ఈ చిన్న చిన్న పనులు చేయండి చాలు.. రాత్రి గురక సమస్య అస్సలు ఉండదు..!
రాత్రి పడుకోగానే చుట్టుపక్కల వారి నిద్రను పాడు చేసే సమస్య గుర్రు. ఇది కేవలం శబ్దం సమస్య మాత్రమే కాదు.. దీని వల్ల నిద్రలో ఆటంకం, ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అయితే కొన్ని సులభమైన జీవనశైలి మార్పులతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

పడుకునేటప్పుడు వీలైతే పక్కకు తిరిగి పడుకోండి. ఎడమ లేదా కుడి భుజంపై పడుకోవడం వల్ల గొంతు మార్గం ఖాళీగా ఉంటుంది. గాలి సులభంగా లోపలికి బయటకు వెళ్తుంది. ఇది గుర్రు తగ్గించే సహజమైన పద్ధతుల్లో ఒకటి. ఎక్కువ బరువు ఉన్నవారికి శ్వాస మార్గాల చుట్టూ కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. ఇది గాలి ప్రవాహాన్ని అడ్డుకుని గుర్రుకు దారి తీస్తుంది. అందుకే ఆరోగ్యంగా బరువును నియంత్రించుకోవడం చాలా అవసరం.
శరీరంపై చెడు ప్రభావం చూపే అలవాట్లలో మద్యం తాగడం, పొగతాగడం ముఖ్యమైనవి. ఇవి గొంతు భాగాన్ని సడలించి, శ్వాసకు ఆటంకం కలిగిస్తాయి. ముఖ్యంగా నిద్రకు ముందు మద్యం తాగడం వల్ల గుర్రు పెరుగుతుంది. వీటిని పూర్తిగా మానేసే ప్రయత్నం చేయాలి.
రోజంతా తగినంత నీళ్లు తాగకపోతే శ్వాస మార్గాలు పొడిగా మారి గాలిని అడ్డుకుంటాయి. ఇది కూడా గుర్రుకు ప్రధాన కారణం. అందుకే రోజూ కనీసం 2.5 లీటర్ల వరకు నీటిని తాగాలి. నిద్రకు ముందు ఒక కప్పు వేడి టీ లేదా తులసి టీ తాగితే మరింత మేలు.
నిద్రపోయే ముందు భారీ భోజనం చేయడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది శ్వాసపై ప్రభావం చూపుతుంది. అందువల్ల రాత్రి భోజనం పడుకునే కనీసం రెండు గంటల ముందు ముగించడం ