Banana Facts: అన్ని పండ్లు గుండ్రంగా.. అరటిపండు మాత్రం వంకరగా ఎందుకుంటుంది?
అరటిపండు ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు. అయితే, అరటిపండు ఎప్పుడూ కొద్దిగా వంకరగా ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? దాని ఆకారం వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన శాస్త్రీయ కారణం ఉంది. ఆ విషయం చాలామందికి తెలియదు. అరటిపండు వంకరగా ఉండటానికి గల కారణం ఏమిటో, దాని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అరటిపండు ఆరోగ్యం కోసం అందరూ ఇష్టపడి తింటారు. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. అరటిపండులో అనేక పోషకాలు ఉంటాయి. అందుకే దీనిని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. అయితే, అరటిపండ్లు ఎప్పుడూ కొద్దిగా వంకరగా ఉంటాయి. దీనికి గల కారణం చాలామందికి తెలియదు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన శాస్త్రీయ కారణం ఉంది.
నేచర్ కమ్యూనికేషన్ అనే పత్రికలో ప్రచురితమైన ఒక వ్యాసం ప్రకారం, అరటిపండు వంకరగా ఉండటానికి ప్రధాన కారణం ‘ఫోటోట్రోపిజం’. అంటే, మొక్కలు సూర్యరశ్మి వైపు వంగే స్వభావం కలిగి ఉండడం. అరటి చెట్టుకు కాయలు కాసినప్పుడు, అవి గురుత్వాకర్షణ ప్రభావంతో కిందికి పెరుగుతాయి. అయితే, అవి సూర్యరశ్మి కోసం నెమ్మదిగా పైకి వంగడం మొదలుపెడతాయి. ఈ సహజ ప్రక్రియ వల్ల అరటిపండ్ల ఆకారం వంకరగా మారుతుంది.
ఈ ప్రక్రియను ‘నెగిటివ్ జియోట్రోపిజం’ అని పిలుస్తారు. సాధారణంగా చాలా మొక్కల వేర్లు గురుత్వాకర్షణకు అనుగుణంగా కిందికి పెరుగుతాయి. వాటి కాండం పైకి పెరుగుతుంది. కానీ, అరటిపండు విషయంలో ఇది విభిన్నంగా ఉంటుంది. అరటిపండు మొదట కిందికి పెరుగుతుంది. తరువాత సూర్యకాంతి కోసం పైకి వంగుతుంది.
అరటిపండు వంకర ఆకారానికి దాని రుచికి ఎటువంటి సంబంధం లేదు. రుచి అనేది పండు రకం, నేల, వాతావరణం, పండు పక్వానికి వచ్చిన సమయం మీద ఆధారపడి ఉంటుంది. అరటిపండు పండినప్పుడు తియ్యగా ఉంటుంది.
అరటిపండులో పోషకాలు అధికంగా ఉంటాయి. అవి తక్షణ శక్తినిస్తాయి. అలసట, బలహీనతను తగ్గిస్తాయి. ఇందులో ఉండే పీచు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. అరటిపండులో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యానికి మంచిది. ఇది రక్తపోటును నియంత్రించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ట్రిప్టోఫాన్ అమైనో యాసిడ్ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.




