Good News For Gold Buyers: చౌకగా బంగారం.. పసిడి కొనాలనుకునేవారికి అద్భుత అవకాశం

బంగారం ధర ఆకాశాన్నంటుతోంది. పేద, మధ్య తరగతి ప్రజలకు పసిడి కొనడం భారంగా మారుతోంది. ఇలాంటి సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం కొనాలనుకునేవారికి తీపి కబురు..

Good News For Gold Buyers: చౌకగా బంగారం.. పసిడి కొనాలనుకునేవారికి అద్భుత అవకాశం
Gold Bonds
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 17, 2022 | 8:53 AM

బంగారం ధర ఆకాశాన్నంటుతోంది. పేద, మధ్య తరగతి ప్రజలకు పసిడి కొనడం భారంగా మారుతోంది. ఇలాంటి సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం కొనాలనుకునేవారికి తీపి కబురు అందించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం సిరీస్-3లో భాగంగా ఈనెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఐదు రోజుల పాటు సావరిన్ గోల్డ్‌ బాండ్లను విక్రయించనుంది. అలాగే నాలుగో విడత సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను మార్చి 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జారీ చేయనున్నది. ఈ గోల్డ్‌ బాండ్లను కమర్షియల్ బ్యాంకలు, స్టాక్‌ హోల్డింగ్ కార్పోరేషన్ ఆఫ్‌ ఇండియా, క్లియరింగ్ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌, పోస్టాఫీసులు, స్టాక్‌ ఎక్సేంజ్‌లలో విక్రయించనున్నారు. బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇదో మంచి ఎంపిక. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తీవ్ర ప్రభావం చూపిస్తున్నప్పటికి రిజర్వు బ్యాంకు సావరిన్ గోల్డ్‌ బాండ్ల విక్రయానికి సిద్ధమైంది. సావరిన్ గోల్డ్ బాండ్స్‌లో పెట్టుబడి సురక్షితమే కాకుండా.. అనేక రాయితీలు అందుకోవచ్చు. అవసరమైనప్పుడు మార్కెట్‌ ధరకు అనుగుణంగా ఈ బాండ్లను విక్రయించుకోవచ్చు. అలాగే వడ్డీ రేటు, పన్ను రాయితీ వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

సాధారణంగా బంగారం కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకుంటే దానిపై ధర పెరిగితే మాత్రమే ప్రయోజనం ఉంటుంది. కాని గోల్డ్‌ బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా పెట్టుబడి పెడితే వడ్డీ కూడా లభిస్తుంది. బంగారం అయితే ఆర్థిక అవసరాలు పెరిగినప్పుడు దానిని తనఖా పెట్టి రుణం తీసుకోవచ్చు. మరి సావరిన్ గోల్డ్‌ బాండ్ల విషయంలో అలా కుదురుతుందా అనే అనుమానం రావచ్చు. బంగారంపై ఎలా రుణం తీసుకుంటామో.. ఈ బాండ్లపై కూడా లోన్ అవసరం అయితే తీసుకోవచ్చు. రిజర్వు బ్యాంకు జారీ చేసే సావరిన్‌ గోల్డ్ బాండ్స్‌ డిజిటల్‌ రూపంలో ఉంటుంది. దీంతో ఇదెంతో సురక్షితం.. మన బంగారం చోరీ అవుతుందేమోననే భయం అసలు అవసరం లేదు. నేరుగా ఆర్బీఐ జారీ చేస్తుండటంతో భద్రత విషయంలో ఎటువంటి అనుమానం అవసరం లేదు.

సావరిన్‌ గోల్డ్ బాండ్స్‌ ఇష్యూకి ముందు మూడు రోజుల పాటు ఇండియన్ బులియన్ అండ్ జువెలరీ అసోసియేషన్‌ లిమిటెడ్ ద్వారా నిర్ణయించిన ధరకు సగటున ఈ బాండ్ల ధర నిర్ణయిస్తారు. ఎవరైనా ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ఒక వ్యక్తి కనిష్టంగా ఒక గ్రాము నుంచి గరిష్టంగా 4 కిలోల వరకు బంగారాన్ని బాండ్స్ రూపంలో కొనుగోలు చేయవచ్చు. ట్రస్టులు అయితే గరిష్టంగా 20 కేజీల వరకు బంగారాన్ని బాండ్లరూపంలో కొనుగోలు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆన్‌ లైన్‌లో ఈ బాండ్లను కొనుగోలు చేస్తే గ్రాముకు 50 రూపాయల తగ్గింపు కూడా లభిస్తుంది. ముందు చెప్పుకున్నట్లు గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా కలిగే అదనపు ప్రయోజనాల్లో వడ్డీ ఒకటి. ఈ బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా ఏడాదికి తమ ఇన్వెస్ట్‌మెంట్‌పై 2.5 శాతం వడ్డీ రేటు పొందవచ్చు. ఈ వడ్డీ ఆదాయానికి కలపబడుతుంది. అయితే వడ్డీపై ఆదాయపన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ బాండ్లను స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ట్రేడ్ చేయాలంటే పెట్టుబడిదారుడు తప్పనిసరిగా డీమ్యాట్ ఖాతా కలిగి ఉండాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..