యువతలో మెమరీ లాస్.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి..! నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?
ఈ రోజుల్లో చిన్న వయసులోనే జ్ఞాపకశక్తి తగ్గిపోవడం ఒక కామన్ ప్రాబ్లమ్ అయింది. పేర్లు, పనులు, విషయాలు మర్చిపోవడం మామూలైపోయింది. అయితే దీన్ని లైట్ తీసుకుంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా విటమిన్ల లోపం, ఒత్తిడి, నిద్రలేమి లాంటివి దీనికి మెయిన్ రీజన్స్. అందుకే ఈ సమస్యను ముందుగానే గుర్తించి జాగ్రత్త పడటం చాలా ముఖ్యం.

సాధారణంగా జ్ఞాపకశక్తి తగ్గిపోవడాన్ని పెద్ద వయసు వారితో మనం ముడిపెడతాం. కానీ ఆశ్చర్యంగా ఇప్పుడు యువతలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. దీన్ని తేలికగా తీసుకోవద్దు.. నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్యలకు దారి తీస్తుంది. యువతలో జ్ఞాపకశక్తి లోపానికి గల కారణాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
జ్ఞాపకశక్తి లోపం లక్షణాలు
- స్నేహితులు, బంధువుల పేర్లు గుర్తుకు రాకపోవడం.
- ఫోన్, తాళాలు ఎక్కడ పెట్టారో మర్చిపోవడం.
- తెలిసిన ప్రాంతాల్లోనే దారి తప్పడం.
- మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తుకు రాకపోవడం.
- ముఖ్యమైన పనులు లేదా మీటింగ్‌లు మర్చిపోవడం.
యువతలో జ్ఞాపకశక్తి లోపానికి కారణాలు
- విటమిన్ల లోపం.. శరీరంలో విటమిన్ D, విటమిన్ B12 తక్కువగా ఉండటం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది.
- ఒత్తిడి, ఆందోళన.. అధిక ఒత్తిడి, ఆందోళన వల్ల మెదడు సరిగ్గా పనిచేయదు.
- నిద్రలేమి.. మెదడుకు సరైన విశ్రాంతి లేకపోతే విషయాలను గుర్తుంచుకోవడం కష్టం అవుతుంది.
- వ్యాధులు.. కొన్నిసార్లు అల్జీమర్స్ లేదా ఇతర వ్యాధులు కూడా దీనికి కారణం కావచ్చు.
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే మార్గాలు
- చురుకుగా ఉండండి.. శరీరానికి మాత్రమే కాదు, మెదడుకు కూడా వ్యాయామం అవసరం. రోజూ వ్యాయామం చేస్తే రక్తప్రసరణ మెరుగుపడి జ్ఞాపకశక్తి పదునుగా మారుతుంది. వేగంగా నడవడం కూడా మంచిదే.
- తగినంత నిద్ర తీసుకోండి.. మెదడు బాగా పనిచేయాలంటే విశ్రాంతి తప్పనిసరి. రోజుకు 7 నుంచి 9 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. పడుకునే ముందు మొబైల్, టీవీ చూడటం తగ్గించి.. ఒకే సమయానికి పడుకునే అలవాటు చేసుకోండి.
- ఆరోగ్యకరమైన ఆహారం.. మెదడుకు సరైన ఆహారం ముఖ్యం. ఆకుకూరలు, కూరగాయలు, నట్స్, చేపలు, బ్లూబెర్రీస్ వంటివి ఎక్కువగా తినడం వల్ల విటమిన్ల లోపం తగ్గుతుంది. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి.
- మెదడుకు పని చెప్పండి.. పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, పజిల్స్, చెస్ వంటివి ఆడటం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
- ఒత్తిడిని తగ్గించుకోండి.. అధిక ఒత్తిడి జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుంది. కాబట్టి యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
- ఇతరులతో సమయం గడపండి.. కుటుంబం, స్నేహితులతో నవ్వుతూ, మాట్లాడుతూ సమయం గడపండి. మంచి సంభాషణలు మెదడును పదును చేసి జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
అప్పుడప్పుడు కొన్ని విషయాలు మర్చిపోవడం మామూలే. కానీ తరచుగా జ్ఞాపకశక్తి సమస్యలు వస్తే.. అది తీవ్రమైన సమస్యకు సంకేతం కావచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి సరైన సలహా తీసుకోండి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




