Vitamin K1: ఈ ఒక్కటి డైట్‌లో చేరిస్తే.. గుండె ఆరోగ్యం పదిలం.. పూర్తి వివరాలు
ఇటీవలి కాలంలో గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే, ఈ ముప్పును గణనీయంగా తగ్గించే విటమిన్‌ను తాజా అధ్యయనం గుర్తించింది. విటమిన్ ‘కే1’ను నిత్యం తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ముప్పు గణనీయంగా తగ్గుతుందని అధ్యయనం తెలిపింది.

ఇటీవలి కాలంలో గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే, ఈ ముప్పును గణనీయంగా తగ్గించే విటమిన్‌ను తాజా అధ్యయనం గుర్తించింది. విటమిన్ ‘కే1’ను నిత్యం తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ముప్పు గణనీయంగా తగ్గుతుందని అధ్యయనం తెలిపింది. విటమిన్ కే1ను సరైన మోతాదులో తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని 43 శాతం వరకు తగ్గించుకోవచ్చని అధ్యయనం వివరించింది.
‘ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్’లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. 70 ఏళ్లు పైబడిన 1,400 మంది మహిళలపై 14 సంవత్సరాల పాటు జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఈ పరిశోధనలో భాగంగా రోజుకు 120 మిల్లీ గ్రాముల విటమిన్ K1 తీసుకున్నవారికి, గుండె సంబంధిత వ్యాధుల వల్ల వచ్చే మరణాల ప్రమాదం తక్కువగా ఉందని కనుగొన్నారు. మన శరీరంలోని ధమనుల్లో కాల్షియం పేరుకుపోవడం వల్ల అవి గట్టిపడతాయి. ఈ పరిస్థితి వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. విటమిన్ కే1, మ్యాట్రిక్స్ జీఎల్ఏ ప్రొటీన్ అనే రసాయనాన్ని సక్రియం చేయడం ద్వారా, ధమనుల్లో కాల్షియం పేరుకుపోకుండా నిరోధిస్తుంది. ఈ ప్రక్రియ వల్ల ధమనులు ఆరోగ్యంగా ఉంటాయి, గుండె కూడా సురక్షితంగా ఉంటుంది.
విటమిన్ కె1 ఆకుకూరలైన పాలకూర, బ్రకోలీ వంటి వాటిలో పుష్కలంగా లభిస్తుంది. రోజుకు ఒకటి నుంచి ఒకటిన్నర కప్పుల ఆకుకూరలు తీసుకోవడం వల్ల మన శరీరానికి కావలసినంత విటమిన్ కే1 లభిస్తుంది. అయితే, వార్ఫరిన్ వంటి రక్తం పలచబరిచే మందులు వాడేవారు, ఆహారంలో ఏమైనా మార్పులు చేసే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్న వారు తప్పక వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.




