Gas Cylinder: మీ వంట గ్యాస్ త్వరగా అయిపోతోందా? అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే!
గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా.? వంటగది ఖర్చులకు అధికంగా డబ్బు వెచ్చించలేకపోతున్నారా.. అయితే ఈ చిట్కాలతో వంట గ్యాస్ ఆదా చేసుకోండిలా!
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు.? అనే సామెత.. ప్రస్తుతం సామాన్యుడి జీవితానికి సరిగ్గా అబ్బుతుంది. నిత్యావసర వస్తువులు.. కూరగాయలు, పాలు, గ్యాస్ సిలిండర్.. ఇలా ప్రతీదాని ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇవన్నీ కూడా సామాన్యుడికి పెను భారంగా మారాయి. ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు.. సామాన్యులు తమ జీతాల్లో నుంచి ఈఎంఐలు, ఇంటి రెంట్లతో పాటు వంటగది బడ్జెట్‌కు అధికంగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో గ్యాస్ సిలిండర్ వినియోగాన్ని మీరు కొంతవరకు తగ్గించవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.!
వంట చేసేటప్పుడు ప్రెజర్ కుక్కర్‌ను ఉపయోగించండి:
చాలామంది కూరగాయలను వండేందుకు మూకుడు లేదా గిన్నెను వాడతారు. ఇక ఈ రెండూ హీట్ ఎక్కేందుకు చాలా సమయం తీసుకుంటాయి. అందుకే మీరు కూరగాయలను ఉడికించాలన్నా.. లేదా వండాలన్నా ప్రెజర్ కుక్కర్‌ను ఉపయోగించండి. అప్పుడు మీ గ్యాస్ తక్కువ వినియోగించుకోవచ్చు.
కందిపప్పు, బియ్యాన్ని ముందుగా నానబెట్టి..
ప్రతీ ఒక్కరూ పప్పు, అన్నం వండడానికి ముందు.. కందిపప్పు, బియ్యాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి ప్రెజర్ కుక్కర్‌లో పెడతారు. అయితే ఇకపై మీరు ముందుగా బియ్యాన్ని, కందిపప్పును నీళ్లతో కడిగి.. కాసేపు నానబెట్టిన తర్వాత కుక్కర్‌లో పెడితే.. అవి త్వరగా ఉడికిపోతాయి. దీనితో మీరు గ్యాస్‌ను ఎక్కువగా ఆదా చేసుకోవచ్చు.
గ్యాస్‌పై తడి పాత్రలను పెట్టవద్దు..
వంట చేసేటప్పుడు స్టవ్‌పై మీరెప్పుడూ తడి పాత్రలను పెట్టవద్దు. అలా పెట్టినట్లయితే.. ఆ పాత్రల్లో నిల్వ ఉన్న నీరు ఆరేందుకు గ్యాస్ ఎక్కువ వినియోగం అవుతుంది.
ఆహారాన్ని వండేటప్పుడు మూత పెట్టాలి..
అంతేకాదు.. ఆహారాన్ని వండేటప్పుడు చాలామంది వండుతున్న గిన్నెపై మూతపెట్టరు. అలా చేయడం వల్ల గ్యాస్, సమయం రెండూ ఎక్కువగా ఖర్చవుతాయి. అందువల్ల మీరు ఆహారాన్ని తయారు చేసేటప్పుడు ప్రతీసారి.. వండుతున్న పాత్రపై దానికి సరిపడా మూత పెట్టండి. అప్పుడు ఫుడ్ తొందరగా కుక్ అవుతుంది. గ్యాస్ కూడా ఆదా అవుతుంది.