పనసపండులో ఉండే సుక్రోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. రసాయనాలతో కూడిన ఎనర్జీ డ్రింక్స్ తాగే బదులు కొన్ని పనస తొనలు తినడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉండవచ్చు.
వేసవిలో నీటి శాతం తగ్గి చాలామంది జీర్ణసంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. పనసపండులో పీచుపదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రేగుల కదలికలను సులువుగా మార్చి, మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.
ఇందులో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచి, వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, వైరల్ జ్వరాల నుండి రక్షణ కల్పిస్తాయి.
వేసవిలో వచ్చే వడదెబ్బ ప్రభావం శరీరంపై పడకుండా ఇది అడ్డుకుంటుంది. అలాగే జీర్ణాశయాన్ని శుభ్రపరిచి, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.
పనసపండులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో సోడియం శాతాన్ని సమతుల్యం చేసి, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీనివల్ల గుండెపై ఒత్తిడి తగ్గి, హార్ట్ ఎటాక్ వంటి ముప్పులు తప్పుతాయి.
పనసపండులోని విటమిన్-ఎ, బీటా-కెరోటిన్ కంటి చూపును మెరుగుపరుస్తాయి. అలాగే ఇందులోని యాంటీఆక్సిడెంట్లు వయసు పెరగడం వల్ల వచ్చే చర్మ ముడతలను తగ్గించి, ఎండ తీవ్రతకు చర్మం పొడిబారకుండా కాపాడి సహజమైన గ్లో అందిస్తాయి.
పనసపండులో కొవ్వు పదార్థాలు, కొలెస్ట్రాల్ అస్సలు ఉండవు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి ప్రత్యామ్నాయం. ఈ ఎండకాలంలో ఐస్‌క్రీమ్‌లు, కూల్‌డ్రింక్స్ వంటి జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండండి.
కృత్రిమ పానీయాలకు దూరంగా ఉండి, వేసవిలో ఆరోగ్యంగా ఉండటానికి పనసపండును రోజూవారీ ఆహారంలో చేర్చుకోవడం ఎంతో మేలని నిపుణులు సూచిస్తున్నారు.