Heart Health: ఎక్సర్‌సైజ్ చేస్తున్నారా? ఈ 5 లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు!
శారీరక శ్రమ చేస్తూ గుండెపోటుకు గురవుతున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. సాధారణంగా తేలికపాటి తలనొప్పి, అలసట, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే మనం పెద్దగా పట్టించుకోం. కానీ, ఇవి మీ గుండె ప్రమాదంలో ఉందని తెలిపే సంకేతాలు కావచ్చు. ముఖ్యంగా, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు లేదా అధికంగా శారీరక శ్రమ చేసేవారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అదృష్టవశాత్తు, మన శరీరం ముందే కొన్ని సంకేతాలు ఇస్తుంది. వాటిని సకాలంలో గుర్తిస్తే, ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.

ఈ రోజుల్లో వ్యాయామం లేదా ఆటలాడుతున్నప్పుడు గుండెపోటుకు గురవుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. చాలామంది తేలికపాటి తలనొప్పి, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి వాటిని సాధారణంగానే భావిస్తారు. కానీ, ఈ లక్షణాలు మీ గుండె ప్రమాదంలో ఉందని సూచించే ముఖ్యమైన హెచ్చరికలు కావచ్చు. శరీరం ఇచ్చే ఈ సంకేతాలను ముందుగానే గుర్తించడం ద్వారా పెద్ద ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకుందాం.
1. కళ్లు తిరగడం, తల తేలికైనట్లు అనిపించడం
మీరు వ్యాయామం చేస్తున్నప్పుడు ఒక్కసారిగా కళ్లు తిరిగినట్లు అనిపించినా, తల తేలికైనట్లు అనిపించినా దాన్ని నిర్లక్ష్యం చేయకండి. గుండెకు తగినంత ఆక్సిజన్ అందనప్పుడు, మెదడుకు రక్త ప్రసరణ తగ్గినప్పుడు ఇలా జరుగుతుంది. ఇలాంటి సమస్య మళ్లీ మళ్లీ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
2. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కాస్త ఊపిరి ఆడకపోవడం సహజమే. కానీ, ఎటువంటి కారణం లేకుండా శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది ఎదురైతే గుండె సమస్యలకు సంకేతం కావచ్చు. గుండె సరిగా రక్తం పంప్ చేయనప్పుడు లేదా గుండె కొట్టుకునే వేగం అసాధారణంగా ఉన్నప్పుడు ఊపిరితిత్తులకు సరిపడా ఆక్సిజన్ అందక శ్వాస ఇబ్బందులు కలుగుతాయి.
3. అసాధారణమైన అలసట
ఎక్కువ శ్రమ లేకుండానే మీకు విపరీతమైన అలసటగా, బలహీనంగా అనిపిస్తే దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. గుండెపోటుకు ముందు చాలా మంది సాధారణం కంటే ఎక్కువగా అలసిపోతారు. అంటే గుండె శరీర అవసరాలకు తగ్గట్టుగా రక్తం పంప్ చేయలేకపోతుందని అర్థం.
4. విపరీతంగా చెమట పట్టడం
వ్యాయామం చేస్తున్నప్పుడు చెమట పట్టడం మామూలే. కానీ, చల్లటి చెమట పట్టడం లేదా శరీరం మొత్తం చెమటతో తడిసిపోవడం గుండెపోటుకు ఒక సంకేతం. గుండె ఎక్కువ శ్రమ చేయాల్సి వచ్చినప్పుడు, శరీరం ఒత్తిడికి లోనైనప్పుడు ఇలా జరుగుతుంది.
5. చేతులు, గొంతు లేదా దవడలో నొప్పి
గుండెపోటుకు ప్రధాన లక్షణం ఛాతీ నొప్పి. అయితే, కొన్నిసార్లు ఈ నొప్పి చేతులకు (ముఖ్యంగా ఎడమ చేయి), గొంతుకు లేదా దవడ వరకు విస్తరిస్తుంది. వ్యాయామం చేస్తున్నప్పుడు ఈ భాగాలలో నొప్పి, భారంగా అనిపిస్తే వెంటనే వ్యాయామం ఆపి, వైద్య సహాయం తీసుకోండి.
వ్యాయామం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయడం చాలా ప్రమాదకరం. ఈ సంకేతాలను వెంటనే గుర్తించి, వైద్య సహాయం పొందడం ద్వారా తీవ్రమైన సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.




