Coma Vs Brain Death: కోమా – బ్రెయిన్ డెత్ వీటి మధ్య తేడా తెలుసా? కారుణ్య మరణం పొందాలంటే కోర్టు అనుమతి దేనికి అవసరం
కోమాలో ఉన్న హనీష్ రాణాకు కారుణ్య మరణం కోసం కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయితే వారి మరణానికి మాత్రం కోర్టు అనుమతి అవసరం ఉండదు. ఇటువంటి సందర్భాలలో వేరే విధానాన్ని అనుసరిస్తారు. అవయవ దానానికి కూడా అనుమతి ఉంటుంది. ఈ తేడా ఎందుకు?

సుమారు 13 యేళ్లుగా కోమాలో అపస్మారక స్థితిలో ఉన్న హరీష్ రాణాకు ఇటీవల కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఎయిమ్స్ వైద్యుల మెడికల్ బోర్డు అతన్ని పరీక్షించి, అతను కోలుకునే అవకాశం లేదని చెప్పడంతో కారుణ్య మరణం కోసం కోర్టు అనుమతి అవసరమైంది. అయితే ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయితే వారి మరణానికి సాధారణంగా కోర్టు అనుమతి అవసరం ఉండదు. ఇటువంటి సందర్భాలలో వేరే విధానాన్ని అనుసరిస్తారు. అవయవ దానానికి కూడా అనుమతి ఇవ్వవచ్చు. కానీ కోమాలో ఉన్న రోగి విషయంలో ఇలా చేయడానికి వీలులేదు. అయితే కోమా, బ్రెయిన్ డెత్ అనే రెండు సందర్భాల్లోనూ రోగి మంచానికే పరిమితం అవుతాడు. కానీ వైద్యపరంగా వీటి మధ్య పెద్ద తేడాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
కోమా అంటే ఏమిటి?
కోమా అనేది సాధారణంగా ఒక తీవ్రమైన మెదడు పరిస్థితి. కోమాలో ఉన్న వ్యక్తి గాఢమైన అపస్మారక స్థితిలోకి వెళ్తాడు. అతను కళ్ళు తెరవలేడు, మాట్లాడలేడు, తన శరీరాన్ని కదపలేడు. అయితే ఈ స్థితిలో, మెదడులోని కొన్ని భాగాలు ఇంకా పనిచేస్తూనే ఉంటాయి. రోగి శ్వాసిస్తూ ఉంటాడు. అతని గుండె కొట్టుకుంటుంది. కొందరు కొద్ది రోజులు, వారాలు లేదా నెలల తర్వాత కోమా నుంచి బయటకు వస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ పరిస్థితి సంవత్సరాల తరబడి కొనసాగవచ్చు. వైద్యులు సాధారణంగా రోగి పరిస్థితిని చూసి, కోమా ఎంతకాలం కొనసాగుతుంది? కోలుకునే అవకాశాలు ఎలా ఉన్నాయో? అంచనా వేస్తారు. కానీ కొన్నిసార్లు కచ్చితంగా చెప్పడం కష్టంగా ఉంటుంది.
బ్రెయిన్ డెడ్ అంటే ఏమిటి?
బ్రెయిన్ డెడ్ అనేది మెదడు పూర్తిగా పనిచేయడం ఆగిపోయే పరిస్థితి. ఈ సందర్భంలో మెదడు అన్ని విధులు పూర్తిగా నిలిచిపోతాయి. ప్రత్యేక వైద్యుల బృందం పరీక్ష నిర్వహించి ఆ వ్యక్తిని బ్రెయిన్ డెడ్‌గా ప్రకటిస్తుంది. వైద్యపరంగా, చట్టపరంగా కూడా దీనిని మరణంగానే పరిగణిస్తారు. ఇటువంటి సందర్భాలలో అవయవ దానం కూడా చట్టబద్ధంగా అనుమతించబడుతుంది.
వైద్యులు ఎలా నిర్ణయిస్తారు?
ఒక రోగి కోమాలో ఉన్నాడా లేదా బ్రెయిన్ డెడ్ అయ్యాడా అని నిర్ధారించడానికి వైద్యులు అనేక న్యూరలాజికల్ పరీక్షలను ఉపయోగిస్తారు. ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయితే చట్టపరంగా వారు మరణించినట్లుగా పరిగణిస్తారు. కానీ కోమాలో కోలుకునే అవకాశం ఉన్నందున ఆ వ్యక్తిని మరణించినట్లుగా పరిగణించరని ఢిల్లీలోని జీబీ పంత్ ఆసుపత్రి న్యూరోసర్జరీ విభాగ మాజీ అధిపతి డాక్టర్ దల్జీత్ సింగ్ వివరించారు. సాధారణంగా కోమాలో ఉన్న రోగికి కోలుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాణరక్షణ పరికరాలను తొలగించడం అనేది చట్టపరమైన విషయం. వైద్యులు లేదా కుటుంబ సభ్యులు ఈ నిర్ణయాన్ని సొంతంగా తీసుకోలేరు. అందువల్ల ఇటువంటి సందర్భాలలో కోర్టు నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాలి. వైద్య నివేదికల ఆధారంగా కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఈ విధంగా కోమా, బ్రెయిన్ డెత్ రెండూ తీవ్రమైన వైద్య పరిస్థితులే అయినప్పటికీ మెదడు పనితీరు, చట్టపరమైన ప్రామాణికతల ఆధారంగా మరణానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




