AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బ.. జింగ్ జింగ్ అమేజింగ్.. చలికాలంలో చల్లటి నీళ్లతో స్నానం చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా…?

చలికాలంలో చల్లటి నీళ్లతో తలస్నానం చేస్తే శరీరం వణికిపోతుంది. అయితే చల్లటి నీటితో స్నానం చేయడం ఒక ఛాలెంజింగ్ అనుభవమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా? తెలియకపోతే.. ఈ ఆసక్తికర విషయాలను తెలుసుకోండి.. చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అబ్బ.. జింగ్ జింగ్ అమేజింగ్.. చలికాలంలో చల్లటి నీళ్లతో స్నానం చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా...?
Benefits of bathing with cold water
Shaik Madar Saheb
|

Updated on: Dec 22, 2024 | 11:52 AM

Share

చలి తీవ్రత పెరుగుతోంది.. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.. ఈ క్రమంలో.. శీతాకాలంలో చల్లటి నీటిని తాకాలంటేనే ప్రజలు గజగజ వణికిపోతుంటారు.. ఇంకా స్నానం చేయాలంటే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇలాంటి పరిస్థితుల్లో చలికాలంలో చల్లటి నీళ్లతో తలస్నానం చేస్తే ఎలా ఉంటుంది..? ఆలోచిస్తేనే వణుకుపుడుతుంది కదా..? వాస్తవానికి ఇదోక ఛాలెంజింగ్ పరిస్థితి లాంటిది.. అయితే చల్లటి నీటితో స్నానం చేయడం ఒక ఛాలెంజింగ్ అనుభవమే.. కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా?.. తెలియకపోతే ఈ కథనాన్ని పూర్తిగా చదవండి..

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం.. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంపై చాలా మంచి ప్రభావాలు ఉంటాయి. దీనివల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

రక్తప్రసరణ మెరుగుపడుతుంది..

చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చల్లటి నీరు రక్త కణాలను ముందుగా కుంచించుకుపోయేలా చేస్తుంది.. తరువాత విస్తరించేలా చేస్తుంది. ఈ ప్రక్రియ రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. దీని కారణంగా తగినంత ఆక్సిజన్, పోషకాలు శరీరంలోని ప్రతి భాగానికి చేరుతాయి.

రోగ నిరోధకశక్తిని పెంచుతుంది..

రోగ నిరోధకశక్తిని పెంచడంలో చల్లని నీరు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.. ఇది చలికాలంలో వచ్చే సాధారణ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. అదనంగా, చల్లటి నీరు చర్మ రంధ్రాలను మూసివేస్తుంది.. చర్మం బిగుతుగా మారడంతోపాటు మెరుస్తూ ఉంటుంది. ఇది జుట్టుకు కూడా ఒక వరంలా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల జుట్టు మృదువుగా, మెరుస్తూ ఉంటుంది.. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.

ఒత్తిడి నుంచి ఉపశమనం..

ఒత్తిడితో కూడిన జీవితం నుంచి ఉపశమనం కావాలా? చల్లటి నీరు కూడా దీనికి పరిష్కారంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్ల స్థాయి పెరుగుతుంది.. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది కాకుండా, ఇది కండరాల వాపును కూడా తగ్గిస్తుంది.. ముఖ్యంగా వ్యాయామం తర్వాత మరింత ఉపశమనం లభిస్తుంది..

ఈ సమస్యలున్న వారికి అలర్ట్..

అయితే, చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ ఒకేలా ఉండవు. గుండె జబ్బులు, అధిక రక్తపోటు లేదా మధుమేహం ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే.. చల్లటి నీటితో స్నానం చేసే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి