కేరళలో బంద్ చేపట్టిన కాంగ్రెస్

తిరువనంతపురం: కేరళలో ఇద్దరు యూత్ కాంగ్రెస్‌ కార్యకర్తలు హత్యకు గురికావడంతో ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ శాఖ సోమవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. కాసర్‌ఘడ్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతంపై కాంగ్రెస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యూత్‌ కాంగ్రెస్‌కు చెందిన కృపేశ్‌, శరత్‌ లాల్‌ను సీపీఐ(ఎం) కార్యకర్తలే హత్య చేశారని కాంగ్రెస్‌ ఆరోపించింది. పోలీసుల వివరాల ప్రకారం ఇద్దరు కార్యకర్తలు ప్రవేట్ కార్యక్రమానికి వెళ్లి  తమ సొంత గ్రామానికి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వారిపై దాడి చేశారు. దీంతో కృపేశ్‌ అక్కడిక్కడే మృతిచెందగా.. […]

  • Ram Naramaneni
  • Publish Date - 4:12 pm, Mon, 18 February 19
కేరళలో బంద్ చేపట్టిన కాంగ్రెస్

తిరువనంతపురం: కేరళలో ఇద్దరు యూత్ కాంగ్రెస్‌ కార్యకర్తలు హత్యకు గురికావడంతో ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ శాఖ సోమవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. కాసర్‌ఘడ్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతంపై కాంగ్రెస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యూత్‌ కాంగ్రెస్‌కు చెందిన కృపేశ్‌, శరత్‌ లాల్‌ను సీపీఐ(ఎం) కార్యకర్తలే హత్య చేశారని కాంగ్రెస్‌ ఆరోపించింది. పోలీసుల వివరాల ప్రకారం ఇద్దరు కార్యకర్తలు ప్రవేట్ కార్యక్రమానికి వెళ్లి  తమ సొంత గ్రామానికి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వారిపై దాడి చేశారు. దీంతో కృపేశ్‌ అక్కడిక్కడే మృతిచెందగా.. శరత్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కొన్ని రోజుల క్రితం రెండు వర్గాల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయని.. అందులో సీపీఐ(ఎం) పెరియా శాఖ అధ్యక్షుడు పీతాంబరంతో పాటు మరికొంత మంది గాయపడ్డారు. దానికి ప్రతీకారంగానే ఈ హత్యలు జరిగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

దీనిపై స్పందించిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకునే వరకు అధికార పార్టీపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. కార్యకర్తల మృతి పట్ల సంతాపం ప్రకటించిన ఆయన వారి కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు రామచంద్రం మాట్లాడుతూ..‘‘ ఈ దాడి వెనక సీసీఐ(ఎం) కార్యకర్తల హస్తం ఉంది. హత్య జరిగిన తీరు చూస్తుంటే ఇది పక్కా పథకం ప్రకారమే చేసినట్లు అర్థమవుతోంది. ఎదుటివారిని మట్టుబెట్టడం ద్వారా రాజకీయ ప్రత్యర్థుల నోర్లు మూయించాలనుకోవడం బాధాకరం’’ అని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షనాయకుడు రమేశ్‌ చెన్నిథల ఈ హత్యలను తీవ్రంగా ఖండించారు. ‘‘ అధికార పార్టీ ప్రణాళికాబద్ధంగానే ఇలాంటి దాడులకు పాల్పడుతోంది. దీనికి తప్పకుండా సీపీఐ(ఎం) మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’’ అని రమేశ్‌ అన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ ఆరోపణల్ని సీపీఐ(ఎం) ఖండించింది. వ్యక్తిగత కక్ష్యలే ఈ హత్యలకు కారణమని అభిప్రాయపడింది.