IPL 2026 : ఐపీఎల్ అంటే ఆషామాషీ అయిపోయిందా? గవాస్కర్ దెబ్బకు విదేశీ ప్లేయర్లు షేక్ అవ్వాల్సిందే
IPL 2026 : ఐపీఎల్ నుంచి విదేశీ ఆటగాళ్లు మధ్యలో తప్పుకోవడంపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల నిషేధం సరిపోదని, కఠిన నిబంధనలు తేవాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఫ్రాంచైజీలు వేలంలో పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ అట్టహాసంగా మొదలైంది కానీ, కొందరు విదేశీ ఆటగాళ్ల తీరు ఇప్పుడు బీసీసీఐకి పెద్ద తలనొప్పిగా మారింది. వేలంలో భారీ ధరలకు అమ్ముడుపోయి, తీరా టోర్నీ మొదలయ్యే సమయానికి వ్యక్తిగత కారణాలు చెబుతూ తప్పుకుంటున్న ఆటగాళ్లపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రెండేళ్ల నిషేధం విధిస్తే వీరికి బుద్ధి రాదని, ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన బోర్డుకు విజ్ఞప్తి చేశారు. ఐపీఎల్ వేలంలో కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన తర్వాత, టోర్నీ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు కొందరు ఆటగాళ్లు తప్పుకోవడం జట్ల ప్రణాళికలను దెబ్బతీస్తోంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు హ్యారీ బ్రూక్, బెన్ డకెట్ వంటి వారు ఈ సీజన్ నుంచి తప్పుకున్నారు. దీనిపై సునీల్ గవాస్కర్ స్పందిస్తూ, ఆటగాళ్లకు వారి అంతర్జాతీయ కెరీర్ పట్ల శ్రద్ధ ఉండటం మంచిదే కానీ, ఒక లీగ్ కు కమిట్ అయిన తర్వాత ఇలా మధ్యలో వదిలేయడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. దీనివల్ల ఫ్రాంచైజీలు వేలంలో పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నిజానికి వేలంలో అమ్ముడుపోయి కారణం లేకుండా తప్పుకునే ఆటగాళ్లపై బీసీసీఐ ఇప్పటికే రెండేళ్ల నిషేధం విధిస్తోంది. కానీ గవాస్కర్ అభిప్రాయం ప్రకారం ఈ శిక్ష సరిపోదు. “రెండేళ్ల నిషేధం విధిస్తున్నా ఆటగాళ్లలో మార్పు రావడం లేదు. ఆ రెండేళ్ల తర్వాత మళ్ళీ వేలంలోకి వచ్చి భారీ ధర పలుకుతామని వారికి తెలుసు. కాబట్టి ఆటగాడిపై, అతని తిరిగి వచ్చే అవకాశాలపై బలమైన ప్రభావం చూపేలా మరిన్ని కఠిన నిబంధనలు తీసుకురావాలి” అని సన్నీ పేర్కొన్నారు. ఆటగాళ్ల నిబద్ధత లేని ప్రవర్తనను అరికట్టడానికి బీసీసీఐ గట్టిగా వ్యవహరించాలని ఆయన కోరారు.
ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, యాషెస్ సిరీస్, టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో తన వర్క్ లోడ్ ను నిర్వహించుకోవడానికి, కుటుంబంతో గడపడానికి అతను ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీనిపై గవాస్కర్ స్పందిస్తూ, ఒకవేళ ద హండ్రెడ్ వంటి లీగ్ లలో భారీ ధర రాకపోయి ఉంటే, అతను ఇలాగే చేసేవాడా? ఇప్పుడు ఇంగ్లాండ్ టెస్ట్ కెరీర్ పై దృష్టి పెడతానని చెప్పడం వినడానికి బాగుంటుంది కానీ, ఫ్రాంచైజీల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. ఆటగాళ్లు తమ ప్రాధాన్యతలను వేలానికి ముందే స్పష్టం చేయాలని ఆయన హితవు పలికారు.
ఒక ప్రధాన ఆటగాడు చివరి నిమిషంలో తప్పుకుంటే, ఆ స్థానాన్ని భర్తీ చేయడం జట్లకు చాలా కష్టమవుతుంది. వేలంలో ఉన్న మిగతా ఆటగాళ్లలో సరైన ప్రత్యామ్నాయం దొరకకపోవచ్చు. ఇది టోర్నీ నాణ్యతను కూడా దెబ్బతీస్తుంది. గవాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. భవిష్యత్తులో ఐపీఎల్ కాంట్రాక్టులలో మరిన్ని కఠినమైన షరతులు పెట్టాలని క్రికెట్ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఈ విషయంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
