బాదం పొట్టుతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రైఫ్రూట్స్ లో బాదం ఒక్కటి. చాలా మంది బాదం తినేటప్పుడు దానిపై ఉన్న పొట్టును తీసేస్తారు. కానీ ఆ పొట్టులోనే ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. బాదం పొట్టుని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Feb 01, 2025 | 4:02 PM

బాదం పొట్టులో ఫైబర్, పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పొట్టును ఎండబెట్టి పొడి చేసుకోవచ్చు. రోజుకు ఒక టీస్పూన్ పొడిని స్మూతీల్లో కలిపి తాగితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ పొడిని కుకీలు, కేకులు, మఫిన్లలో కూడా వేసుకోవచ్చు. ఓట్స్, పెరుగుపై చల్లుకొని కూడా తినొచ్చు.

బాదం పొట్టుని పొడి చేసి తేనె, కొబ్బరి నూనె లేదా రోజ్ వాటర్‌తో కలిపి పేస్ట్ చేసుకోవచ్చు. ఈ పేస్ట్‌ను ముఖానికి మర్దన చేస్తే చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. సున్నితమైన చర్మం గలవారు వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ స్క్రబ్‌ను ఉపయోగించి మంచి ఫలితాలు పొందవచ్చు.

బాదం పొట్టుని నీటిలో వేసి మరిగించి వడకట్టి తేనె, దాల్చిన చెక్క లేదా అల్లం ముక్కతో కలిపి టీలా తాగొచ్చు. ఈ టీలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీరం వేడి తగ్గుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. కెఫీన్ లేని ఈ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

బాదం పొట్టును నీటితో మరిగించి పేస్ట్‌లా చేసి సూప్‌లు, సాస్‌లు, స్ట్యూస్‌లో కలిపితే రుచి పెరుగుతుంది. ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం కూడా అందుతాయి. టమాటా, గుమ్మడికాయ లేదా కాలీఫ్లవర్ వంటి క్రీమీ సూప్‌లలో ఈ పేస్ట్‌ను కలిపితే ప్రత్యేకమైన రుచి వస్తుంది.

బాదం పొట్టుని చిన్న ముక్కలుగా చేసి ఇతర కూరగాయల వ్యర్థాలతో కలిపి ఎరువుగా తయారు చేసుకోవచ్చు. ఈ సహజ ఎరువును నేలలో వేస్తే మొక్కలకు పోషకాలు అందుతాయి, అవి ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇకపై బాదం పొట్టుని పడేయకుండా ఇలా ఉపయోగించుకుని ఆరోగ్య ప్రయోజనాలు పొందండి.





























