AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Lung Cancer Day 2022: యువతకు బిగ్ అలర్ట్.. ఆ రెండు వ్యసనాలు మీ ప్రాణాలను హరించేస్తాయ్..!

World Lung Cancer Day 2022: ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ అభివృద్ధి వైపు శరవేగంగా అడుగులు వేస్తున్న భారత్‌ను ఊపిరితిత్తుల క్యాన్సర్ సమస్య వేధిస్తోంది.

World Lung Cancer Day 2022: యువతకు బిగ్ అలర్ట్.. ఆ రెండు వ్యసనాలు మీ ప్రాణాలను హరించేస్తాయ్..!
Youth
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 01, 2022 | 5:02 PM

World Lung Cancer Day 2022: ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ అభివృద్ధి వైపు శరవేగంగా అడుగులు వేస్తున్న భారత్‌ను ఊపిరితిత్తుల క్యాన్సర్ సమస్య వేధిస్తోంది. మిగతా వ్యాధులను మించి.. ప్రధాన ఆరోగ్య సమస్యగా పరిణమిస్తోంది. దేశంలో రాబోయే 5 సంవత్సరాలలో ఒక లక్ష కంటే ఎక్కువ లంగ్స్ క్యాన్సర్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, లంగ్స్ క్యాన్సర్ బాధితుల్లో ఇప్పటి వరకు మగవారు ఎక్కువగా ఉండేవారు. కానీ, గత దశాబ్ద కాలంగా మహిళల్లోనూ లంగ్స్ క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నట్లు తాజా పరిశోధనల్లో వెల్లడైంది.

లంగ్స్ క్యాన్సర్‌కు అనేక కారణాలు ఉన్నాయి. అయితే, ఈ క్యాన్సర్ కేసుల్లో 90 శాతం సిగరెట్ వంటి పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్లే నమోదవుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఇందులో ఉండే నికోటిన్ లంగ్స్ క్యాన్సర్‌కు కారణం అవుతుంది. అయినప్పటికీ చాలా మంది దీనిని పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. పైగా.. సిగరెట్‌కు బదులుగా హుక్కాకు అలవాటు పడుతున్నారు. పొగా ఉన్న సిగరెట్ కంటే హుక్కా సురక్షితమైనదని, అదే సమయంలో స్టేటస్‌ను ప్రభావితం చేసేదిగానూ భావిస్తున్నారు. ఆ భావనతోనే చాలా మంది హుక్కును విపరీతంగా పీల్చేస్తున్నారు. అయితే, వీరి గుడ్డి విశ్వాసాలను పటాపంచల్ చేస్తున్నారు వైద్య నిపుణులు. హుక్కా సేవించడం వలన ఇతర అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ విశేష్ గుమ్డాల్ స్పష్టం చేశారు.

హుక్కాలోనూ ఆ రసాయనాలు..

ఇవి కూడా చదవండి

డాక్టర్ గుమ్డాల్ ప్రకారం.. ‘హుక్కాలో పొగాకు కలిగిన మిశ్రమాలను ఆవిరి చేయడం జరుగుతుంది. అనేక అధ్యయనాల్లో సిగరెట్‌ పొగలో కనిపించే అనేక రసాయనాలు హుక్కా పొగలోనూ ఉన్నాయని తేలింది. అంతేకాదు.. హుక్కా పొగలో 50 కంటే ఎక్కువ క్యాన్సర్ కారకాలు గుర్తించడం జరిగింది. హుక్కాలోనూ నికోటిన్ ఉంటుంది. సిగరెట్ మాదిరిగా ఇది కూడా ఆరోగ్యానికి హానీ తలపెడుతుంది.’ అని చెప్పారు.

‘వాపింగ్’ చాలా డేంజర్..

చాలా మంది హుక్కా మాదిరిగానే స్టైలీష్‌గా ఉందని వాపింగ్ చేస్తుంటారు. ఈ వాపింగ్ కూడా చాలా ప్రమాదం అని వైద్యులు చెబుతున్నారు. వాపింగ్ డివైస్‌లో ఉపయోగించే లిక్విడ్.. లంగ్స్ సమస్యలకు కారణం అవుతుంది. వాపింగ్‌లో ఒక పదార్థం వేడి అవడం ద్వారా పొగ ఉత్పన్నం అవుతుంది. ఆ పొగను పీల్చి ఆస్వాదిస్తుంటారు పొగరాయుళ్లు. అయితే, ఇది చాలా ప్రమాదకరం అని చెబుతున్నారు వైద్యులు. ఇందులో వాడే లిక్విడ్‌లో చాలా వరకు సువాసన కలిగిన పదార్థాలు, నికోటిన్, గంజాయి వంటి పదార్థాల మిక్సింగ్ ఉంటుంది. ఈ మిశ్రమాన్ని ఒకరకమైన పదార్థంతో కరిగిస్తారు. ఫార్మాల్డిహైడ్, అక్రోలిన్, డయాసిటైల్ వంటి విషపూరిత రసాయనాలు కూడా వాపింగ్ ద్వారా పీల్చడం జరుగుతుంది. ఈ రసాయనాలు చాలా వరకు క్యాన్సర్‌ ప్రమాదాన్ని పెంచుతాయి.

ఆ విషయంలో ఆధారాలు లభించనప్పటికీ..

లంగ్స్ క్యాన్సర్‌కు వాపింగ్ కారణమవుతుందనే విషయంలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లభించనప్పటికీ.. దీనిపట్ల జాగ్రత్త తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నారు వైద్యులు. వాపింగ్ కోసం ఉపయోగించే ద్రవ మిశ్రమంలో పైన పేర్కొన్న విషపూరిత రసాయనాలు ఉండటం వల్ల కాలక్రమేణా అది ఊపిరితిత్తుల సమస్యకు దారి తీస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్‌కు కారకం అవ్వొచ్చు అని వైద్యులు చెబుతున్నారు. వాపింగ్ సమయంలో ఉపయోగించే లిక్విడ్ కారణంగా లిపిడ్ న్యుమోనియా, బ్రోన్కైటిస్ ఆబ్లిటెరాన్స్, స్పాంటేనియస్ న్యూమోథొరాక్స్ వంటి లంగ్స్ వ్యాధులకు కారణం అవుతుందని, దీనిపట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

దేశంలో పెరుగుతున్న హుక్కా వినియోగం..

మన సంస్కృతిపై పాశ్చాత్య దేశాల సంస్కృతి ప్రభావం రోజు రోజుకు మరింత పెరుగుతుంది. ఈ కారణంగానే యువతలో హుక్కా వినియోగం పెరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో రోజు రోజుకు హుక్కా సెంటర్లు ఎక్కువైపోతున్నాయి. అనేక మెట్రో నగరాల్లో వీటిని విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవానికి దేశంలో హుక్కా వినియోగం ఉన్నత వర్గాల ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే, ఉన్నత వర్గాలైనా.. సామాన్యులైనా.. హుక్కాకు తెలియదు కదా! ముందుగానే మేల్కోకుంటే.. తీవ్ర పరిణామాలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు వైద్యులు.

మనం దేశంలో వాపింగ్‌ను 2019 లోనే నిషేధించారు. హుక్కాను మాత్రం నిషేధించలేదు. ఈ నేపథ్యంలోనే వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు అధికారులు. కాగా, హుక్కా విషయంలో తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. పాఠశాలలు, కాలేజీల్లో హుక్కా వలన కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..