Secured loans: ఈ రుణాలు తీసుకుంటే భారీగా వడ్డీ ఆదా.. సెక్యూర్డ్ లోన్లతో ఉపయోగాలు ఇవే..!
ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సమయంలో రుణాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. వైద్య చికిత్స, అత్యవసర ఖర్చులు, వ్యాపారం ప్రారంభించడం, స్థిరాస్తిని కొనుగోలు చేయడం, చదువు కోసం.. తదితర కారణాలు దాని వెనుక ఉండవచ్చు. సాధారణంగా బ్యాంకుల నుంచి మనం రుణాలు తీసుకుంటాం. తక్కువ వడ్డీరేటు, సురక్షితంగా చెల్లించే అవకాశం ఉండడంతో అందరూ బ్యాంకులను ఆశ్రయిస్తారు. అయితే బ్యాంకులు అందించే రుణాలు రెండు రకాలుగా ఉంటాయి. వాటిని సెక్యూర్డ్ రుణాలు, అన్ సెక్యూర్డ్ రుణాలు అంటారు. వీటి లో సెక్యూర్డ్ రుణాలకు వడ్డీ తక్కువగా ఉంటుంది.

సెక్యూర్డ్ రుణాలు (సురక్షిత) పొందటానికి ఇల్లు, ఆభరణాలు, భూమి, వాహనం..ఇలా ఏదో ఒకదాన్ని రుణగ్రహీత తాకట్టు పెట్టాలి. తాకట్టు పెట్టిన ఆస్తికి అనుగుణంగా రుణం మంజూరు చేస్తారు. ప్రతి నెలా వాయిదాల రూపంలో రుణాన్ని వడ్డీతో సహా చెల్లించవచ్చు. వీటిని బ్యాంకులు చాలా త్వరగా, తక్కువ వడ్డీకే మంజూరు చేస్తాయి. ఒక వేళ రుణగ్రహీత వాయిదాలు చెల్లించకపోతే తాకట్టు పెట్టిన ఆస్తిని స్వాధీనం చేసుకునే వీలుంటుంది. అన్ సెక్యూర్డ్ రుణాలు అంటే వ్యక్తిగత రుణాలు. మీకు వచ్చే ఆదాయం, క్రెడిట్ స్కోర్ ఆధారంగా మంజూరు చేస్తారు. వీటి కోసం ఎటువంటి పూచీకత్తు, ఆస్తి తాకట్టు పెట్టనవసరం లేదు. కానీ వడ్డీ ఎక్కువ ఉంటుంది.
సెక్యూర్డ్ లోన్ల రకాలు
తనఖా రుణాలు
ఇంటిని పూచీకత్తుగా ఉంచి తనఖా రుణాలు తీసుకుంటారు. ఆస్తి కొనుగోలు చేయడానికి, ఇంటి మరమ్మతులు తదితర అవసరాలకు ఈ రుణాలు మంజూరు చేస్తారు.
వాహన రుణాలు
కార్లు, బైక్ లు, వాణిజ్య వాహనాలను కొనుగోలు చేయడానికి బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ఈ సమయంలో వాహనం పూచీకత్తుగా మారుతుంది. వాయిదాలు కట్టకపోతే వాహనాన్ని జప్తు చేస్తారు.
ఆస్తిపై రుణం
భూమి తదితర వాటిని తాకట్టు పెట్టి తీసుకునే వాటిని ఆస్తిపై రుణాలు అంటారు. వీటికి మీ భూమి పూచీకత్తుగా ఉంటుంది.
బంగారం రుణాలు
బంగారు ఆభరణాలు, నాణేలను తాకట్టు పెట్టి బంగారం రుణాలను తీసుకుంటారు. వీటిని స్వల్ప కాలిక రుణాలని పిలుస్తారు.
సెక్యూర్డ్ పర్సనల్ లోన్లు
వ్యక్తిగత అవసరాల కోసం తీసుకున్న రుణాలు, ఆభరణాలు, వాహనాలు, ఆస్తుల ద్వారా వీటిని మంజూరు చేస్తారు.
సెక్యూర్డ్ బిజినెస్ లోన్లు
వ్యాపారాల కోసం అందించే రుణాలను సెక్యూర్డ్ బిజినెస్ లోన్లు అంటారు. యంత్రాలు తదితర వాటిని పూచీకత్తుగా భావిస్తారు.
సేవింగ్స్ రుణాలు
పొదుపు ఖాతా, స్థిర డిపాజిట్లు ఉన్నవారికి వీటిని మంజూరు చేస్తారు.
అర్హతలు
సెక్యూర్డ్ లోన్లు తీసుకునే వారు 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు కలిగి ఉండాలి. భారత దేశ నివాసి అయి ఉండాలి. ఉద్యోగస్తులు, స్వయం ఉపాధి పొందేవారు, ఎన్ఆర్ఐలు, ఎన్ఆర్వోలు, రైతులు అర్హులు. కనీసం వార్షిక ఆదాయం రూ.3 లక్షలు ఉండాలి. అయితే రుణదాతను బట్టి ఈ నిబంధన మారుతుంది. రుణానికి సరిపడే ఆస్తులు కలిగి ఉండాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








