TasteAtlas Rankings: నాన్వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్.. వరల్డ్ రికార్డ్ కొట్టిన భారతీయ వంటకం ఇదే..
ఆదివారం వస్తే నాన్వెజ్ ప్రియులకు పండగే. అంతలా వారాంతాల్లో వీటికి డిమాండ్ ఉంటుంది. హైదరాబాద్ వీధుల్లో దొరికే నాన్వెజ్ ఫుడ్ గురించైతే చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజామునుంచే క్యూ కడుతుంటారు. తాజాగా ప్రపంచస్థాయిలో టేస్ట్ అట్లాస్ నిర్వహించే ర్యాంకింగ్స్లో ఈసారి ఓ భారతీయ వంటకం సత్తా చాటింది. కీమాను ప్రపంచంలో బెస్ట్ బ్రెడ్ గా టేస్ట్ అట్లాస్ ప్రకటించింది. దీంతో పాటు మరికొన్ని వంటకాలు కూడా స్థానం దక్కించుకున్నాయి.

కీమా.. భారతదేశంలో ప్రసిద్ధమైన మాంసాహార వంటకం ఇది. తాజాగా టేస్ట్ అట్లాస్ నిర్వహించిన ర్యాంకింగ్స్ లో 100 ఉత్తమ గ్రౌండ్ మీట్ జాబితాలో 5వ స్థానం సంపాదించింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో ఆహార ప్రియులు ఈ వార్తను హైలెట్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నాన్వెజ్ లో ఎన్నో రకాల వెరైటీలున్నాయి. అయినా ఏరికోరి కీమానే టాప్ 5లో ఉండటానికి కారణాలేంటి అంటే దీని రుచిలో ఉన్న స్పెషాలిటీనే అంటున్నారు. అదేంటో మీరూ తెలుసుకోండి..
కీమా ఎలా తయారవుతుంది?
మటన్ ను మొత్తని మాంసంగా తయారు చేస్తే దాన్నే కీమాగా పిలుస్తుంటారు. సాధారణంగా దీన్ని మేక లేదా కోడి మాంసంతో తయారు చేస్తారు. దీనిలో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, నెయ్యి, మసాలాలు కలిపి వండుతుంటారు. ఈ రుచికరమైన వంటకాన్ని నాన్, పావ్‌తో తింటారు లేదా సమోసాలు, పరాఠాలలో ఫిల్లింగ్‌గా వాడతారు. “కీమా” అనే పదం ఉర్దూ భాష నుంచి వచ్చింది, అంటే “మెత్తని మాంసం” అని అర్థం.
కీమా ఎక్కడ నుంచి వచ్చింది?
ఫుడ్ హిస్టరీ నిపుణుడు బిరజా రౌట్ ప్రకారం, కీమా పర్షియన్ పదం “ఖీమా” నుంచి వచ్చింది. ఇది మొఘల్ కాలంలో భారతదేశానికి చేరింది. మొఘలులు తమ వంటశాలల్లో సుగంధ దినుసులతో కీమాను వండేవారు. కాలక్రమంలో ఉత్తర భారతదేశం, హైదరాబాద్, బెంగాల్‌లో స్థానిక రుచులతో కీమా ప్రజల ఇళ్లలో, వీధి ఆహారంలో భాగమైంది.
కీమా రుచి ఎందుకు ప్రత్యేకం?
కీమా రుచి మసాలాలు, వంట పద్ధతిలో ఉంది. గరం మసాలా, జీలకర్ర, ధనియాలు, లవంగాలు వంటివి కలిపి వండితే, మాంసం రుచులను బాగా పీల్చుకుంటుంది. “భునా” పద్ధతిలో తక్కువ మంటపై ఉల్లిపాయలు, మసాలాలతో వేయించడం—కీమాకు గాఢమైన రుచి, మెత్తదనం వస్తాయి. పచ్చిమిర్చి, టమాటాలు, కొత్తిమీర కలిపితే మరింత రుచి పెరుగుతుంది.
కీమా ఎందుకు ప్రసిద్ధమైంది?
కీమా ఇతర గ్రౌండ్ మీట్ వంటకాల కంటే భారతీయ మసాలాలతో ప్రత్యేకంగా ఉంటుంది. బొలోగ్నీస్ లేదా షెపర్డ్ పై వంటి పాశ్చాత్య వంటకాల కంటే దీని రుచి లోతుగా ఉంటుంది. దీన్ని కూరగా, నాన్‌లో ఫిల్లింగ్‌గా, లేదా కీమా పావ్‌గా వాడవచ్చు. హైదరాబాద్ సాధారణ స్పైసీ రుచితో దీన్ని వండుతారు. కోల్‌కతాలో దీనికి మంచి డిమాండ్ ఉంటుంది. ముంబై వీధుల్లో కీమాకు చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. ఇలా కీమా ప్రాంతాలను బట్టి మారుతూ, మొఘల్ వంటకం నుంచి ఆధునిక రుచిగా పరిణామం చెందింది.
