5

జగిత్యాలలో కొత్త పెళ్లి కూతురు కిడ్నాప్

ఓ కొత్త జంట పెళ్లి చేసుకుని గంటలు కూడా గడవలేదు. అంతలోనే నవ వధువు అపహారణకు గురైంది. నవ వధువు కిడ్నాప్‌ జగిత్యాలలో కలకలం రేపింది.

జగిత్యాలలో కొత్త పెళ్లి కూతురు కిడ్నాప్
Follow us

|

Updated on: Nov 09, 2020 | 8:51 PM

ఓ కొత్త జంట పెళ్లి చేసుకుని గంటలు కూడా గడవలేదు. అంతలోనే నవ వధువు అపహారణకు గురైంది. నవ వధువు కిడ్నాప్‌ జగిత్యాలలో కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకుందని కుటుంబ సభ్యులు మరికొందరితో కలిసి నవవధువును తీసుకెళ్లి పోయారు. ఈ సంఘటన జిల్లాలోని పొరండ్ల గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.

జగిత్యాల రూరల్‌ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన వేముల రాకేశ్, సారంగాపూర్‌ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన కొంపల సమత ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు వారు ఒకటయ్యేందుకు ససేమిరా అన్నారు. వారి పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో ఈ నెల 7న మల్యాల మండలం ఒబులాపూర్‌ వీరభద్రస్వామి దేవాలయంలో వివాహం చేసుకున్నారు. అదేరోజు తమకు రక్షణ కావాలంటూ నూతన జంట సారంగాపూర్‌ పోలీసులను ఆశ్రయించారు.

పోలీసులు యువతి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ చేసి పంపించారు. దంపతులు రాకేశ్‌–సమత పొరండ్ల గ్రామంలో కొత్తగా కాపురం పెట్టారు. అయితే, సోమవారం మధ్యాహ్నం సమత సోదరుడు సాయికుమార్‌తోపాటు మల్యాల మండలం రాజారం గ్రామానికి చెందిన బుర్రల ప్రవీణ్‌తో సహా మరో నలుగురు పొరండ్ల గ్రామానికి చేరుకుని రాకేశ్, అతని కుటుంబ సభ్యులపై దాడిచేసి సమతను బలవంతంగా కారులో తీసుకెళ్లారు. దీంతో భర్త వేముల రాకేశ్‌ జగిత్యాల రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.