కేంద్రం-రాష్ట్రాల మధ్య సంస్క..’రణం’

– ప్యాకేజీపై భగ్గుమన్న కేసీఆర్‌, మమత, విజయన్‌ – సాయం చేయమంటే పన్నులు పెంచమంటారా? – కౌంటర్‌ ఇస్తున్న కేంద్రం – కేంద్ర రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టిన ప్యాకేజీ కేంద్రం ప్రకటించిన 20లక్షల 97వేల కోట్ల ప్యాకేజీపై తెలంగాణ CM KCR నిప్పులు చెరిగారు. కోఆపరేటివ్‌ ఫెడరలిజం అంటూ అధికారంలోకి వచ్చిన మోదీ… రాష్ట్రాల హక్కులను హరించే పద్దతిలో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆర్ధిక మంత్రి ప్రకటించింది ప్యాకేజీ కాదని.. బోగస్‌ అంతా దగా అంటూ మండిపడ్డారు. అయితే […]

కేంద్రం-రాష్ట్రాల మధ్య సంస్క..'రణం'
Follow us

|

Updated on: May 20, 2020 | 3:09 PM

ప్యాకేజీపై భగ్గుమన్న కేసీఆర్‌, మమత, విజయన్‌సాయం చేయమంటే పన్నులు పెంచమంటారా?కౌంటర్‌ ఇస్తున్న కేంద్రంకేంద్ర రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టిన ప్యాకేజీ

కేంద్రం ప్రకటించిన 20లక్షల 97వేల కోట్ల ప్యాకేజీపై తెలంగాణ CM KCR నిప్పులు చెరిగారు. కోఆపరేటివ్‌ ఫెడరలిజం అంటూ అధికారంలోకి వచ్చిన మోదీ… రాష్ట్రాల హక్కులను హరించే పద్దతిలో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆర్ధిక మంత్రి ప్రకటించింది ప్యాకేజీ కాదని.. బోగస్‌ అంతా దగా అంటూ మండిపడ్డారు. అయితే కేసీఆర్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి. కేసీఆర్‌ నియంతృత్వ పాలన చేస్తూ కేంద్రంపై విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. మొత్తానికి కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ మరోసారి కేంద్రానికి, తెలంగాణకు మధ్య చిచ్చుపెట్టింది. ఇంతకీ కేంద్రం చెప్పిన సంస్కరణలు ఏంటి? తెలంగాణ చెబుతున్న అభ్యంతరాలేంటి ఒకసారి పరిశీలిస్తే.

ఫిస్కల్‌ రెస్పాన్స్‌బులిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌-FRBM కింద రాష్ట్రాలు ద్రవ్యలోటు పూడ్చుకునే వెసులుబాటు ఉంది. 2003లో వచ్చిన ఈ FRBM చట్టం ప్రకారం రాష్ట్రాల GDPలో 3% వరకు రుణానికి అనుమతినిస్తుంది. ఆర్ధిక క్రమశిక్షణ పాటించడంతో పాటు.. అత్యవసర పరిస్థితుల్లో అదనంగా 0.50%వరకూ పెంచుకోవడానికి అంగీకరిస్తున్నాయి రూల్స్. తక్కువ వడ్డీ, ఎక్కువ కాలవ్యవధి రుణాలు కాబట్టి రాష్ట్రాలకు ఇది పెద్ద వెసులుబాటే. అయితే కేంద్రం పైసా చెల్లించదు. రాష్ట్రాలే ఈ రుణాలు తీర్చుకోవాలి. కోవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా భారీగా ఆదాయం పడిపోయిందని… కేంద్రం సాయం చేయలేకపోతే.. కనీసం FRBM పెంచాలని రాష్ట్రాలు విజ్ఞప్తి చేస్తూ వచ్చాయి. ఇందకనుగుణంగా కేంద్రం ప్రకటించిన ఆత్మ నిర్భర్‌ భారత్‌ ప్యాకేజీలో భాగంగా 3% నుంచి 5% పెంచుతూ వెసులుబాటు కల్పించింది. ఇది కూడా కేవలం ఈ ఏడాదికి పరిమితం చేశారు. FRBM పెంపు 3% నుంచి 5% వల్ల రాష్ట్రాలకు 4.28 లక్షల కోట్లు నిధులు అందుబాటులోకి వస్తాయని కేంద్రం చెబుతోంది. ఆయా రాష్ట్రాల జీడీపీ ప్రకారం అప్పుడు చేసుకోవచ్చు.

