తడకల మాటున చాటుమాటు యవ్వారం.. తొంగిచూసిన స్థానికుల మైండ్ బ్లాక్!
నిజామాబాద్ నగర నడిబొడ్డున గుప్త నిధుల తవ్వకాలు స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఒక మహిళ తన సొంత స్థలంలో గత వారం రోజులుగా రహస్యంగా తవ్వకాలు జరిపించడం ఈ కలకలానికి కారణమైంది. చాటుమాటున సాగుతున్న ఈ వ్యవహారంపై భయాందోళనలకు గురైన స్థానికులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో ఎవరికీ అనుమానం రాకుండా సదరు మహిళ తన స్థలం చుట్టూ తడకలు అడ్డుగా నిర్మించి లోపల ఏం జరుగుతుందో తెలియకుండా జాగ్రత్త పడింది. కేవలం పగటిపూట తవ్వకాలు జరపడమే కాకుండా, అర్ధరాత్రి వేళల్లో అక్కడ పెద్ద ఎత్తున క్షుద్రపూజలు కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా రాత్రి సమయాల్లో వినిపిస్తున్న వింత శబ్దాలు, పూజల ఆనవాళ్లతో స్థానికులకు గట్టి అనుమానం వచ్చింది.
దీంతో గురువారం (మే 28) రాత్రి స్థానికులంతా ఏకమై సదరు మహిళను నిలదీశారు. లోపలికి వెళ్లి చూడగా గుప్త నిధుల కోసం పెద్ద గుంత తవ్వి ఉండటం చూసి వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. తడకల మాటున సాగుతున్న ఈ వ్యవహారంపై స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, క్షుద్రపూజల సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసుల రాకను గమనించిన సదరు మహిళ, పూజలు చేసిన మంత్రగాళ్లు అక్కడి నుండి పరారయ్యారు. నగర నడిబొడ్డున ఇలాంటి ఘటన వెలుగుచూడటంతో ఎల్లమ్మగుట్ట పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..