Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Couple Tips: ఈ టిప్స్ పాటిస్తే మీ వైవాహిక జీవితం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగడం గ్యారంటీ..

పెళ్లి అనేది జీవితంలో ఓ మధురానుభూతి.. వివాహం అయిన తర్వాత ఇద్దరు వ్యక్తులు కలిసి దాంపత్య జీవితంలోకి అడుగుపెడతారు. అయితే అమ్మాయి, అబ్బాయి అప్పటివరకు వేర్వేరు వాతావరణాల్లో పెరిగి..

Couple Tips: ఈ టిప్స్ పాటిస్తే మీ వైవాహిక జీవితం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగడం గ్యారంటీ..
New Married Couple (Representative image)
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 17, 2022 | 9:55 AM

పెళ్లి అనేది జీవితంలో ఓ మధురానుభూతి.. వివాహం అయిన తర్వాత ఇద్దరు వ్యక్తులు కలిసి దాంపత్య జీవితంలోకి అడుగుపెడతారు. అయితే అమ్మాయి, అబ్బాయి అప్పటివరకు వేర్వేరు వాతావరణాల్లో పెరిగి ఉంటారు. దీంతో పెళ్లైన కొత్తలో అనేక విషయాల్లో మోహమాటపడుతూ ఉంటారు. కొందరైతే కొంత చొరవ తీసుకుని తమ బంధాన్ని మొదట్లోనే బలోపేతం చేసుకుంటారు. మరికొందరైతే ఏం మాట్లాడితే ఏం అనుకుంటారో అనే అభిప్రాయంతో ఒకరిని ఒకరు అర్థం చేసుకుని దగ్గరవ్వడానికి కొంత సమయం తీసుకుంటారు. ఇలా చేయడం ద్వారా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడానికి కొంత సమయం పడుతుంది. లేదా ఒకరి పద్దతి మరొకరికి నచ్చకపోవచ్చు. ముఖ్యంగా ఏ బంధం అయినా దృఢంగా పెనవేసుకోవాలంటే ఒకరికొకరు ప్రేమను పంచుకుంటేనే అది సాధ్యం అవుతుంది. ఒకరి పట్ల ఒకరు విశ్వాసం, గౌరవం కూడా కలిగి ఉండాలి. ఒకవేళ ఎవరైనా కొత్తగా దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టినట్లు అయితే వారిద్దరూ ఒకరి స్వభావాన్ని మరొకరు అర్థం చేసుకునేలా ఒకరికొకరు సమయం కేటాయించుకోవాలి.

భార్యా, భర్తల్లో ఏ ఒక్కరైనా గతంలో ఏవైనా చేదు అనుభవాలు ఎదుర్కొన్నట్లయితే వాటి నుంచి తేరుకోవడానికి కొంత సమయం తప్పకుండా పడుతుంది. ఏవరైనా పెళ్లికి ముందు వేరే వ్యక్తిని ప్రేమించి ఉండటం, ఆ ప్రేమ పెళ్లికి దారితీయకుండా.. మరొ వ్యక్తిని పెళ్లి చేసుకోవల్సి రావడం వంటివి చాలా మంది జీవితాల్లో చూస్తూ ఉంటాం. ఇలా జరిగినప్పుడు అమ్మాయిలపై అబ్బాయిలకు, అబ్బాయిలపై అమ్మాయిలకు సానుకూల అభిప్రాయం ఉండదు. ఇలాంటి దురాభిప్రాయాలతో ఉంటే దాంపత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడి.. వివాహ బంధం మరింత బలపడాలంటే ఒకరిపై ఒకరు నమ్మకం ఏర్పర్చుకోవడం తప్పనిసరి. దాంపత్య జీవితం సాఫీగా సాగిపోవాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం.

మనసు విప్పి మాట్లాడండి..

లైఫ్‌లో ఎంత బిజీగా ఉన్నా, రోజులో ఒక్కసారైనా ప్రతి విషయంలోనూ భార్య, భర్తలు మనసు విప్పి ఓపెన్‌గా మాట్లాడుకునేందుకు ప్రయత్నించాలి. దీని వల్ల ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ఇలా చేయడం ద్వారా భాగస్వామికి ఏదైనా బహిరంగంగా చెప్పుకోవచ్చనే ధైర్యం కూడా కలుగుతుంది. ఒకరిపై మరొకరికి నమ్మకం కూడా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

తప్పులను ఒప్పుకోండి..

చాలా మంది తమ మాటే నెగ్గాలనే పంతానికి పోతుంటారు. ఈ సందర్భంలో తప్పును కూడా ఒప్పు అనేలా సమర్థించుకుంటారు. దీనివల్ల భార్య, భర్తల మధ్య స్వల్ప తగదాలు ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. ఎప్పుడైనా మన తప్పులను అంగీకరించినప్పుడే ఏ తప్పునైనా సరిదిద్దుకోగలం. అటువంటి పరిస్థితిలో, భార్య, భర్తల్లో ఎవరు పొరపాటు చేసినప్పటికీ, ఇగో ఫీలవ్వకుండా క్షమాపణలు చెప్పడం ఎంతో ముఖ్యం. దీంతో ఇద్దరి మధ్య విశ్వాసం పెరగడమే కాదు. దాంపత్య జీవితం మరింత బలోపేతమవుతుంది.

తప్పులను సరిచేసుకోండి..

జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో తెలిసో, తెలియకో తప్పులు చేస్తూ ఉంటారు. అయితే తప్పును తెలుసుకున్న తర్వాత వాటిని సరిచేసుకోవడం చాలా ముఖ్యం. అది ఎలా అనేది ఆలోచించుకోవాలి. తప్పు చేశామని తెలుసుకున్నాక.. ఒక అవకాశం ఇవ్వమని భాగస్వామిని కోరడం మంచిది. ఇలా చేయడం ద్వారా ఇద్దరి మధ్య తగదా లేకుండా వివాహ బంధాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు భాగస్వామిపై నమ్మకాన్ని, ప్రేమను పెంచుతుంది.

బాధ్యతలు గుర్తించాలి..

వివాహనికి ముందు మన బాధ్యతలు చాలా తక్కువ. మన బాధ్యతలను ఎక్కువ శాతం తల్లిదండ్రులే చూసుకుంటారు. దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత బాధ్యతలు పెరుగుతాయి. మొదట మన బాధ్యతలను మనం గుర్తించాలి. ఈ విషయంలో కనుక నిర్లక్ష్యంగా ఉంటే భాగస్వాముల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. అందుకే కుటుంబ బాధ్యతలను గుర్తించి.. వాటిని చేపట్టాలి. ఏ విషయంలోనైనా భాగస్వామి వైపు నుంచి కూడా సానుకూలంగా ఆలోచించాలి. భాగస్వామితో సగం బాధ్యతలను పంచుకుంటే, ఇది ఇద్దరి పనిని సులభతరం చేస్తుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం కూడా పెరుగుతుంది.

నిజాయితీగా ఉండండి..

జీవితంలో భార్య భర్తల మధ్య నమ్మకం ఉండాలంటే నిజాయితీగా ఉండటం ఎంతో ముఖ్యం. భాగస్వామితో మీరు నిజాయితీగా ఉంటే. ఒకరిపై మరొకరికి సదాభిప్రాయం కలుగుతుంది. నమ్మకం పెరుగుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..