Naya Paisa: నయా పైసా కూడా లేదంటే అర్థమేంటి..? ఇంతకీ దీని విలువ ఎంతో తెలుసా?..

Naya Paisa Means: నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయని అడిగితే.. సాధారణంగా చాలా మంది నోట వినే మాట.. నా దగ్గర నయా పైసా లేదని, ఓ 30 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సున వారికి నయా పైసా గురించి తెలిసే ఉంటుంది. నేటి కాలం యువతకు మాత్రం..

Naya Paisa: నయా పైసా కూడా లేదంటే అర్థమేంటి..? ఇంతకీ దీని విలువ ఎంతో తెలుసా?..
Naya Paisa
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 17, 2022 | 4:35 PM

Naya Paisa: నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయని అడిగితే.. సాధారణంగా చాలా మంది నోట వినే మాట.. నా దగ్గర నయా పైసా లేదని, ఓ 30 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సున వారికి నయా పైసా గురించి తెలిసే ఉంటుంది. నేటి కాలం యువతకు మాత్రం నయా పైసా అంటే అర్థం కాకపోవచ్చు. పైసా అనే దానిని ఇప్పుడున్న చాలా మంది చూసి కూడా ఉండకపోవచ్చు. రూపాయికి మూలం పైసా.. వంద పైసలు కలిపితే ఒక రూపాయి. గతంలో నాణేలు చలామణీలో ఉండేవి. ఇప్పుడున్న వారికి ఐదు పైసలు, పది పైసలు, పావలా, అర్థ రూపాయి, రూపాయి గురించి తెలుసు. కాని నేటి యువత చాలా మందికి ఈ పైసల గురించి తెలిసుండకపోవచ్చు. నేటి ఆధునిక కాలంలో డబ్బంటే విలువ లేని పరిస్థితి ఏర్పడుతుంది. కాని పూర్వ కాలపు మనుషులకు డబ్బు విలువ ఏమిటనేది బాగా తెలుసు. గతంలో వేతనాలు కూడా చాలా తక్కువుగా ఉండేవి. ఒకరోజు కష్టపడితే పైసల్లో మాత్రమే వచ్చేది. అప్పట్లో వస్తువుల ధరలు కూడా అలాగే ఉండేవి. కిలో బియ్యం 20 పైసలకు వచ్చేవి. కిలో పంచదార 50 పైసలకు లభించేది.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అణా, అర్థనాలుగా డబ్బులను పిలిచేవాళ్లు. 1957 ముందు వరకు ఇండియన్ రూపీ అనేదే లేదు. 1955 లో నాణేల కోసం మెట్రిక్ విధానాన్ని అవలంబించడానికి దేశంలో “ఇండియన్ కాయినేజ్ యాక్ట్” ను సవరించారు. దీనిలో భాగంగా పైసా నాణేలు 1957 లో ప్రవేశపెట్టారు. ఈ పైసా అనే పదం, నాణేం 1957లో పురుడు పోసుకుంది. అప్పటి నుంచి 1964 వరకు ఈ నాణేన్ని నయా పైసా అనే వారు.. హిందీలో నయా అంటే కొత్త అని అర్థం.. దీంతో కొత్తగా పైసాను ప్రవేశపెట్టడంతో అందరికీ ఇది కొత్త నాణేం అని తెలిసేందుకు నయా పైసా అని పిలిచేవారు. ఈ నాణేం బాగా వాడుకలోకి వచ్చిన తర్వాత.. మరిన్ని నాణేలు అందుబాటులోకి రావడంతో 1964 జూన్ 1వ తేదీన నయా అనే పదాన్ని తొలగించారు. అప్పటినుంచి పైసా అని పిలిచేవాళ్లు.. పైసా నాణేంతో పాటు.. ఐదు పైసలు, పది పైసలు, 20 పైసలు, 50 పైసల నాణేలను ముద్రించడం ప్రారంభించారు. దీంతో పైసా వాడకం తగ్గింది. దీని బరువు 1.5 గ్రాములు ఉండేది. దీంతో ఎవరికైనా ఒక రూపాయి ఇవ్వాలంటే వంద పైసలు ఇవ్వాల్సి ఉండేది.. దీని బరువు కనీసం 150 గ్రాములు ఉండేది. దీంతో పైసలకు సంబంధించి ఇతర నాణేలు అందుబాటులోకి రావడంతో పైసా నాణేం పూర్తిగా కనుమరుగైంది.

2011లో 50 పైసలు కంటే తక్కువ ఉన్న నాణేల చలామణీని పూర్తిగా నిషేధించారు. అప్పటిరవకు 25 పైసలు, పావలా నాణేలు చలామణీలో ఉండేవి. 1995 వరకు ఐదు పైసలకు చాక్లెట్స్ కూడా వచ్చేవి. ఐదు పైసల చాక్లెట్ అని కొన్నింటికి ముద్ర కూడా పడింది. అధికారికంగా 50 పైసల కంటే తక్కువ విలువ కలిగిన నాణేలపై నిషేధం విధించడంతో పైసా అనే పదం వాడుకలోనే లేకుండా పోయింది. అయినా పైసా విలువ తెలియడంతో ఇప్పటికి చాలా మంది తమ దగ్గర అసలు డబ్బులు లేవని చెప్పడానికి నయా పైసా కూడా లేదని చెబుతారు. పైసా తర్వాత.. రూపాయి అనే పదం ప్రస్తుతం వాడకంలో ఉంది. దీంతో నేటి యువతను ఎవరైనా డబ్బులు ఉన్నాయా అని అడిగితే నా దగ్గర రూపాయి కూడా లేదని చెప్పడం కుర్రాళ్ల దగ్గర వింటూ ఉంటాం. మరి ఈ రూపాయి పదం ఎన్నాళ్లు వాడుకలో ఉంటుందో.. భవిష్యత్తులో ఎలాంటి కొత్త పదాలు వస్తాయో వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే డిజిటల్ రూపీని తీసుకొచ్చేందుకు అడుగులు పడుతున్న నేటి సాంకేతిక యుగంలో మరెన్నో మార్పులు రానున్నాయనేది కాదనలేని విషయం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం చూడండి..