అయితే కేంద్రం ఇక్కడే లింకు పెట్టింది. కేంద్రం కల్పించిన FRBM వెసులుబాటు అనుమతించాలంటే ఖచ్చితంగా నాలుగు రిఫామ్స్‌ అమలు చేయాలి. ఇందులో 1. వన్‌నేషన్ వన్‌ రేషన్‌ 2. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌, 3. డిస్కమ్‌లలో సంస్కరణలు, 4. అర్బన్‌ లోకల్ బాడీస్ ఆదాయం పెంపు వంటి అంశాలు చేర్చారు. ఈ నాలుగు లక్ష్యాలు చేరుకుంటే మొత్తం FRBMకు వెళ్లాల్సి ఉంటుంది.

FRBM విషయంలో అన్ని రాష్ట్రాలకు కండీషన్ లేకుండా 0.50% ఇస్తుంది. పైన చెప్పిన 4 రిఫామ్స్‌ అమలు చేస్తేనే 1% వాడుకోవచ్చు. అంటే ఒక్కో రిఫామ్‌కు 0.25శాతం అన్నమాట. కనీసం 3 రిఫామ్స్‌ అమలుచేసి సక్సెస్‌ అయితే మిగిలిన 0.50% వినియోగించుకోవచ్చు.

కండీషన్లు కేవలం పెట్టడమే కాదు… చేతల్లో చూపించాలి రాష్ట్రాలు. సుస్థిరమైన వృద్ధిరేటు చూపించాలి. పేదల ఆహారపంపిణీలో లోపాలు తగ్గించాలి. పెట్టుబడులు సాధించి ఉపాథి సృష్టించాలి. హెల్త్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కనిపించాలి. ఇక్కడే తెలంగాణ తీవ్ర అభ్యంతరం చెబుతోంది. కేంద్రం వన్‌ నేషన్, వన్‌ రేషన్‌ అమలుచేస్తున్నాం. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో టాప్‌లో ఉన్నాం. కానీ మిగతా రెండు అంశాలు డిస్కమ్‌, అర్బన్‌లోకల్‌ బాడీస్‌ రిఫామ్స్‌ అంటే ఖచ్చితంగా ప్రజలపై నేరుగా భారం పడుతుంది. అందుకే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. కేసీఆర్‌. అప్పు చేసుకోవడానికి కూడా కేంద్రం ఆంక్షలు పెట్టడం… అదీ ప్రజలపై పన్నుల భారం వేయమని చెప్పడం ఏంటని ప్రశ్నిస్తోంది. డిస్కమ్‌లలో ఆపరేషనల్‌, ఫైనాన్షియల్‌ లాస్‌ తగ్గించడం, కన్జూమర్స్‌ డిజిటల్‌ పేమెంట్‌ ప్రోత్సహించడం, ప్రీపెయిడ్‌ మీటర్స్‌ అమర్చడం, రాయితీలు ఎత్తేయమనడం అంటే ప్రజలపై భారం పెంచడమే అంటున్నాయి. రైతులకు ఇస్తున్న విద్యుత్‌ రాయితీపై కూడా రాజీపడాల్సి వస్తుందన్నది కేసీఆర్‌ వాదన. అంతేకాదు… ERCలో కూడా కేంద్రం చెప్పిన వ్యక్తులనే నియమించాలన్న బిల్లుకు కూడా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా ప్రజలకు రాష్ట్రాలు ఇస్తున్న రాయితీలపై ఉక్కుపాదం మోపడంతో పాటు… హక్కులను కాలరాయడమేనంటోంది తెలంగాణ ప్రభుత్వం. దగాకోరు ప్యాకేజీ ప్రకటించి రాష్ట్రాలను బిచ్చగాళ్లను చేస్తారా అంటూ తీవ్రపదజాలం వాడటం కేసీఆర్‌ ఆగ్రహానికి అద్దంపడుతోంది.

