరుగుతాయి. ఈ సమయంలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. వసంత ఋతువులో గొంతు సంబంధిత వ్యాధులు విజృంభిస్తాయి. దీంతో నవమికి ప్రసాదంగా అందించే పానకం, వడపప్పుమంచి ఆరోగ్యాన్నిస్తుందని చెబుతున్నారు.
శ్రీ రామనవమి వచ్చిందంటే చాలు దేశంలోని గల్లీ గల్లీలో కూడా సందడి మొదలవుతుంది. ఈ ఏడాది రామ నవమి మార్చి 30వ తేదీన వచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న రామాలయాలు అందంగా ముస్తాబవుతున్నాయి. పిన్నలు, పెద్దలు సీతారాముల కళ్యాణం జరపడానికి మేము సైతం అంటారు. అయితే సీతారాముల కళ్యాణం అనంతరం బెల్లం పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి.. అనంతరం వాటిని భక్తులకు పంచిపెడతారు. అయితే ఈ ప్రసాదం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధగుణాలున్నాయని ఆయుర్వేదం చెబుతుంది.
శ్రీరామ నవమి వేడుకలు చైత్రమాసం నవమి రోజున జరుగుతాయి. ఈ సమయంలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. వసంత ఋతువులో గొంతు సంబంధిత వ్యాధులు విజృంభిస్తాయి. దీంతో నవమికి ప్రసాదంగా అందించే పానకం, వడపప్పుమంచి ఆరోగ్యాన్నిస్తుందని చెబుతున్నారు. బెల్లం పానకంలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాల వల్ల కొన్ని రకాల వ్యాధులు నయమవుతాయి. పానకంలో వేసే మిరియాల్లో ఔషదగుణాలు ఉంటాయి. కఫాన్ని తగ్గించి జలుబు రాకుండా చేస్తాయి. దాహాన్ని తగ్గించే గుణం వీటికి ఉంది. మిరియాలు, ఏలకులు గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని ఇస్తే.. పెసర పప్పు తో తయారు చేసిన వడపప్పు ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైనదని కూడా చెబుతారు. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. ‘వడ’పప్పు జ్ఞానానికి ప్రతీక అని అంటారు. పెసరపప్పును ‘వడ’పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో ‘వడ’ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసర్లలో ఐరన్ పుష్కలం. రక్తహీనతను తగ్గించడానికి తోడ్పడతాయి. వడపప్పులో వాడే కొబ్బరిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే కొబ్బరి తినేవారిలో వైరల్, ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి బాగా పెరుగుతుంది.
పానకం తయారీకి కావాల్సిన పదార్ధాలు:
బెల్లం
మిరియాల పొడి
యాలకుల పొడి
నీరు
తయారీ విధానం: బెల్లం పానకం తయారీ కోసం ముందుగా లీటర్ నీరు తీసుకోవాలి. ఇందులో రెండు కప్పుల బెల్లం పొడి వేసి.. కలపాలి. అనంతరం యాలకుల పొడి, మిరియాల పొడి వేసుకుని కొంత కలపాలి. అంతే బెల్లం పానకం రెడీ.
వడపప్పు తయారీకి కావాల్సిన పదార్ధాలు
పెసర పప్పు – ఒక కప్పు
కొబ్బరి తురుము
కొంచెం పచ్చి మిర్చి
క్యారెట్ తురుము
నిమ్మరసం
ఉప్పు
తయారీ విధానం: ముందుగా పెసర పప్పుని నానబెట్టుకోవాలి. అనంతరం పప్పుని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, పచ్చి మిర్చి , నిమ్మరసం, ఉప్పు వేసుకుని బాగా కలపాలి. సుమారు అరగంట సేపు ఇలా ఉంచేసి.. తర్వాత తింటే వడపప్పు మంచి టేస్టీగా ఉంటుంది.
ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలున్న పానకం, వడపప్పులను ఒక్క శ్రీ రామనవమి రోజు నే కాకుండా ఈ వేసవి లో తరచుగా తీసుకోవడం మంచిది మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..