Seasonal Disease: పెరుగుతున్న సీజనల్ వ్యాధుల ప్రమాదం.. రెగ్యులర్‌గా వీటిని తీసుకుంటే ఆరోగ్యం పదిలం..
కొన్నిసార్లు వర్షం, మరి కొన్నిసార్లు వేడి, చల్లగా మారడం వల్ల పలు అనారోగ్య సమస్యలు పెరుగుతుంటాయి. సీజన్ మారుతున్నప్పుడల్లా పలు వ్యాధులు చుట్టుముడుతునే ఉంటాయి.
కొన్నిసార్లు వర్షం, మరి కొన్నిసార్లు వేడి, చల్లగా మారడం వల్ల పలు అనారోగ్య సమస్యలు పెరుగుతుంటాయి. సీజన్ మారుతున్నప్పుడల్లా పలు వ్యాధులు చుట్టుముడుతునే ఉంటాయి. ప్రస్తుతం వర్షాకాలం కారణంగా పలుచోట్ల నీరు నిలిచిపోయింది. దీనివల్ల డెంగ్యూ, మలేరియా వచ్చే ప్రమాదం ఉంది. అదే విధంగా వేడి, తేలికపాటి శీతాకాలం కారణంగా వైరల్ జ్వరాలు కూడా సంభవిస్తాయి. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వైరల్ జ్వరాలు, డెంగ్యూ విలయతాండవం చేస్తోంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు ఈ వ్యాధుల బారిన పడతారు. దీంతో రక్తంలో ఇన్ఫెక్షన్, ప్లెట్ లెట్ కౌంట్ తగ్గిపోవడం లాంటి సమస్యలు వస్తాయి. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావొచ్చు. ఇలాంటి సందర్భంలో.. ఇంట్లో, మార్కెట్‌లో విక్రయించే కూరగాయలు, పండ్ల రూపంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. దీని ద్వారా వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వాటిని తినడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సీజనల్ వ్యాధుల కాలంలో, రోజువారీ ఆహారంలో ఎలాంటి వాటిని చేర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం..
వెల్లుల్లి: రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు వెల్లుల్లిలో పుష్కలంగా ఉన్నాయి. ఇది వాపు, జ్వరం, గొంతు నొప్పిని తొలగిస్తుంది. యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చెడు జెర్మ్స్, టాక్సిన్‌లను బయటకు పంపుతాయి. రెండు వెల్లుల్లి రెబ్బలను వేడి నీళ్లతో కలిపి తీసుకుంటే కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు, గుండెకు మేలు జరుగుతుంది.
తిప్పతీగ: తిప్పతీగ ఆకుల రసం లేదా నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల వైరల్ ఫీవర్ రాదు. డెంగ్యూలో వేగంగా ప్లేట్‌లెట్స్ కౌంట్ కూడా తగ్గదు. డెంగ్యూ జ్వరం నుంచి కూడా కోలుకోవచ్చు. తిప్పతీగ ఆకులను ఉడకబెట్టి వడగట్టి కూడా తాగవచ్చు.
బొప్పాయి ఆకులు: బొప్పాయి ఆకుల రసం ప్లేట్‌లెట్లను పెంచడంలో మంచి రెమెడీ. డెంగ్యూ జ్వరంలో బొప్పాయి ఆకు అద్భుతమైన ఔషధమని 2009లో మలేషియాలో నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది.
కివి: కివిలో విటమిన్-సి, విటమిన్-ఇ, పాలీఫెనాల్స్ ఉంటాయి. రోజూ ఒక కివిని ఉదయం, సాయంత్రం తినడం వల్ల ప్లేట్‌లెట్స్ వేగంగా పెరుగుతాయి. దీని వల్ల కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది. డెంగ్యూ సీజన్‌లో కివీకి డిమాండ్ పెరుగుతుంది.
దానిమ్మ: దానిమ్మ పండులో పోషకాలు మెండుగా ఉన్నాయి. ఇందులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది హిమోగ్లోబిన్, ప్లేట్‌లెట్లను వేగంగా పెంచడానికి పనిచేస్తుంది. దానిమ్మ రసాన్ని ఇంట్లోనే తయారుచేసుకుని తీసుకోవచ్చు. నిల్వ చేసిన రసాన్ని తాగొద్దు.
బీట్‌రూట్: బీట్‌రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోజూ తింటే, హిమోగ్లోబిన్, ప్లేట్‌లెట్ల సంఖ్య వేగంగా పెరుగుతుంది. దీని తాజా రసం రోగికి మేలు చేస్తుంది. మీరు ఇంట్లో సలాడ్ లేదా కూర రూపంలో దీనిని తినవచ్చు.
పెరుగు: పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇందులో ఉండే బ్యాక్టీరియా ఆహారం జీర్ణం కావడానికి సహకరిస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ బాగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇది ప్రోబయోటిక్‌గా పనిచేస్తుంది.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. TV9 వీటిని ధ్రువీకరించడం లేదు. నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే వీటిని అనుసరించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి