AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Narayana Death Anniversary: ఐదు నందులు అందుకున్న నవ్వుల రేడు ఎంఎస్ నారాయణ వర్ధంతి నేడు

ప్రపంచ జనాభా కోట్లలో వుండచ్చు అయితే నటన అనేది చాలా కొద్దిమందికే లభించే భగవంతుని వరం. అందుకే కళాకారులు మరణించే చిరంజీవులు.. వారు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు..

MS Narayana Death Anniversary: ఐదు నందులు అందుకున్న నవ్వుల రేడు ఎంఎస్ నారాయణ వర్ధంతి నేడు
Surya Kala
|

Updated on: Jan 23, 2021 | 11:46 AM

Share

MS Narayana Death Anniversary: ప్రపంచ జనాభా కోట్లలో వుండచ్చు అయితే నటన అనేది చాలా కొద్దిమందికే లభించే భగవంతుని వరం. అందుకే కళాకారులు మరణించే చిరంజీవులు.. వారు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు.. కానీ వారు నటించిన సినిమాల ద్వారా ఎల్లపుడూ మనకు కనిపిస్తూనే ఉంటారు. అలా నవ్వించేందుకే జీవితం అన్నట్లు సాగారు హాస్య నటుడు ఎంఎస్ నారాయణ. రచయితగా సినీరంగంలోకి వచ్చిన ఎమ్మెస్ నటుడిగా మారి తాగుబోతు పాత్రలకు పెట్టింది పేరుగా మారారు. తాగుబోతు పాత్రలతో తనకంటూ ట్రెండ్ సెట్ చేసుకున్న ఎమ్మెస్ నారాయణ జీవితమనే నాటక రంగంనుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. నవ్వడమే నా అలవాటు… నవ్వించడమే నాకిష్టం అంటూ అలరించిన ఎమ్మెస్ 2015 జనవరి 23న కన్నుమూశారు. నేడు ఆయన వర్ధంతి సందర్బంగా ఎమ్మెస్ పంచిన నవ్వులను గుర్తు చేసుకుందాం…

1951 ఏప్రిల్ 16న జన్మించిన ఎమ్మెస్ నారాయణ..20 ఏళ్ళలో 700 చిత్రాల్లో నటించారు. ఈ రికార్డును గిన్నిస్ బుక్ గుర్తించినా, గుర్తించక పోయినా, తెలుగువారికి ఆయన పంచిన నవ్వులు గుర్తుంటాయి. తెరపై ఆయన కనిపించగానే ప్రేక్షకుల పెదాలపై నవ్వులు నాట్యం చేసేవి. పాఠాలు చెప్పే పంతులు పకపకా నవ్వించడం కూడా నేర్చి ఉండాలి… లేకపోతే విద్యార్థులకు హుషారు తగ్గి అసలుకే మోసం వస్తుంద నేవారు పూర్వకాలపు ఉపాధ్యాయులు. అదే రీతిన తాను పాఠాలు చెప్పే సమయంలో అభినయించి మరీ పకపకలు పండించారు ఎమ్మెస్ నారాయణ. చదువుకొనే రోజుల నుంచీ ఎమ్మెస్ నవ్వులు పూయిస్తూ ఉండేవారు. తరువాత కలం పట్టి నాటకాలు రాశారు. వాటిలోనూ నవ్వులే అధికంగా పూయించారు. ఆ రచనలే చిత్రసీమలో ఎమ్మెస్ కు చోటు చూపించాయి. ఆ పకపకలే ఆయనను చెన్నపట్టణం చేరేలా చేశాయి…ఆరంభంలో రవిరాజా పినిశెట్టి వెంట ఉంటూ.. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రాలకు రైటర్‌గా పనిచేశారు. రవిరాజా తెరకెక్కించిన కొన్ని చిత్రాల్లోనూ నటించారు. అయినా.. అవేవీ ఎమ్మెస్‌కు అంతగా గుర్తింపు సంపాదించి పెట్టలేకపోయాయి. ఆ తరువాత ఇ.వి.వి. సత్యనారాయణ తెరకెక్కించిన ‘మా నాన్నకి పెళ్ళి’ (1997) చిత్రంతో ఎమ్మెస్ కు నటుడిగా బ్రేక్ లభించింది. అందులో తాగుబోతు పాత్రలో నటించి మెప్పించారు. దాంతో మరి వెనుదిరిగి చూసుకోలేదాయన…ఇక అక్కడ నుంచి ఎమ్మెస్ కు అలాంటి పాత్రలే లభించసాగాయి. అయితే వాటిలోనూ వైవిధ్యం చూపించి ఆకట్టుకున్నారు.

