Health Tips: సంతోషం ఎక్కువైతే కన్నీళ్లు ఎందుకు వస్తాయో తెలుసా..? తెలిస్తే నోరెళ్లబెడతారు..
కన్నీళ్లు ఎంతో విలువైనవి. కన్నీళ్లు భావోద్వేగాలకే కాదు.. ఆరోగ్యానికి సైతం ముఖ్యమైనవి. కన్నీళ్లలోనూ పలు రకాలు ఉన్నాయి. ఒక్కో రకానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అంతేకాకుండా సంతోషం ఎక్కువైనప్పుడు కన్నీళ్లు ఎందుకో వస్తాయో ఎప్పుడైన ఆలోచించారా..? ఆ విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మనం సంతోషంగా ఉన్నా, బాధగా ఉన్నా లేదా ఏదైన నొప్పి కలిగినప్పుడు ఏడుస్తాం. ఈ సమయంలో కళ్ల నుంచి కన్నీళ్లు వస్తాయి. ఈ కన్నీళ్లు కేవలం మన భావోద్వేగాలను మాత్రమే కాదు, మన శరీరం ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. శాస్త్రవేత్తలు కన్నీళ్లను మూడు రకాలుగా విభజించారు. వాటిలో ప్రతి రకం కన్నీటికి దాని ప్రత్యేకమైన పని, ప్రయోజనం ఉంటుంది.
కన్నీళ్ల రకాలు
బేసల్ టియర్స్
ఇవి మన కళ్లలో నిరంతరం ఉండే కన్నీళ్లు. కళ్లు పొడిబారకుండా చూస్తాయి. ఎప్పుడూ తేమగా, సున్నితంగా ఉండేలా చేస్తాయి. ఇందులో దాదాపు 98 శాతం నీరే ఉంటుంది. ఇవి కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.
నాన్-ఎమోషనల్ టియర్స్:
ఈ కన్నీళ్లు భావోద్వేగాల వల్ల కాకుండా బయటి కారణాల వల్ల వస్తాయి. ఉదాహరణకు.. ఉల్లిపాయలు కోసేటప్పుడు, కళ్లలో దుమ్ము పడినప్పుడు లేదా ఏదైనా ఘాటైన వాసన తగిలినప్పుడు ఇవి వస్తాయి. కళ్లను శుభ్రం చేయడానికి, బయటి పదార్థాల నుంచి రక్షించడానికి ఇవి ఉపయోగపడతాయి.
క్రయింగ్ టియర్స్:
ఈ కన్నీళ్లు మన భావోద్వేగాలతో నేరుగా ముడిపడి ఉంటాయి. మనం బాధ, సంతోషం లేదా నొప్పిని అనుభవించినప్పుడు, మెదడులోని లింబిక్ సిస్టమ్, హైపోథాలమస్ నాడీ వ్యవస్థకు సంకేతాలు పంపుతాయి. దాని వల్ల కన్నీళ్లు వస్తాయి.
ఏడవడం వల్ల కలిగే ప్రయోజనాలు
మానసిక ప్రశాంతత: ఏడవడం అనేది భావోద్వేగాలను బయటకు విడుదల చేసే ఒక మార్గం. ఇది ఒత్తిడిని, ఉద్రిక్తతను తగ్గిస్తుంది.
కంటి ఆరోగ్యం: కన్నీళ్లు కళ్లను శుభ్రంగా, తేమగా ఉంచుతాయి. దీనివల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
మెదడుకు మేలు: భావోద్వేగాలను అణచిపెట్టుకోకుండా ఏడవడం వల్ల మెదడుకు చాలా మంచిది. అందుకే సంతోషం లేదా బాధ.. ఏ పరిస్థితిలోనైనా ఏడవడం మన శరీరానికి, మెదడుకు మేలు చేస్తుంది.
హైపోథాలమస్ పాత్ర:
మన మెదడులోని హైపోథాలమస్ అనే భాగం భావోద్వేగాలను గుర్తిస్తుంది. అవి తీవ్ర స్థాయికి చేరుకున్నప్పుడు కన్నీళ్లను విడుదల చేయమని నాడీ వ్యవస్థకు సంకేతాలు పంపుతుంది. అందుకే సంతోషం ఎక్కువైనప్పుడు కూడా మనకు కన్నీళ్లు వస్తాయి. ఈ కారణం చేతనే ఏడవడం ఒక సహజమైన ప్రక్రియ.
మనం ఏడవడం అనేది మన శరీరం, మనసు ఆరోగ్యంగా ఉండటానికి ఒక సంకేతం. కాబట్టి మీ భావోద్వేగాలను అణచిపెట్టుకోకుండా, బయటకు వ్యక్తపరచడం ఎల్లప్పుడూ మంచిదే. కన్నీళ్లు కేవలం నీటి చుక్కలు కావు, అవి మన శరీరంలోని ముఖ్యమైన రక్షణ యంత్రాంగంలో ఒక భాగం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




