TV9 Impact: మూడేళ్ల చిన్నారి ప్రాణం నిలిపిన ఇంజక్షన్ ఖరీదు 16 కోట్లు.. క్రౌడ్ ఫండింగ్ ద్వారా అపన్న హస్తం అందించిన దాతలు
. అల్లారు ముద్దుగా పెంచుకుందామనుకున్న తమ పసి ప్రాణాన్ని అరుదైన వ్యాధి పట్టి పీడుస్తుంటే ఆ బాధ వర్ణనాతీతం. నయంకాని రోగం... పసి ప్రాణం పాలిట యమపాశంలా మారింది.
Save The Life Of A 3 Year Old Boy with Crowdfunding: సరైన వైద్యం అందక ఎవరైనా చనిపోయారని తెలిస్తే తల్లడిల్లిపోతాం. ప్రాణాంతక వ్యాధితో ఎవరైనా పోరాడుతున్నారన్న విషయం తెలిసినా మనసు కలతచెందుతుంది. సొంత బిడ్డలు తమ ఆయుష్షు కూడా పోసుకుని బతకాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అల్లారు ముద్దుగా పెంచుకుందామనుకున్న తమ పసి ప్రాణాన్ని అరుదైన వ్యాధి పట్టి పీడుస్తుంటే ఆ బాధ వర్ణనాతీతం. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించినదంతా ఖర్చు చేసినా.. నయంకాని రోగం… పసి ప్రాణం పాలిట యమపాశంలా మారింది. మింగలేక.. నడవలేక అల్లాడిపోతున్న తమ బిడ్డను చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఖరీదైన వైద్యం అందించేందుకు కావాల్సిన రూ.16 కోట్ల కోసం దాతల సాయం అర్థిస్తున్నారు. మనసున్న మారాజులు తోచినంత సాయం చేయాలని వేడుకుంటున్నారు. అశించిన దానికన్న ఎక్కువై పోగై, ఆ చిన్నారికి అరుదైన వైద్యం అందింది. చివరికి ప్రాణం దక్కింది.
అరుదైన జన్యువ్యాధితో బాధపడుతున్న ఓ మూడేళ్ల చిన్నారిని తీసుకువచ్చిన తల్లిదండ్రులకు వైద్యులు చెప్పిన మాటలకు కుప్పకూలిపోయారు. ‘‘ఈ పిల్లాడి స్థితికి బాధపడడం.. బతికి ఉన్నంత వరకూ ప్రేమగా చూసుకోవడం తప్ప మీరు ఏమీ చేయలేరు’’ అన్నారు. బాధగా చెప్పిన మాట ఇది! వారి ఆర్థిక పరిస్థితి అలాంటిది మరి. ఆ బాలుణ్ని బతికించే ఏకైక మార్గం.. జోల్‌గెన్‌స్మా అనే ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ ఒక్క డోసు ఖరీదు అక్షరాలా పదహారు కోట్ల రూపాయలు. దిగుమతి సుంకం ఆరు కోట్ల రూపాయలు అదనం. అంటే.. మొత్తం 22 కోట్లు. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆ దంపతులకు అది అందని ఆకాశమే. అయినా ఆశ కోల్పోక ఒక ప్రయత్నం చేద్దామని భావించారు. వారి ఆశకు మనసున్నదాతల మానవత్వం తోడైంది. అరుదైన జన్యువాధితో బాధపడుతున్న వారి మూడేళ్ల కుమారుడి ప్రాణదీపాన్ని.. ఒకరితో ఒకరికి సంబంధం లేని 62,400 మంది చేతులు జతకట్టి ఆదుకున్నాయి. అక్షరాలా రూ.14.84 కోట్లు పోగేసి కవచంలా కాపాడి ప్రాణాలు నిలిపాయి.
