Reliance Jio: దేశంలోనే అతి పెద్ద ఐపీవోకు రంగం సిద్దం.. త్వరలో రానున్న రిలయన్స్ జియో
స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేవారికి రిలయన్స్ జియో గొప్ప శుభవార్త చెప్పింది. త్వరలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు వస్తున్నట్టు ప్రకటించింది. దీని ద్వారా దాదాపు రూ.40 వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే జరిగితే దేశంలో అతి పెద్ద ఐపీవోగా చరిత్ర నెలకొల్పుతుంది. దీనిపై ఇప్పటికే ప్రీ ఐపీవో ప్లేస్ మెంట్ కోసం ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతోంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు చెందిన టెలికాం విభాగమైన రిలయన్స్ జియో త్వరలో ఐపీవోకు రానుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఈ ఐపీవో ద్వారా రూ.35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లు సేకరించాలని భావిస్తున్నారు. ఈ ఏడాది రెండో టర్మ్ తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వడానికి ప్రణాళిక రూపొందించారు. ఇప్పటి వరకూ జరిగిన ఐపీవోలలో హ్యుందాయ్ మోటార్స్ అతి పెద్దదిగా రికార్డు సాధించింది. 2024 అక్టోబర్ లో జరిగిన ఐపీవోలో రూ.27,870 కోట్లు సమీకరించింది. ఆ తర్వాత స్థానంలో లైఫ్ ఇన్య్సూరెన్స్ కార్పొరేషన్ నిలిచింది. 2022లో ఈ సంస్థ రూ.21 వేల కోట్లు సాధించింది. ఇప్పుడు రిలయన్స్ జియో రూ.40 వేల కోట్ల నిధుల సేకరణ కోసం ఐపీవోకు రానుంది.
దేశంలోని టెలికమ్యూనికేషన్ కంపెనీలలో రిలయన్స్ జియో ఒకటి. దీనికి దేశంలో 46 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇండస్ట్రీస్ టెలికాం, ఇంటర్నెట్, డిజిటల్ వ్యాపారాల కోసం ఐదేళ్లలో రూ.26 వేల కోట్టు పెట్టుబడి పెట్టింది. అక్టోబర్ చివరి నాటికి కంపెనీకి 47 కోట్ల వైర్ లెస్ కస్టమర్ బేస్ ఉంది. గతేడాది జూన్ లో టారిఫ్ ల పెరుగుదల కారణంగా సెప్టెంబర్ త్రైమాసికంలో లాభంలో పెరుగుదల కనిపించింది. రిలయన్స్ జియో సంస్థ లాభాల బాటలో పయనిస్తోంది. దీనికి నికర లాభం వార్షికంగా 14 శాతం పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో రూ.6,231 కోట్లు సంపాదించింది. కంపెనీ వార్షికాదాయం ఏడు శాతం పెరిగి రూ.28,338 కోట్లకు చేరింది. జూలై – సెప్టెంబర్ చివరిలో రూ.26,478 కోట్ల ఆదాయం వచ్చింది. జియో వార్షిక ఈబీఐటీడీఏ 8 శాతం పెరిగి, రూ.15,036 కోట్లు సాధించింది. దీనికి ముందు 53.1 శాతం మార్జిన్ తో రూ.13,920 కోట్లుగా ఉంది.
రిలయన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యాపారాన్ని 2023లో జాబితా చేశారు. అదే ఏడాది జూలైలో దాని మూల సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఐ) నుంచి విడిపోయింది. ఆ తర్వాత జియో ఫైనాన్షియల్ షేర్ ధర డిస్కవరీ మోకానిజం కింద రూ.261.85గా నిర్ణయించారు. అనంతరం అక్టోబర్ 21న కంపెనీ షేర్లు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ)లో రూ.265 వద్ద లిస్ట్ అయ్యాయి. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)లో రూ.262కు జాబితా చేశారు. అనంతరం ఇవి రూ.304 వరకు పెరిగాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి