రైల్వే స్టేషన్‌లో మహిళకు పురిటి నొప్పులు.. సడెన్‌గా వచ్చి కత్తి, జుట్టు క్లిప్‌లతో..
ఝాన్సీ రైల్వేషన్‌లో ఓ గర్భిణి మహిళకు సడెన్‌గా పురిటి నొప్పులు వచ్చాయి. సాయం కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తుండగా.. ఓ వ్యక్తి దేవుడిలా వచ్చాడు. మహిళకు విజయవంతంగా ప్రసవం చేయడంతో తల్లీబిడ్డ సురక్షితంగా ఉన్నారు. అయితే ప్రసవం కోసం ఆయన ఉపయోగించిన పరికరాలు చూస్తే అంతా ఆశ్చర్యపోతారు.

అది ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ రైల్వే స్టేషన్.. ప్రయాణికులు తమ ఫ్లాట్ ఫామ్స్ వైపు పరుగులు తీస్తున్నారు. లేట్ అయ్యిందని కొందరు టెన్షన్‌తో వెళ్తుంటే.. మరికొంతమంది వారి రైలు కోసం వేచి చూస్తు్నారు. ఇంతలో ఓ గర్భిణీ మహిళ తన కుటుంబంతో కలిసి స్టేషన్‌కు వచ్చింది. తన భర్త, బిడ్డతో పన్వేల్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో పన్వేల్ నుండి బారాబంకికి వెళ్తుంది. అయితే సడెన్‌గా ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. అప్పుడు వచ్చాడు ఓ వ్యక్తి దేవుడిలా. కాదు ఆమె కోసం ఆ దేవుడే పంపించాడు అన్నట్లుగా.. చకచకా తన వద్ద ఉన్న చిన్న చిన్న పరికరాలతో సదరు మహిళకు విజయవంతంగా ప్రసవం చేశారు. దీంతో తల్లీబిడ్డ సురక్షితంగా ఉండగా.. ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
పాకెట్ కత్తి, జుట్టు క్లిప్‌లు, ధోతీ.. ఆ మహిళకు ప్రసవం చేయడానికి ఆర్మీ డాక్టర్ ఉపయోగించిన చికిత్స పరికరాలు ఇవే. వాటితోనే అత్యవసర సమయంలో మహిళకు ప్రసవం చేసి తల్లీబిడ్డను బతికించాడు. ఝాన్సీ మిలిటరీ హాస్పిటల్‌లో పనిచేస్తున్న 31ఏళ్ల మేజర్ రోహిత్.. తన ఫ్యామిలీతో కలిసి సెలవుపై హైదరాబాద్‌కు వస్తున్నాడు. రైల్వేస్టేషన్‌లో రైలు కోసం వెయిట్ చేస్తుండగా.. ఫుట్‌ఓవర్ బ్రిడ్జిపై పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీని చూశాడు. వెంటనే అక్కడి వెళ్లిన రోహిత్.. పాకెట్ కత్తి, హెయిర్ క్లిప్‌లు, ధోతీని ఉపయోగించి ఆ మహిళకు ప్రసవం చేశాడు. రైల్వే సిబ్బంది వారికి సహాయం చేశారు.
‘‘ఒక మహిళా టీటీఈ గర్భిణీ స్త్రీని వీల్‌చైర్‌పై ఆస్పత్రికి తీసుకెళ్తోంది. ఆమెను ఫుట్‌ఓవర్ బ్రిడ్జిపై లిఫ్ట్ నుండి బయటకు తీసుకువస్తుండగా.. గర్భిణీ స్త్రీ నొప్పులతో కేకలు వేసింది. నేను వెంటనే ఆమె వద్ద వెళ్లి ఆ మహిళ ప్రసవానికి సహాయం చేశాను. తల్లీ బిడ్డ సురక్షితంగా ఉన్నారు.. తదుపరి చికిత్స కోసం వారిని ఆస్పత్రికి తరలించాం’’ అని మేజర్ రోహిత్ తెలిపారు. ఆపద సమయంలో ఆయన దేవుడిలా వచ్చారని రైల్వే సిబ్బంది తెలిపారు. ప్రసవంలో తమకు సహాయం చేసిన ఆర్మీ డాక్టర్, మహిళా రైల్వే సిబ్బందికి మేం ఎంతో రుణపడి ఉంటామని మహిళ భర్త చెప్పారు. మేజర్ రోహిత్ చేసిన ఆర్మీ వైద్యాధికారులు ప్రశంసించారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..