Diabetes Care in Monsoon: షుగర్ పేషెంట్స్.. వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

ఇప్పటికే వేసవి ముగిసి వర్షాకాలం మొదలైంది. ఈ సమయంలో బీపీ, మధుమేహం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాతావరణ మార్పుల వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి షుగర్ బాధితులు వర్షాకాలంలో మంచి ఆరోగ్యం కోసం కొన్ని చిట్కాలను పాటించడం అవసరం. ఇప్పటికే నియంత్రణ లేని మధుమేహం ఉన్నవారు స్వీట్లు ఎక్కువగా తినకుండా ఈ మార్గదర్శకాలను పాటించాలి.

Diabetes Care in Monsoon: షుగర్ పేషెంట్స్.. వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
Diabetes
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 06, 2024 | 7:00 AM

వర్షాకాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆరోగ్య స్థితి భిన్నంగా ఉంటుంది. తరచుగా షుగర్‌ లెవల్స్‌ నియంత్రణ కోల్పోవడం సాధారణం. కాబట్టి ఈ చిట్కాలు చాలా అవసరం. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదు. ముఖ్యంగా వర్షాకాలంలో రక్తంలో చక్కెర స్థాయి హెచ్చుతగ్గులకు లోనవుతుంది. అందువల్ల ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని ప్రభావితం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని మెరుగ్గా నిర్వహించడం కోసం, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా షుగర్‌ టెస్టులు చేయించుకుంటూ ఉండాలి. ఆహారం, జీవనశైలిలో మార్పులు చేయడంతోపాటు వైద్యుల సలహా మేరకు మందులు తీసుకోవడం చాలా అవసరం.

వర్షాకాలం అయినప్పటికీ మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలని గుర్తుంచుకోండి.ఈ సీజన్ లో కూడా మీ శరీరం నీటి శాతాన్ని కోల్పోతుంది. అందువల్ల పిల్లలు, పెద్దలు కూడా తరచుగా నీళ్లు తాగడం, ఆరోగ్యకరమైన జ్యూస్‌లను తీసుకోవడం చాలా ముఖ్యం. వర్షాకాలంలోనూ భూమిలోంచి వచ్చే వేడి కారణంగా విపరీతమైన చెమట వస్తుంది. ఇది శరీరంలో నీటి శాతాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో నీరు తాగడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. చక్కెర,తీపి పానీయాలకు దూరంగా ఉండండి. బదులుగా, హెర్బల్ టీ, మంచినీరు, ఆపై స్వయంగా తయారుచేసిన పండ్ల రసం మొదలైనవి తాగండి.

వర్షాకాలంలో మనం సాధారణంగా నూనెలో వేయించిన పదార్ధాలు, చక్కెర శాతం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడానికి ఇష్టపడతాము. కానీ మధుమేహం ఉన్నవారికి ఈ ఆహారం సరైనది కాదు. కాబట్టి సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం. తాజా పండ్లు, కూరగాయలతో సహా తృణధాన్యాలు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. తక్కువ తీపి సూచిక కలిగిన పండ్లను తీసుకోవడం రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడుతుంది. అలాగే, స్ట్రీట్‌ఫుడ్స్‌, అనారోగ్యకరమైన స్నాక్స్ వినియోగాన్ని తగ్గించండి. వీలైనంత వరకు ఇంట్లో వండిన ఆహారాన్ని తినడం వల్ల ఫుడ్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ పాదాలను జాగ్రత్తగా చూసుకోవాలని తరచుగా చెబుతుంటారు. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయి అదుపు తప్పితే పాదాల రంగు మారిపోతుంది. వర్షాకాలంలో నీరు నిలిచిపోవడం వల్ల ఇన్‌ఫెక్షన్ల వ్యాప్తి పెరుగుతుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు వీలైనంత వరకు నీళ్లలోకి వెళ్లకుండా, పాదాలను తడవకుండా ఉంచుకోవడం మంచిది. ఇందుకోసం పాదాలకు మంచి చెప్పులు లేదా బూట్లు ధరించాలి. పాదాల చర్మం ఎక్కడా గాయపడటం, చీలిపోకుండా చూసుకోవాలి. దీంతో వీలైనంత వరకు ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. పాదాలకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి

మధుమేహం నిర్వహణలో వ్యాయామం చాలా ముఖ్యమైనదని గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరు బాధపెట్టుకునేలా వ్యాయామం చేయమని ఎవరూ చెప్పరు. తేలికపాటి వాకింగ్‌ నుంచి చిన్నపాటి వ్యాయామాల వరకు ఇంట్లోనే చేసుకోవచ్చు. సరైన పట్టు లేని చెప్పులు లేదా బూట్లు ధరించి వర్షంలో నడవకూడదు. వీలైనంత వరకు వర్షంలో తడవకుండా ఉండండి.ముఖ్యంగా డయాబెటిక్ న్యూరోపతి ఉన్నవారు వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గాయం చిన్నదే అయినా అది పెద్దదై తర్వాత ఇబ్బందిని కలిగిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..