AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sperm Donation: వీర్యాన్ని ఎవరు దానం చేయవచ్చు?.. దాతకు ఎంత డబ్బు వస్తుంది?

వంధ్యత్వం, సంతానం లేమి సమస్యలు ఎదుర్కొనేవారికి స్పెర్మ్ డొనేషన్ ఒక కొత్త ఆశను అందిస్తోంది. ఆధునిక సహాయక పునరుత్పత్తి సాంకేతికత (ART) లో ఇది కీలకమైన ప్రక్రియ. అయితే, స్పెర్మ్ దానం ఎవరు చేయాలి? దానికి ఎంత వయసు ఉండాలి? అసలు దాతలకు ఎంత పరిహారం చెల్లిస్తారు? ఎక్కడ, ఎలా దానం చేయాలనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Sperm Donation: వీర్యాన్ని ఎవరు దానం చేయవచ్చు?.. దాతకు ఎంత డబ్బు వస్తుంది?
Sperm Donation In India
Bhavani
|

Updated on: Sep 26, 2025 | 10:13 PM

Share

స్పెర్మ్ డొనేషన్ నేడు ముఖ్యమైన ప్రక్రియ. ఇది సహాయక పునరుత్పత్తి సాంకేతికత (ART). వంధ్యత్వంతో బాధపడేవారికి, లేదా సొంత స్పెర్మ్ లేక కుటుంబాన్ని ప్రారంభించాలనుకునే ఒంటరి మహిళలు, స్వలింగ జంటలు ఈ ప్రక్రియ ద్వారా తమ కలలు నెరవేర్చుకుంటున్నారు. స్పెర్మ్ దానం చేయాలంటే దాతకు కొన్ని అర్హతలు, ఆరోగ్య ప్రమాణాలు ఉండాలి.

దాత వయస్సు, అర్హత

సాధారణంగా 18 నుండి 39 సంవత్సరాల మధ్య వయసు ఉండే ఆరోగ్యకర పురుషులు మాత్రమే స్పెర్మ్ దానం చేయడానికి అర్హులు. దాతలు ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి. ధూమపానం, మద్యం, మాదకద్రవ్యాల వాడకం వంటివి మానుకోవాలి. దాత శారీరక, మానసిక ఆరోగ్యం, కుటుంబ చరిత్ర, జీవనశైలి వంటివి పరిగణనలోకి తీసుకుంటారు.

దాన ప్రక్రియ

స్పెర్మ్ దాన ప్రక్రియలో దాతలకు ముందుగా వైద్య సలహా లభిస్తుంది. వైద్యులు దాత శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉన్నారని నిర్ధారిస్తారు. ఆ తర్వాత స్పెర్మ్ నమూనా సేకరిస్తారు, పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలు స్పెర్మ్ కౌంట్, చలనశీలత, ఆకారం వంటి జీవ లక్షణాలను అంచనా వేస్తాయి. నమూనా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే, దానిని ద్రవ నత్రజనిలో నిల్వ చేస్తారు. ఈ విధంగా నిల్వ చేయడం వల్ల దాని నాణ్యత చాలా కాలం పాటు చెక్కుచెదరదు. ఇంటి నుండి తెచ్చిన స్పెర్మ్ ను స్వీకరించరు. దాత స్పెర్మ్ బ్యాంక్ కు లేదా క్లినిక్ కు వెళ్లి దానం చేయాలి.

ఎక్కడ దానం చేయాలి?

స్పెర్మ్ దానం లైసెన్స్ ఉన్న స్పెర్మ్ బ్యాంక్ లేదా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ART (సహాయక పునరుత్పత్తి సాంకేతికత) బ్యాంక్ లో జరుగుతుంది. దీనిని ఫెర్టిలిటీ క్లినిక్ అని కూడా పిలుస్తారు.

దాతకు పరిహారం

భారతదేశంలో స్పెర్మ్ దాతలకు చెల్లించే పరిహారం క్లినిక్, దాత ప్రొఫైల్, స్పెర్మ్ నాణ్యత బట్టి మారుతుంది. సాధారణంగా ఒక దానానికి రూ.500 నుండి రూ.2,000 వరకు, కొన్ని పెద్ద నగరాల్లో రూ. 15,000 వరకు పరిహారం చెల్లిస్తారు. ఈ చెల్లింపు దాత వైద్య పరీక్షల ఖర్చు, అసౌకర్యాన్ని కవర్ చేస్తుంది.

నిల్వ చేసిన స్పెర్మ్ సీసా ధర కొనుగోలుదారులకు రూ.8,000 నుండి రూ.20,000 వరకు ఉంటుంది. దాత విద్య, రక్త వర్గం వంటి లక్షణాలు ఈ ధర నిర్ణయిస్తాయి. సరైన సమాచారం, బాధ్యతతో చేసే దానం సమాజానికి ప్రయోజనకరం.

గమనిక: ఈ కథనంలో మీకు అందించిన అన్ని ఆరోగ్య సమాచారం, వైద్య సలహాలు మీ అవగాహన కోసమే. మేము ఈ సమాచారాన్ని శాస్త్రీయ పరిశోధన, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సలహాల ఆధారంగా అందిస్తున్నాం. వాటిపై చర్య తీసుకునే ముందు మీరు మీ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించడం మంచిది.