AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarpanch Election: అమెరికా టూ తెలంగాణ.. మామ వేసిన ఒక్క ఓటుతో సర్పంచ్‌గా గెలిచిన కోడలు

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంత ముఖ్యమో తెలియజేసే ఆసక్తికర ఘటన నిర్మల్ జిల్లాలో వెలుగు చూసింది. కోడలు తమ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడంతో.. అమెరికా నుంచి వచ్చి మరీ వేసిన మామయ్య ఓటు.. కోడలి గెలుపులో కీలకంగా మారింది. రెండో విడతలో జరిగిన ఎన్నికల్లో ఆమే ఒక్క ఓటు తేడాతో సర్పంచ్‌గా విజయం సాధించింది. దీంతో విజయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Sarpanch Election: అమెరికా టూ తెలంగాణ.. మామ వేసిన ఒక్క ఓటుతో సర్పంచ్‌గా గెలిచిన కోడలు
Naresh Gollana
| Edited By: Anand T|

Updated on: Dec 15, 2025 | 6:14 PM

Share

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ముఖ్యమే.. గెలుపు, ఓటములు అనేవి ఒక్క ఓటుతోనే ప్రభావితం అవుతాయని తెలంగాణలో జరిగిన రెండో విడత ఎన్నికలు నిరూపించాయి. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామానికి చెందిన ముత్యాల శ్రీవేద అనే మహిళ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచింది. దీంతో అమెరికాలో ఉంటున్న ఆమె మామ ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి.. ఎన్నికల్లో కోడలికి మద్దతుగా నిలిచేందుకు స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఎన్నికల రోజున తన అమూల్యమైన ఓటున హక్కును వినియోగించుకున్నాడు.

అయితే ఆదివారం బాగాపూర్ గ్రామంలో పోలింగ్ హోరాహోరీగా జరిగింది. ఇరు పార్టీల అభ్యర్థులు బలంగా ఉండడంతో ఫలితాల్లో ఉత్కంఠ నెలకొంది. ఆ గ్రామంలో మొత్తం 426 ఓట్ల ఉండగా 378 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఓట్ల లెక్కింపులో భాగంగా శ్రీవేదకు 189 ఓట్లు రాగా, ఆమె సమీప ప్రత్యర్థి హర్షస్వాతికి 188 ఓట్లు వచ్చాయి. దీంతో కేవలం ఒక్క ఓటు తేడాతో శ్రీవేద తన ప్రత్యర్థిపై విజయం సాధించింది.

దీంతో తన మామ ఇంద్రకరణ్ రెడ్డి అమెరికా నుంచి వచ్చి వేసిన ఆ ఒక్క ఓటే ఆమె గెలుపునకు కారణం అయ్యిందని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు భావించారు. తాను వేసిన ఒక్క ఓటుతో కోడలు విజయం సాధించిందని.. అమెరికా నుంచి వచ్చి ఓటు వేసినందుకు తనకు ఫలితం దక్కిందని వారు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.