తెలంగాణలో నూతన సాగుబడిపై సర్కార్ కసరత్తు..!

తెలంగాణలో వ్యవసాయరంగంలో నూతన ఒరవడి సృష్టించేందుకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. దేశానికి రైతే రాజు అన్న నానుడిని నిజం చేయాలన్న సంకల్పంతో నూతన సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించే పనిలోపడ్డారు. ఈ మేరకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో చర్చించేందుకు ఈనెల 21న సమావేశం కానున్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో అమలు చేయతలపెట్టిన నియంత్రిత పంటల సాగు విధానాన్ని ఖరారు చేసేందుకు ఈ నెల 21న మధ్యాహ్నం ప్రగతిభవన్ లో విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు సీఎం […]

తెలంగాణలో నూతన సాగుబడిపై సర్కార్ కసరత్తు..!
Follow us

|

Updated on: May 20, 2020 | 3:06 PM

తెలంగాణలో వ్యవసాయరంగంలో నూతన ఒరవడి సృష్టించేందుకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. దేశానికి రైతే రాజు అన్న నానుడిని నిజం చేయాలన్న సంకల్పంతో నూతన సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించే పనిలోపడ్డారు. ఈ మేరకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో చర్చించేందుకు ఈనెల 21న సమావేశం కానున్నారు సీఎం కేసీఆర్.

రాష్ట్రంలో అమలు చేయతలపెట్టిన నియంత్రిత పంటల సాగు విధానాన్ని ఖరారు చేసేందుకు ఈ నెల 21న మధ్యాహ్నం ప్రగతిభవన్ లో విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్. ఈ సమావేశానికి మంత్రులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులతో పాటు జిల్లా రైతు సంఘం అధికారులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లాలవారీ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఏయే పంటల సాగు అనుకూలమనే అంశాలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. రాష్ట్రంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలన్న అంశంపై వ్యవసాయ అధికారులు ఇప్పటికే ఓ ప్రణాళికను సిద్ధం చేశారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పంటల సాగు విధానం నీటి లభ్యతపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతోనూ విస్తృతంగా చర్చించారు. అయా జిల్లాల వారీగా తీసుకోవల్సిన చర్యలపై ఓ నివేదికను సిద్ధం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఈ నివేదికపై చర్చించి సమగ్ర పంట సాగు విధానాన్ని నిర్ణయిస్తారు.

రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానాన్ని ఈ ఖరీఫ్ సీజన్ నుండి ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు ప్రభుత్వం సూచించిన మేరకే రైతులు పంటలు వేయాలని పేర్కొంది. రానున్న రోజుల్లో రైతులతో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు పంటలు వేయని రైతులకు రైతు బంధు పథకం ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.