వారి దయకు కేంద్రం ఔదార్యం, మరో అంతర్జాతీయ ఫండ్ సాయం తోడయ్యాయి. ఆ చిన్నారి తల్లిదండ్రుల కళ్లల్లో కొత్త వెలుగులు నింపాయి. ఆ బాలుడి పేరు అయాన్ష్ గుప్తా. హైదరాబాద్‌కు చెందిన యోగేశ్, రూపల్ దంపతులకు మూడేళ్ల క్రితం జన్మించాడు. పండంటి కొడుకు పుట్టాడన్న ఆనందంలో ఉన్న ఆ దంపతులకు.. ఆ బాలుడు అందరిలా లేడన్న విషయం రోజులు గడిచేకొద్దీ అర్థమైంది. ఆరో నెల వచ్చినా మెడ నిలపలేకపోతుండడంతో నగరంలోని ఆసుపత్రిలో చూపించారు. వైద్యులు అన్ని పరీక్షలూ చేసి.. టైప్ 1 ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్‌ఎంఏ)’ అనే అరుదైన వ్యాధితో అయాన్ష్ బాధపడుతున్నట్టు గుర్తించారు. అతను 4 నుంచి 6 సంవత్సరాలకు మించి బతకడని వైద్యులు తేల్చి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 8,000 మందిలో ఒకరికి మాత్రమే వచ్చే ఈ సమస్యకు మందు జోల్‌గెన్‌స్మా అనే ఇంజెక్షన్ మాత్రమే అని చెప్పి దాని గురించి వివరించారు. ఈ ఇంజక్షన్ ఖరీదు అక్షరాల పదహారు కోట్ల రూపాయలు. దాన్ని కొనాలంటే వారికది దాదాపు అసాధ్యమే. కానీ.. తమ కుమారుణ్ని చూసి కుమిలిపోతూ అలాగే ఉండలేకపోయారు ఆ దంపతులు. చాక్లెట్లు తినాల్సిన వయసులో ప్యాకెట్ల కొద్దీ మందులు మింగాల్సిన దుస్థితి నుంచి అతణ్ని తప్పించాలనే కృతనిశ్చయానికి వచ్చారు. ఇంజెక్షన్‌కు కావాల్సిన డబ్బు కోసం క్రౌడ్ ఫండింగ్ విధానాన్ని ఆశ్రయించారు. ఇంపాక్ట్‌గురు డాట్ కామ్ అనే వెబ్‌సైట్ ద్వారా తమ కుమారుడి పరిస్థితి వివరించి ప్రాణాలు కాపాడాలని వేడుకొన్నారు. ఇదే విషయం గురించి టీవీ 9 కూడా వరుస కథనాలను ప్రసారం చేసింది.
క్రమంగా ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్కరే స్పందించడం ప్రారంభించారు. ముంబైలో కొద్దిరోజుల క్రితమే ధైర్యరాజ్‌సింగ్ అనే ఐదు నెలల చిన్నారికి కూడా ఇదే ఇంజెక్షన్ కోసం క్రౌడ్ ఫండింగ్ విధానంలో రూ.16 కోట్లు సేకరించారు. అదే సమయంలో అయాన్ష్ కేసు వెలుగులోకి రావడంతో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం స్పందించారు. ఒక దాత ఏకంగా 7 వేల డాలర్లు (దాదాపు రూ.56లక్షలు) విరాళంగా ఇచ్చారు. మరొక దాత రూ.50లక్షలు ఇచ్చారు. ఒక్కొక్కరుగా చాలా మంది రూ.లక్షకు పైగా సాయం చేశారు. ఇలా 127 రోజుల్లో రూ.14.84 కోట్లు సమకూరాయి.
మరో అంతర్జాతీయ క్రౌడ్‌ఫండింగ్ సంస్థ ద్వారా వచ్చిన డబ్బుకు, యోగేశ్ కుటుంబసభ్యులు కొంత కలిపి మిగతా రూ.1.2కోట్లను కూడగట్టారు. కేంద్రం కూడా ఆ చిన్నారి ప్రాణాన్ని నిలపడానికి ముందుకొచ్చి.. ఇంజెక్షన్‌పై దిగుమతి పన్ను రూ.6కోట్లను మినహాయించింది. దీంతో జూన్ 8న ఆ బాలుడికి ఇంజెక్షన్ అందింది. జూన్ 9న హైదరాబాద్‌లోని రెయిన్‌బో పిల్లల ఆస్పత్రిలో అతడికి ఆ ఇంజెక్షన్ చేశారు. దాదాపు రెండు సంవత్సరాలపాటు ఆ తల్లిదండ్రులు పడిన నరకానికి ఆ రోజుతో ఫుల్‌స్టాప్ పడింది. ‘‘మా వేదనను సంతోషంగా మార్చి.. మా బిడ్డకు నూతన జీవితాన్ని ప్రసాదించిన అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాం’’ అని ఆ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. అయాన్ష్‌ను మరో మూడు నెలలపాటు జాగ్రత్తగా చూసుకోవాలని వైద్యులు సూచించారు.
Struggle of a lifetime and here we are! Yesterday, Ayaansh has been dosed for Zolgensma, the ₹16 Cr. drug we hve bn talkn abt all this while. He’s stable & hopefully will improve from here. A big thank you to all our 65k donors for gvng a new life to my boy? #savedayaanshgupta pic.twitter.com/jr58xwcEup
— AyaanshFightsSMA (@FightsSma) June 10, 2021
Read Also… Tamil Nadu : లోదుస్తుల్లో 45 మద్యం బాటిళ్లు తరలిస్తూ పట్టుబడ్డ హిజ్రాలు..చూసి షాక్ అయినా పోలీసులు .