పెద్దగా పట్టించుకోరు.. కానీ, ఏమన్నా పోషకాలా..? ఈ పండు స్పెషాలిటీ తెలిస్తే వావ్ అనాల్సిందే..
నారింజ పండులో విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, బరువు నియంత్రణలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ, జీర్ణక్రియ మెరుగుదలకు తోడ్పడతాయి. క్యాన్సర్, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా నారింజ కీలక పాత్ర పోషిస్తుందని డైటీషియన్లు చెబుతున్నారు.

ఆరోగ్యకరమైన జీవనశైలికి నిత్యం పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం అవసరం. సీజనల్‌గా లభించే పండ్లతో పాటు అన్ని కాలాల్లోనూ దొరికే నారింజ పండు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. నారింజ పండులో ఉండే ఔషధ గుణాలు, పోషక విలువలను గురించి తెలుసుకుంటే.. ఈ పండును అస్సలు వదలకుండా తింటారు. వాస్తవానికి నారింజ పండు అద్భుతమైన పోషకాలను కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, బి స్వల్పంగా, విటమిన్ సి, బి1 అధిక మోతాదులో లభిస్తాయి. మానవ శరీరానికి రోజుకు అవసరమయ్యే విటమిన్ సి లో దాదాపు 70% వరకు ఒక నారింజ పండు నుంచే పొందవచ్చు. వీటితో పాటు సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, రాగి, గంధకం, క్లోరిన్లు వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా ఇందులో సమృద్ధిగా ఉంటాయి.
నారింజలో సమృద్ధిగా లభించే విటమిన్ సి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇది శరీరానికి ఐరన్‌ను గ్రహించడంలో సహాయపడి, రక్తనాళాలు, కార్టిలేజ్, కండరాలు, బోన్ కొల్లాజెన్ ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది. నారింజలోని ఫైబర్ త్వరగా ఆకలి కాకుండా పొట్ట నిండిన భావనను కలిగిస్తుంది.. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, నారింజలో సాల్యుబుల్ (కరిగే), ఇన్సాల్యుబుల్ (కరగని) అనే రెండు రకాల ఫైబర్‌లు ఉంటాయి. పండు పై పొరలో ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉండగా, గుజ్జులో సాల్యుబుల్ ఫైబర్ లభిస్తుంది. ఈ ఫైబర్‌లు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.
నారింజ పండు దాని నారింజ రంగు కారణంగా యాంటీఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్లను సమృద్ధిగా కలిగి ఉంటుంది. ప్రతి నారింజలో 170 కంటే ఎక్కువ ఫైటోకెమికల్స్, 60 ఫ్లేవనాయిడ్లు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి రోగనిరోధక లక్షణాలతో నిండి ఉంటాయి. నారింజ తినడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, ఆర్థరైటిస్, డిప్రెషన్, అల్జీమర్స్ వంటి సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.
నారింజలో లభించే పొటాషియం గుండె సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. అలాగే అధిక రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సోడియం ప్రభావాన్ని తగ్గించి రక్తపోటును సమర్థవంతంగా అదుపులో ఉంచుతుంది. ఊబకాయంతో బాధపడేవారు రెండు నుండి మూడు నారింజ పండ్లను స్నాక్‌గా తీసుకోవడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. మధుమేహులు కూడా 100 నుండి 150 గ్రాముల నారింజ పండ్లను తీసుకోవచ్చు, వీటిలో తక్కువ కేలరీలు ఉంటాయి.
గర్భిణులకు అవసరమైన ఫోలిక్ యాసిడ్‌ను నారింజ నుండి పొందవచ్చు. వ్యాయామం చేసే వారికి ఎక్కువ ఆక్సిజన్ పొందడానికి ఇది ఒక ఉత్తమ పండు. నారింజలో థయామిన్ (విటమిన్ B1) కూడా అధికంగా ఉంటుంది.. ఇది శరీరానికి పోషకాలను ప్రాసెస్ చేయడానికి, ఆహారాన్ని శక్తిగా మార్చడానికి సహాయపడుతుంది. ఇది ఋతుక్రమ సమస్యలు, నోటి దుర్వాసన, నోటి పుండ్లు వంటి వాటిని తగ్గిస్తుంది. విటమిన్ ఎ కంటి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే అజీర్ణ సమస్యలను తగ్గించి ఆహారనాళంలో క్రిములను నాశనం చేయడంలో కూడా సహాయపడుతుంది.
జ్యూస్ కంటే.. నేరుగా తినడమే బెటర్..
నారింజను నేరుగా పండుగా తినడం, సలాడ్‌లలో, లేదా పుడ్డింగ్‌లలో చేర్చుకోవడం వల్ల అన్ని పోషకాలు లభిస్తాయి. అయితే నారింజ రసం తీసినప్పుడు, ముఖ్యంగా దాన్ని వడగట్టినప్పుడు ఫైబర్ తొలగిపోతుంది. ఇది గ్లూకోజ్ స్థాయిలను పెంచి, కాలక్రమేణా కొవ్వు కాలేయానికి దారితీస్తుంది. మధుమేహ రోగులకు ఇది హానికరం. అయితే, ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్న పిల్లలకు, ఆహారం సరిగా తీసుకోలేని వృద్ధులకు నారింజ గుజ్జుతో సహా రసం ఇవ్వడం వల్ల వారికి ముఖ్యమైన ఫైబర్ లభించి, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
నారింజ పండు అన్ని వయసుల వారికి, వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. జ్వరం, కోవిడ్ వంటి అనారోగ్యాల నుంచి కోలుకునే వారికి ఇది మంచి ఆరోగ్యకరమైన ఆహారం. నారింజ వంటి పండ్లను మన ఆహారంలో భాగం చేసుకుంటే ఎల్లప్పుడూ.. ఆరోగ్యంగా ఉండొచ్చని డైటీషియన్లు చెబుతున్నారు..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
