Tea – Coffee: టీ, కాఫీ ప్రియులకు గుడ్ న్యూస్..! అధ్యయనంలో భలే విషయం తేలింది
కాఫీకి, టీకి ఉన్న క్రేజ్ ఎప్పటికీ తగ్గదు. ఉదయాన్నే లేచి కాఫీ లేదా టీ తాగితేనే చాలా మందికి డే స్టార్ట్ అవుతుంది. ఇలా చాయ్ తాగడం చాలా మంది లైఫ్‌లో భాగమైపోయింది. ఒక వ్యక్తి రోజుకు 300 మిల్లీగ్రాముల వరకు కెఫీన్ తీసుకోవచ్చు. సో లిమిటెడ్‌గా కాఫీ తాగితే మంచిదే. తాజాగా చాయ్ ప్రియులకు మరో గుడ్ న్యూస్ వచ్చింది.
ఉదయాన్నే వేడి వేడిగా ఓ కప్పు కాఫీ, లేదా టీ పడితేనే రోజుకు గుడ్ స్టార్ట్‌గా చెబుతారు చాలామంది. పొద్దునే టీ లేదా కాఫీ తాగకపోతే ఎంతో లోటుగా ఫీలవుతారు. టీ, కాఫీ తాగనిదే అడుగు ముందుకు పడదంటే అతిశయోక్తి కాదు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరించినా కొందరు ఆ అలవాటును మానుకోలేరు. ఇలాంటి వారికి నిజంగా ఇది శుభవార్త అని చెప్పాలి. టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉన్నవారిలో తల, మెడ క్యాన్సర్ ముప్పు తగ్గవచ్చని ‘క్యాన్సర్ జర్నల్’లో ప్రచురితమైన అమెరికన్ క్యాన్సర్ సొసైటీ రీసెర్చ్‌లో వెల్లడైంది.
‘ఇంటర్నేషనల్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎపిడెమియాలజీ కన్సార్టియం’ నిర్వహించిన ఈ రీసెర్చ్‌లో టీ, కాఫీ వల్ల కలిగే బెనిఫిట్స్ తెలుసుకునే ప్రయత్నం చేశారు. పరిశోధకులు దాదాపు 14 రీసెర్చ్‌లకు సంబంధించిన డేటాను విశ్లేషించారు. అంతేకాదు, తల, మెడ క్యాన్సర్‌తో బాధపడుతున్న 9,500 మందికి పైగా రోగులను, క్యాన్సర్ లేని 15,700 మందిని పరీక్షించారు. ప్రతి రోజూ టీ, కాఫీలు తాగేవారిలో తల, మెడ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పరిశోధకులు తేల్చారు. నోరు, గొంతు, స్వరపేటికకు సంబంధించిన క్యాన్సర్లు వచ్చే ముప్పు తక్కువని తేలినట్టు వివరించారు.
కాఫీ తాగని వారితో పోలిస్తే రోజూ నాలుగు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగే వారిలో తల, మెడ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 17 శాతం తగ్గిందని గుర్తించారు. అలాగే, ప్రతి రోజూ కాఫీ తాగేవారిలో ‘ఓరల్ కేవిటీ క్యాన్సర్’ ముప్పు 30 శాతం, గొంతు క్యాన్సర్ ప్రమాదం 22 శాతం తగ్గుతోందని పరిశోధకులు కనుగొన్నారు. రోజూ 3-4 కప్పుల కాఫీ తాగితే ‘హైపోఫారింజియల్ క్యాన్సర్’ ముప్పు 41 శాతం తగ్గించవచ్చని, ‘ఓరల్ కేవిటీ క్యాన్సర్’ ప్రమాదాన్ని 25 శాతం తగ్గించవచ్చని రీసెర్చ్ పేర్కొంది. కెఫిన్ లేని కాఫీ కూడా ప్రయోజనకరమేనని తెలిపింది. కాఫీతో పాటు టీ కూడా హైపోఫారింజియల్ క్యాన్సర్ ప్రమాదాన్ని 29 శాతం తగ్గించడంలో సహాయపడుతుందని వెల్లడించింది. ప్రతిరోజూ ఒక కప్పు టీ తాగితే తల, మెడ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 9 శాతం మేర తగ్గుతుందని పేర్కొంది. ఇకహైపోఫారింజియల్ క్యాన్సర్ ప్రమాదాన్ని టీ తాగే అలవాటు దాదాపు 27 శాతం తగ్గించవచ్చని అధ్యయనం పేర్కొంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..