ఎమ్మెస్ నారాయణతో నవతరం దర్శకులు పలు ప్రయోగాలు చేశారు… ఆయనతో స్ఫూఫులు చేయించడం మొదలెట్టారు… అవి జనాన్ని భలేగా ఆకట్టుకోవడంతో అదే తీరున పలువురు దర్శకులు సాగారు… ఎమ్మెస్ తన అభినయంతో పలు అవార్డులు, రివార్డులు సంపాదించారు. ఐదు సార్లు ఉత్తమ హాస్యనటుడుగా నంది అవార్డును సొంతం చేసుకున్నారు ఎమ్మెస్ నారాయణ. “మానాన్నకి పెళ్ళి, రామసక్కనోడు, సర్దుకు పోదాం రండి, శివమణి, దూకుడు” చిత్రాలతో ఎమ్మెస్ ఇంట ‘నంది’వర్ధనాలు పూశాయి. ఆయన తెరపై కనిపించగానే జనం పగలబడి నవ్వేవారు. ఆయనలోని నటుణ్ణి ఇ.వి.వి. తరువాత శ్రీను వైట్ల బాగా ఉపయోగించుకున్నారని చెప్పాలి. పూర్వాశ్రమంలో ఎమ్మెస్ నాటకాలు రాసి, వేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ నాటకాల్లో కొన్నిటికి దర్శకత్వం కూడా వహించారు. ఈ నేపథ్యంలో నటుడిగా మారిన తరువాత ఎమ్మెస్ లో దర్శకత్వం వైపూ గాలి మళ్ళింది. తనయుడు విక్రమ్ ను హీరోగా పరిచయంచేస్తూ ‘కొడుకు’ సినిమాతో మెగాఫోన్ పట్టారు ఎమ్మెస్. కొడుకును హీరోగా చూసుకోవాలన్న అభిలాష నెరవేరింది. కానీ, కోరుకున్న కమర్షియల్ సక్సెస్ దరిచేరలేదు. అయినా మరో ప్రయత్నంలో ‘భజంత్రీలు’ తీశారు. సరిగా చప్పుడు చేయలేకపోయింది.

కత్తిమీద సాములాంటి హాస్యంలో పలు సాములు చేసిన ఘనుడు ఎమ్మెస్ నారాయణ. చిత్ర పరిశ్రమను నమ్ముకుంటే వమ్ము కాము అని చాలామంది అంటూ ఉంటారు. అలాగే ఎమ్మెస్ కూడా సినిమా రంగాన్ని నమ్ముకున్నారు. తనకంటూ సినీ చరిత్రలో ఓ పేజీ లిఖించుకున్నారు. నారాయణ నవ్వుల నావ సజావుగా సాగుతున్న సమయంలోనే అనూహ్యంగా మునిగిపోయింది. ఎమ్మెస్ అభిమానులకు తీరని వేదన కలిగించింది. భౌతికంగా ఎమ్మెస్ మన మధ్య లేకపోయినా, ఆయన పంచిన నవ్వులు మాత్రం ఇప్పటికీ గుర్తుకు వస్తే చాలు గిలిగింతలు పెడుతూనే ఉంటాయి.

Also Read: 150 గ్రా. కోల్గెట్ పేస్ట్‌ను రూ.17 ఎక్కువుగా అమ్ముతున్నందుకు కన్స్యూమర్ కోర్ట్‌లో కేసు.. రూ.66వేలు ఫైన్