ఇక్కడ పోటీ చేయాలని ఎంత ప్రయత్నించినా వీలుకాలేదు. కానీ.. యూపీలో ఏకంగా జిల్లా పీఠాన్నే కైవసం చేసుకుంది. ఇంతకీ ఎవరీమె.?
మన సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ మహిళ.. ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా జెడ్పీచైర్‌పర్సన్ అయ్యారు...
Srikala Reddy: మన సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ మహిళ.. ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా జెడ్పీచైర్‌పర్సన్ అయ్యారు. నడిగూడెం మండలం రత్నవరానికి చెందిన శ్రీకళారెడ్డి ఉత్తర్ ప్రదేశ్‌లోని జన్పూర్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా భాజపా నుంచి ఎన్నికయ్యారు. మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్‌రెడ్డి కుమార్తె అయిన శ్రీ కళారెడ్డి.. గతంలో కోదాడ నియోజకవర్గ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. 2004లో టిడిపిలో చేరి కోదాడ నుంచి టికెట్ కోసం ప్రయత్నించారామె. ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
ఏడాదిన్నర క్రితం బీజేపిలో చేరిన శ్రీకళారెడ్డి.. హుజూర్ నగర్‌కు జరిగిన ఉప ఎన్నికలో టిక్కెట్ ఆశించింది. టిక్కెట్ దక్కకపోవడంతో క్రీయాశీల రాజకీయాలకు దూరమయ్యారు. శ్రీకళారెడ్డికి యూపీకి చెందిన ధనుంజయ్‌తో వివాహం జరగడం.. ఆమెకు కలిసొచ్చింది. ఇటీవల అక్కడ జరిగిన పరిషత్ ఎన్నికల్లో పోటీచేసి జడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత జాన్పూర్ పరిషత్ ఛైర్‌పర్సన్ పీఠం కూడా ఆమె వశమైంది. దీంతో శ్రీకళా స్వగ్రామం రత్నవరంలో సంబరాలు జరుపుకున్నారు. తమ గ్రామంలో పుట్టి పెరిగిన శ్రీకళారెడ్డి.. యూపీలో జిల్లా పరిషత్ చైర్మన్ స్థాయికి చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు గ్రామస్తులు.
తెలంగాణ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకునేందుకు.. గతంలో శ్రీకళారెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ కొన్ని రాజకీయ, స్థానిక కారణాల మూలంగా ఆమెకు అవకాశం దక్కలేదు. చివరకు మెట్టినిల్లు ఆమెకు కలిసొచ్చింది. ఏకంగా జిల్లా పీఠంపైనే కూర్చోబెట్టింది.