Covid Vaccine: కొవిడ్ వ్యాక్సిన్లతో పూర్తి రక్షణ… తాజా అధ్యయనంలో ఆసక్తికర అంశాలు

కొవిడ్ వ్యాక్సిన్లు వైరస్ బారినపడకుండా రక్షణ కవచాల్లా పనిచేస్తున్నట్లు తాజా అధ్యయనంలో రుజువయ్యింది. కొవిడ్ వ్యాక్సిన్ల సామర్థ్యంపై అపోలో గ్రూపు హాస్పటిల్స్ తాజా అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

Covid Vaccine: కొవిడ్ వ్యాక్సిన్లతో పూర్తి రక్షణ... తాజా అధ్యయనంలో ఆసక్తికర అంశాలు
Covid Vaccine
Follow us

|

Updated on: Jun 17, 2021 | 10:17 AM

Covid Vaccine Efficacy: కొవిడ్ వ్యాక్సిన్లు వైరస్ బారినపడకుండా రక్షణ కవచాల్లా పనిచేస్తున్నట్లు తాజా అధ్యయనంలో రుజువయ్యింది. కొవిడ్ వ్యాక్సిన్ల సామర్థ్యంపై అపోలో హాస్పటిల్స్ గ్రూప్ నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 95.8 శాతం మందికి వైరస్ సోకలేదని తమ అధ్యయనంలో తేలినట్లు వెల్లడించారు. వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో ఒక్క మరణం కూడా నమోదుకాలేదని తేల్చారు. దేశ వ్యాప్తంగా 24 నగరాల్లో 43 అపోలో ఆస్పత్రుల్లో పనిచేస్తున్న 31,621 మంది హెల్త్ కేర్ సిబ్బందిపై ఈ అధ్యయనం జరిపారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కేవలం 4.28 శాతం మంది మాత్రమే తిరిగి వైరస్ బారినపడ్డారు. వీరిలో మధ్యస్థ లక్షణాలతో 90 మంది(0.28శాతం) ఆస్పత్రిలో చేరగా..వారిలో ముగ్గురు(0.009శాతం) ఐసీయూలో చికిత్స అవసరం ఏర్పడింది. వీరు ముగ్గురూ ఐసీయూ చికిత్స అనంతరం కోలుకున్నట్లు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ బుధవారం వెల్లడించింది. అంటే కొవిషీల్డ్ లేదా కొవాగ్జిన్ రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో మరణాలు నమోదుకాలేదని తెలిపింది.

వ్యాక్సిన్లతో పూర్తి రక్షణ ఉంటుందని తమ అధ్యయనంలో తేలినట్లు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ.రెడ్డి తెలిపారు. సామూహిక టీకా కార్యక్రమం ద్వారా కరొనా మమహ్మారికి అడ్డుకట్ట వేయొచ్చన్నారు. వ్యాక్సినేషన్‌తోనే థర్డ్ వేవ్ రాకుండా అడ్డుకోవచ్చని పేర్కొన్నారు. వ్యాక్సిన్లను తొలుత హెల్త్ కేర్ సిబ్బందికి అందించడం ద్వారా వారు ఎంతో మంది రోగులకు చికిత్స కల్పించినట్లు చెప్పారు. దేశంలో రోజుకు 50 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా మాస్క్, చేతుల శుభ్రత, భౌతిక దూరం జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కరోనా మహమ్మారి పూర్తిగా నియంత్రణలోకి వచ్చే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందని డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి సూచించారు.

దేశంలో సెకండ్ వేవ్ ఉధృతి నెలకొన్న సమయంలో నాలుగున్నర మాసాల పాటు(జనవరి 16 నుంచి మే 30 వరకు) ఈ అధ్యయనం నిర్వహించారు. సెకండ్ వేవ్ ఏప్రిల్, మే మాసాల్లో ఉధృతంగా ఉండగా…పలువురు డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్స్ కూడా ప్రాణాలు కోల్పోయారు. రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్న కొందరు డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లు కూడా సెకండ్ వేవ్‌లో కరోనా వైరస్ బారినపడి మృతి చెందారు. ఈ నేపథ్యంలో రెండు డోసుల టీకా తర్వాత ఒక్కరు కూడా మరణించలేదన్న అపోలో ఆస్పత్రుల అధ్యయనం…టీకా రక్షణపై నమ్మకాన్ని మరింత పెంచేలా ఉంది.

Covid Vaccine

Covid Vaccine

అందరికీ వ్యాక్సిన్..అందరికీ వ్యాక్సిన్ టీవీ9 నినాదం. ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్లను వేసుకుని మహమ్మారి బారి నుంచి రక్షణ పొందాలని టీవీ9 కోరుతోంది.

Also Read..రూపం మార్చుకున్న కరోనా వైరస్.. మాస్కోలో కొత్త వేరియంట్.. సుత్నిక్ పనిచేస్తుందా లేదా అనే ఆందోళన