AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sankranti Special: సంక్రాంతి సంబరాల్లో పిండి వంటలకు ప్రత్యేక స్థానం.. దీని వెనుర ఆరోగ్య రహస్యం తెలుసా?

సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల ఆటలు కోడి పందాలు మాత్రమే కాదు.. గుమగుమలాడుతూ నోరూరించే ప్రత్యేకమైన సాంప్రదాయ వంటలు కూడా..  అరిసెలు, పోకుండలు, సున్నుండలు, జంతికలు, సకినాలు, నువ్వుల ఉండలు.. ఇలా ప్రాంతాలను బట్టి రకరకాల పిండి వంటలను తయారు చేస్తారు.

Sankranti Special: సంక్రాంతి సంబరాల్లో పిండి వంటలకు ప్రత్యేక స్థానం.. దీని వెనుర ఆరోగ్య రహస్యం తెలుసా?
Sankranti Special Food
Surya Kala
|

Updated on: Jan 13, 2023 | 12:48 PM

Share

హిందువులు జరుపుకునే పండగల్లో అతి పెద్ద పండగ సంక్రాంతి. సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు. హిందువుల పండగలను జరుపుకునే విధానం.. పండగ స్పెషల్స్ గా తినే ఆహారపదార్ధాల్లో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయని అంటారు. ప్రతి పండగకు ఆయా కాలాన్ని బట్టి  సాంప్రదాయ వంటలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల ఆటలు కోడి పందాలు మాత్రమే కాదు.. గుమగుమలాడుతూ నోరూరించే ప్రత్యేకమైన సాంప్రదాయ వంటలు కూడా..  అరిసెలు, పోకుండలు, సున్నుండలు, జంతికలు, సకినాలు, నువ్వుల ఉండలు.. ఇలా ప్రాంతాలను బట్టి రకరకాల పిండి వంటలను తయారు చేస్తారు. ఈ ఒకొక్క పిండి వంటకు ఒకొక్కరుచి..ఒకొక్క ప్రత్యేకత.. వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు.. ఈరోజు సంక్రాంతి పిండి వంటలు.. ఆరోగ్య రహస్యాల గురించి తెలుసుకుందాం..

అరిసెలు: సంక్రాంతి పండగ అనగానే అందరికి ముందుగా గుర్తుకొచ్చేవి అరిసెలు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా గోదావరి జిల్లాలో అరిసెలు లేని సంక్రాంతిని ­ఊహించుకోవడం కష్టం. వీటిని బెల్లం, కొత్త బియ్యపు పిండితో తయారు చేస్తారు. అదనపు రుచి కోసం కొబ్బరి, నువ్వులను జోడిస్తారు. బెల్లం రక్తాన్నిశుభ్రం చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. ఐరన్‌ సహా అనేక పోషకాలు శరీరానికి లభిస్తాయి.

జంతికలు:  పండగలో సంబంధం లేకుండా అన్ని రకాల వయసుల వారిని అలరించే వంటకం జంతికలు. మరి సంక్రాంతికి జంతికలు ప్రతి ఇంట్లోనూ తప్పని సరిగా ఉండే ఓ పిండి వంటకం. రకరకాల రుచులతో తయారు చేసుకునే ఈ స్నాక్ ఐటెం ను బియ్యం, పెసర పప్పు, లేదా శనగపిండి, ఉప్పు, కారం నువ్వులు జోడించి తయారు చేస్తారు. మరికొందరు వాము కూడా చేర్చుకుంటారు. ఇవి తేలికగా జీర్ణం అవుతుంది. వాము జీర్ణప్రక్రియను వేగవంతం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

సున్నుండలు: సంక్రాంతి అంటే తెలుగు లోగిళ్ళలో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా ఉండే సంప్రాయ పిండి వంట సున్ని ఉండలు. మినపప్పు, నెయ్యి, బెల్లం లేదా పంచదారతో వీటిని తయారు చేస్తారు. మినుములు ఆరోగ్యానికి ఆరోగ్యం.. శక్తిని ఇస్తాయి. బెల్లం రక్తాన్ని శుద్ధిచేస్తే, నెయ్యి  ప్రోటీన్లు, పలు రకాల పోషకాలను, శక్తిని అందీస్తుంది. కొత్త అల్లుళ్లకు తప్పనిసరిగా సున్ని ఉండలు పెట్టె ఆచారం ఇప్పటికీ గోదావరి జిలాల్లో కొనసాగుతోంది.

నువ్వుల ఉండలు: తెల్ల నువ్వులు, బెల్లం కలిపి చేసే ఈ నువ్వుల ఉండలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నువ్వుల్లో  ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్నాయి. శీతాకాలంలో నువ్వుల ఉండలను తినడం చాలామంచిది. ఎముకల బలహీనత, రక్తహీనతతో బాధపడేవారికి  నువ్వుల ఉండలు  మంచి పోషకాహారం.

మినప గారెలు: కనుమ రోజున మినుము తినమని సామెత.. కనుక కనుమ రోజున గారెలు.. కోడి కూర లేని తెలుగు లోగిళ్ళు ఉండవు అంటే అతిశయోక్తి కాదు. రుచిలోనే కాదు పోషకాల్లోనూ మిన్న ఈ మినప గారెలు. పొట్టు తీయని మినుములో పుష్కలంగా మాంసకృత్తులు, ప్రోటీన్లు, పోషకాలు ఉంటాయి.

మారుతున్న కాలంతో పాటు మోడ్రన్ పేరుతొ అలవాట్లలో కూడా మార్పులు వచ్చాయి. ఇప్పటి తరానికి సాంప్రదాయ వంటల కంటే.. ఫాస్ట్ ఫుడ్ ఐటెమ్స్ .. సీట్లు, కేకులు.. పిజ్జాలు వంటి వాటి చుట్టూ తిరుగుతున్నారు. చిన్న వయసులోనే ఎక్కువగా ఊబకాయం, ఇతర సమస్యల బారిన పడుతున్నారు. కనుక ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచిని ఇచ్చే మన సాంప్రదాయ వంటలను పిల్లలకు తప్పనిసరిగా అలవాటు చేద్దాం..

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇక్కడ ఇచ్చిన వార్తలు కేవలం పాఠకులకు అవగాహన కోసమే ఇవ్వబడింది. దీనిని టీవీ 9 తెలుగు ఖచితమని నిర్ధారణ చేయడం లేదు..