Weather Alert: ఇదేం చలి బాబోయ్.. వచ్చే 2, 3 రోజులు మరింత గజగజ! బయటకు రావొద్దంటూ హెచ్చరికలు
తెలంగాణ రాష్ట్రంలో చలి పంజా విసురుతుంది. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గాయి. రాత్రి సమయాల్లో సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో మరింత తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రెండు మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో..

హైదరాబాద్, డిసెంబర్ 30: రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2°C నుండి 3°C తక్కువగా నమోదయ్య అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ అదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, వికారాబాద్, జగిత్యాల, నిజామాబాద్,వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీచేసింది.
చలి తీవ్రత దృష్ట్యా పార్కులలో ప్రజలు స్వెటర్లు, మంకీ క్యాప్ లతో వాకింగ్ చేస్తున్నారు. రోజువారి పనుల కోసం ఉదయం బయటికి వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులతో పోల్చుకుంటే చలి తీవ్రత ఈరోజు మరింత పెరిగింది. దట్టమైన పొగ మంచు కారణంగా రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత పెరగడంతో చిన్న పిల్లలు, వృద్దులు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.
సోమవారం వివిధ ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా..
- ఆదిలాబాద్..6.7
- పటాన్ చెరువు..8.4
- మెదక్..8.8
- రాజేంద్రనగర్..9.5
- హనుమకొండ.. 10.5
- రామగుండం..11.5
- దుండిగల్..12.7
- నిజామాబాద్..13.0
- హైదరాబాద్..13.0
- హయత్ నగర్..13.6
- హకీంపేట్..13.9
- ఖమ్మం..15.6
- మహబూబ్ నగర్..14.6
- నల్గొండ..15.0
- భద్రాచలం..15.5 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




