AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: నాగవైష్ణవి గుర్తుందా? మళ్లీ తెరపైకి 15 ఏళ్ల క్రితం నాటి ఘోరం.. భయంగా ఉందంటూ..

15ఏళ్ల క్రితం జరిగిన ఘోరం....తెలుగు రాష్ట్రాలను కలవరపరిచిన నేరం. ఆస్తుల కోసం పదేళ్ల పాపను ఫర్నేస్‌లో వేసి కాల్చి బూడిద చేసిన దారుణం. విజయవాడలో కిడ్నాప్‌ చేసి గుంటూరులో కడతేర్చిన వైనం...అందరిని కంటతడి పెట్టించింది. ఆ నాగ వైష్ణవి సోదరుడు ఇప్పుడు తమకు రక్షణ కావాలంటున్నాడు? తమను కాపాడాలంటున్నాడు? అదే కథ, పాత పగ రిపీటవుతుందని భయపడుతున్నాడు.

Vijayawada: నాగవైష్ణవి గుర్తుందా? మళ్లీ తెరపైకి 15 ఏళ్ల క్రితం నాటి ఘోరం.. భయంగా ఉందంటూ..
Vijayawada Naga Vaishnavi Murder Case
Shaik Madar Saheb
|

Updated on: Nov 08, 2025 | 11:36 AM

Share

నాగ వైష్ణవి హత్య కేసులో.. ఇప్పుడు హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన పంది వెంకట్రావుతో తమకు ప్రాణహాని ఉందన్న ఆమె సోదరుడి కంప్లయింట్‌తో, ఆ చిన్నారి హత్యోదంతం మళ్లీ తెర పైకి వచ్చింది. ఆనాడు జరిగిన ఘోరాన్ని మరోసారి గుర్తుకు తెచ్చింది. విజయవాడకు చెందిన పలగాని ప్రభాకరరావు తన మేనకోడలిని వివాహం చేసుకున్నారు. పిల్లలు పుట్టి చనిపోతుండటంతో దీనికి మేనరికమే కారణమని తెలుసుకున్నారు. దీంతో నిజామాబాద్‌కు చెందిన నర్మదాదేవిని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, నాగవైష్ణవి అనే పాప కూడా ఉంది. నాగవైష్ణవి పుట్టాక ప్రభాకరావు వ్యాపారం వృద్ధి చెందింది. ఆ పాపపై ఆయన మమకారం పెంచుకున్నారు. అదే మొదటి భార్య కుటుంబంలో విభేదాలకు కారణమైంది. ప్రభాకరరావు మొదటి భార్య సోదరుడు పంది వెంకటరావు బావపై కక్షపెంచుకున్నాడు. ఆస్తి అంతా రెండో భార్య పిల్లల పేరున రాస్తారని అనుమానించాడు.

2010, జనవరి 30న జరిగిన దారుణం..

నాగవైష్ణవిని హతమారిస్తే గాని తన అక్క కాపురం బాగుపడదని భావించి, హత్యకు కుట్ర పన్నాడు. తన బంధువైన మోర్ల శ్రీనివాసరావుతో రూ.50లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. శ్రీనివాసరావు తన దగ్గర పనిచేసే జగదీష్‌ సాయం తీసుకున్నాడు. 2010 జనవరి 30న ఇంటి నుంచి సోదరుడు తేజేశ్‌ గౌడ్‌తో కలిసి నాగవైష్ణవి కారులో బయలుదేరింది. ఇది గమనించిన శ్రీనివాసరావు, జగదీశ్​ వారి కారు వెనుక రాళ్లతో దాడి చేశారు. డ్రైవర్‌ లక్ష్మణరావు కారుదిగి పరిశీలిస్తుండగా అతడిని కత్తులతో పొడిచారు.

దీంతో తేజ్‌శ్ కారు నుంచి దూకి పారిపోయాడు. కత్తిపోట్లకు గురైన డ్రైవర్‌ను స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లగా, అతడు అప్పటికే కన్నుమూశాడు. నాగవైష్ణవిని అపహరించిన నిందితులు గుంటూరు జిల్లా తాడేపల్లిలో మరో కారులోకి ఆమెను మార్చారు. చిన్నారి కేకలు వేస్తుండటంతో గొంతు నొక్కారు. దీంతో వైష్ణవి కారులోనే కన్నుమూసింది. ప్లాస్టిక్‌ డ్రమ్ము కొని మృతదేహాన్ని అందులో వేసిన నిందితులు గుంటూరు శివారు ఆటోనగర్‌లోని శారదా ఇండస్ట్రీస్‌కు తీసుకెళ్లారు. ఆ పాపను విద్యుత్‌ కొలిమిలో వేసి బూడిద చేశారు.

చిట్టితల్లి హత్యతో తల్లడిల్లిన తండ్రి గుండె..

తన చిట్టితల్లి హత్య విషయం తెలిసిన ప్రభాకరరావు విలవిల్లాడిపోయారు. గుండెపోటుతో మరణించారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే నాగవైష్ణవి తల్లి, బాబాయి కన్నుమూశారు. విజయవాడ మహిళా సెషన్స్‌ కోర్టు ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ 2018 జూన్‌ 14న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ దోషులు హైకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు వేశారు. తాజాగా జరిగిన తుది విచారణలో A-1 మొర్ల శ్రీనివాస్, A-2 యంపరాల జగదీష్‌ను దోషులుగా ప్రకటించిన, హైకోర్టు.. A-3 పంది వెంకట్రావును నిర్దోషిగా ప్రకటించింది.

విజయవాడ సీపీకి హరీష్‌ ఫిర్యాదు

అయితే పంది వెంకట్రావు విడుదలతో తమకు భయంగా ఉందంటున్నారు నాగ వైష్ణవి సోదరుడు శ్రీ హరీష్‌. దీనిపై విజయవాడ సీపీకి కంప్లయింట్‌ చేశారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆస్తి గొడవలు ఇంకా కొనసాగుతున్నాయని, వెంకట్రావు నుంచి తమకు ప్రాణహాని ఉందంటున్నాడు శ్రీహరీష్‌. వెంకట్రావును నిర్దోషిగా ప్రకటించడంపై సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్తామన్నారు హరీష్‌. తమకు న్యాయం చేయాలంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు ఆయన విజ్ఞప్తి చేశారు.

పాత పగలు రగలకుండా, కొత్త రక్త చరిత్రలు తిరిగి రాయకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..