పైగా తెలంగాణకు ఇప్పుడు FRBM పెంచడం వల్ల కొత్తగా వచ్చే ప్రయోజనం లేదన్నది రాష్ట్ర వాదన. 2020-21 తెలంగాణ GDP 11, 05,136 కోట్లుగా ఉంది. రుణ పరిమితి 33,154 కోట్లు. FRBM 5% పెంచడంతో 55,256 కోట్లు అప్పులు చేయడానికి ఆస్కారం ఉంది. అయితే ఇప్పటికే తెలంగాణకు 3.5శాతం ఉంది. అంటే కేంద్రం పెట్టిన ఆంక్షల్లో రెండు తెలంగాణ ఇప్పటికే సాధించింది. కొత్తగా అమలుచేయడం వల్ల కొత్తగా మహా అయితే అదనంగా రూ. 5వేల కోట్లు వస్తుంది. కేంద్రం నేరుగా సాయం చేయకుండా… అప్పులకు కూడా ఇలా ఆంక్షలు ఏంటన్నది తెలంగాణ వాదన. అందుకే బిచ్చమేస్తున్నారా అని ప్రశ్నిస్తోంది కేంద్రం. రాష్ట్రంలో పన్నుల రూపంలోనే నెలకు 11వేల కోట్లు వస్తున్నాయన్నది తెలంగాణ వాదన.

అయితే బీజేపీ వాదన ఇందుకు భిన్నంగా ఉంది. రాష్ట్రాలకు రూ.46వేల కోట్లు ఇచ్చామంటోంది కేంద్రం. రూ.12వేల 390 కోట్లు ద్రవ్యలోటు కింద ఇచ్చాం. SDRF కింద రూ.11వేల 092 కోట్లు, కోవిడ్‌ కంట్రోల్‌ కోసం రూ. 15వేల కోట్లు, మైగ్రెంట్ లేబర్‌కు వెల్ఫేర్‌ ఫండ్‌ నుంచి ఇవ్వాలని సూచించాం.. కేవలం అప్పులు చేసేటప్పుడు ఎలా తీరుస్తారో చెప్పాలన్న ఉద్దేశంతోనే పరిమితులు పెడితే విమర్‌శలు చేయడం ఏంటని ప్రశ్నిస్తోంది కేంద్రం. రాష్ట్రాలు, అన్నిపార్టీలు, మాజీ PMలు, ఆర్థిక వేత్తలతో చర్చించిన తర్వాతే ప్యాకేజీ ఇవ్వడం జరిగిందంటున్నారు. 20లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా తెలంగాణలో కోటీ 70లక్షల మందికి బియ్యం ఇస్తున్నాం. 4లక్షల 71వేల మందికి ఉచిత సిలెండర్‌, 34లక్షల మంది రైతులకు నేరుగా ఖాతాల్లో రూ.2వేలు, 20వేల మందికి 50లక్షల చొప్పున బీమా, 54లక్షల మహిళల జన్ ధన్‌ ఖాతాల్లో నెలకు రూ.500, 60వేల మందికి EPF, 6.70లక్షల మంది పెన్షన్‌ స్కీమ్‌, వలసకూలీల కోసం రూ.224 కోట్లు ఇచ్చింది కేంద్రం కాదా అని ప్రశ్నిస్తున్నారు. హెల్త్‌ ఎక్విప్‌మెంట్ కోసం రూ.216 కోట్లు, 2.05లక్షల N95 మాస్కులు, లక్ష 500 PPE కిట్లు, 20లక్షల హైడ్రాక్సి ట్యాబ్లెట్స్‌ ఇలా అన్ని రంగాల్లో సాయం అందిస్తే… బిచ్చగాళ్లు అంటూ విమర్శలు చేయడాన్ని బీజేపీ ప్రశ్నిస్తోంది. మొత్తానికి ప్యాకేజీపై ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. రాష్ట్రాలను ఆదుకుంది కేంద్రమే అంటే… పైసా ఇవ్వకుండా.. కష్టంలో కూడా రిఫామ్స్‌ ఏంటని రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నాయి. మొత్తానికి మోదీ మరోసారి పెదవి విప్పితే… లేదా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడితేకానీ దీనిపై ఓ స్పష్టత వస్తుందనుకుంటా..