Smartphone: స్మార్ట్ ఫోన్ ముందు దగ్గితే చాలు.. ఆ వ్యాధి తీవ్రత తెలిసిపోతుంది.. !
కోవిడ్ - 19 మహమ్మారి ప్రపంచంలో ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మిగిలిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఈ వైరస్ బారినపడి కోలుకున్నారు. కోవిడ్-19 సోకిన చాలా మంది వ్యక్తులు తేలికపాటి లక్షణాలతో కొన్ని వారాల్లోనే కోలుకుంటారు. కొందరు మాత్రం పోస్ట్ కోవిడ్ అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు.
కోవిడ్ – 19 మహమ్మారి ప్రపంచంలో ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మిగిలిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఈ వైరస్ బారినపడి కోలుకున్నారు. కోవిడ్-19 సోకిన చాలా మంది వ్యక్తులు తేలికపాటి లక్షణాలతో కొన్ని వారాల్లోనే కోలుకుంటారు. కొందరు మాత్రం పోస్ట్ కోవిడ్ అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా నిత్యం భారీ సంఖ్యలో కొత్త కోవిడ్ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. వ్యాధి నిర్థారణ, చికిత్సకు సంబంధించి పలు పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ వంటి సరికొత్త సాంకేతికతను దీని కోసం వినియోగిస్తున్నారు.
తాజాగా దగ్గులో తేడాలను స్మార్ట్ ఫోన్‌లో విని కోవిడ్ వ్యాధి స్థాయిని అంచనా వేసే విధానాన్ని స్పెయిన్ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. బార్సిలోనాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయో ఇంజినీరింగ్ ఆఫ్ కాటలోనియా (IBEC) నేతృత్వంలోని పరిశోధనా బృందం ఈ పరిశోధనను చేపట్టింది. బార్సిలోనాలోని డెల్‌మార్ ఆసుపత్రిలో చేరిన 70 మంది రోగుల దగ్గును తొలి 24 గంటల్లోనే స్మార్ట్‌ఫోన్‌లో నమోదు చేశారు. దగ్గు శబ్ధంలో తేడాలను విశ్లేషించి కోవిడ్ వ్యాధి తీవ్రతను విశ్లేషించే విధానాన్ని వారు రూపొందించారు. యూరోపియన్ రెస్పిరేటరీ జర్నల్ ఓపెన్ రీసెర్చ్’లో ఈ పరిశోధన నివేదికను ప్రచురించారు.
దీనివల్ల వ్యాధిని ఆరంభ దశలోనే కనిపెట్టడంతో పాటు దూర ప్రాంతాల్లోని రోగులకు రిమోట్ చికిత్స చేయడమూ సాధ్యపడుతుంది. స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంటుంది. రోగులు తమ స్మార్ట్ ఫోన్‌లో రికార్డు చేసి పంపిన దగ్గు శబ్ధంలో తేడాలను వైద్యులు విశ్లేషించడం ద్వారా.. ఆ వ్యక్తిలో న్యుమోనియా తీవ్రతను కూడా లెక్కించేందుకు వీలుంటుంది. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో.. మెరుగైన వైద్య వసతులు లేని ప్రాంతాల్లోనూ రోగులకు రిమోట్‌గా చికిత్స అందించేందుకు ఈ కొత్త సాంకేతికత తోడ్పడుతుంది.
ఈ సాంకేతికతను ఇతర శ్వాసకోశ వ్యాధుల రోగ నిర్ధారణకు కూడా ఉపయోగించవచ్చు. కోవిడ్ -19 రోగుల సత్వర గుర్తింపు, ఐసోలేషన్‌కు ఇది సాయపడుతుందని, తద్వారా సరైన వైద్య సంరక్షణ, నియంత్రణ చర్యలను అమలు చేయడం సులభతరం అవుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న డాక్టర్ జోక్విమ్ గియా తెలిపారు.
కోవిడ్‌తో పాటు న్యుమోనియా వంటి ఇతర శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న రోగుల దగ్గులో తేడాను విశ్లేషించి రోగ నిర్ధారణ చేయడం సులభతరం అవుతుందని ఇందులో పాలుపంచుకున్న సీనియర్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే దీనిపై మరింత లోతైన అధ్యయనం జరిపి ఫలితాలను రోగుల భారీ డేటాతో ధృవీకరించనున్నట్లు వెల్లడించారు.
మరిన్ని హెల్త్ కథనాలు చదవండి