Chicken Vs Fish: చికెన్ vs చేపలు.. బరువు తగ్గాలనుకునే వారు దేనికి ఓటు వేయాలి?
మాంసాహారం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి చికెన్, చేపలు. ఇవి రెండూ ప్రోటీన్లకు అద్భుతమైన వనరులు అయినప్పటికీ, ఆరోగ్య పరంగా ఏది ఉత్తమమనే విషయంలో ఎప్పుడూ ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. కండరాల పుష్టి కోసం చికెన్ మేలా? లేక గుండె, మెదడు చురుకుదనం కోసం చేపలు మంచివా? ఈ రెండింటిలో ఉండే పోషక విలువలు, మన శరీరానికి అవి చేసే మేలు గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

వారంలో రెండు, మూడు సార్లు నాన్-వెజ్ తినే అలవాటు ఉన్నవారు చికెన్ తింటే మంచిదా లేక చేపలు తింటే మంచిదా అని తరచూ ఆలోచిస్తుంటారు. ఒకవైపు చికెన్ విటమిన్ బి, తక్కువ కొవ్వును అందిస్తే.. మరోవైపు చేపలు అరుదైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లను కలిగి ఉంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ రెండింటిలో ఏది ‘సూపర్ ప్రోటీన్’ అని పిలిపించుకుంటుందో ఇప్పుడు చూద్దాం.
చికెన్ ప్రయోజనాలు: చికెన్ అనేది ఒక అద్భుతమైన లీన్ ప్రోటీన్ వనరు. ఇందులో ఉండే విటమిన్ బి కండరాల పెరుగుదలకు, శరీరంలో శక్తిని నింపడానికి తోడ్పడుతుంది. ముఖ్యంగా చికెన్ బ్రెస్ట్ భాగంలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. అయితే, బ్రాయిలర్ చికెన్‌ను అతిగా తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని తగు మోతాదులో తీసుకోవడం శ్రేయస్కరం.
చేపల విశిష్టత: చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మెదడు పనితీరును చురుగ్గా ఉంచుతాయి. కంటి చూపుకు అవసరమైన విటమిన్ ఎ కూడా ఇందులో పుష్కలంగా ఉంటుంది. ప్రోటీన్లతో పాటు శరీరానికి అవసరమైన మంచి కొవ్వులు చేపల ద్వారా అందుతాయి. ముఖ్యంగా తాజా చేపలను తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి.. ప్రాసెస్ చేసిన ఫిష్ ప్రొడక్ట్స్‌కు దూరంగా ఉండాలి.
చికెన్, చేపలు రెండూ ఆరోగ్యానికి మేలు చేసేవే. మీరు కండరాలను పెంచుకోవాలనుకుంటే చికెన్ మంచి ఎంపిక.. గుండె ఆరోగ్యం, చర్మ సౌందర్యం ముఖ్యం అనుకుంటే చేపలు మేలైనవి. కాబట్టి మీ వ్యక్తిగత అభిరుచులు, ఆరోగ్య అవసరాలను బట్టి వీటిని మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. ఈ రెండింటిని మార్చి మార్చి తీసుకోవడం వల్ల అన్ని రకాల పోషకాలు మీ శరీరానికి అందుతాయి.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా అనారోగ్యం ఉన్నవారు లేదా బరువు తగ్గాలనుకునే వారు తమ డైటీషియన్ సలహా మేరకు సరైన మోతాదులో మాంసాహారం తీసుకోవడం ఉత్తమం.
