14 రోజులుగా రోగి అదృశ్యం.. ఆస్పత్రి టాయిలెట్‌లో శవమై తేలాడు

పద్నాలుగు రోజుల కిందట అదృశ్యమైన ఓ టీబీ బాధితుడు ఆస్పత్రిలోని టాయిలెట్‌లో శవమై కనిపించడం కలకలం సృష్టించింది.

14 రోజులుగా రోగి అదృశ్యం.. ఆస్పత్రి టాయిలెట్‌లో శవమై తేలాడు
Follow us

|

Updated on: Oct 26, 2020 | 4:56 PM

పద్నాలుగు రోజుల కిందట అదృశ్యమైన ఓ టీబీ బాధితుడు ఆస్పత్రిలోని టాయిలెట్‌లో శవమై కనిపించడం కలకలం సృష్టించింది. ఈ ఘటన ముంబయిలోని శివాడిలోని టీబీ ఆస్పత్రిలో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, బృహత్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఆస్పత్రికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

ఆస్పత్రి సిబ్బంది వెల్లడించిన వివరాల ప్రకారం.. 27 ఏళ్ల సూర్యాబన్‌ యాదవ్‌ అనే వ్యక్తి గత కొంతకాలంగా టీబీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవల వ్యాధి తీవ్రత పెరగడంతో శివాడిలోని టీబీ ఆస్పత్రిలో చేరాడు. అతడికి కరోనా లక్షణాలు కూడా కనిపించడంతో అతనికి చికిత్స అందిస్తున్నారు వైద్య సిబ్బంది. అయితే, కొన్ని రోజుల కిందట అతడు ఆస్పత్రిలో ఉన్నట్టుండి కనిపించకుండాపోయాడు. ఎంత వెతికినా అతని ఆచూకీ తెలియకపోవడంలో ఆస్పత్రి సిబ్బంది అక్టోబర్‌ 4న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదిలావుండగా, అతడు అదృశ్యమైన 14 రోజుల తర్వాత ఆస్పత్రిలోనే శవమై కనిపించాడు. అక్కడ పనిచేసే వార్డ్‌ బాయ్‌ ఓ టాయిలెట్‌ గది నుంచి దుర్వాసన రావడం గమనించి తలుపులు పగలగొట్టి చూడగా సూర్యాబన్‌ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. అతడిది సహజ మరణమే అయి ఉంటుందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి మృతి చెంది ఉంటాడని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బీఎంసీ అధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు. విచారణకు సహకరించాలంటూ ఆస్పత్రి సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. సూర్యాబన్‌ మృతికి సంబంధించి పూర్తి వివరాలు, ఒక మృతదేహాన్ని ఇన్ని రోజులు గుర్తించకుండా ఎలా ఉన్నారో ఆస్పత్రి సిబ్బందిని ఆరా తీస్తున్నారు పోలీసులు.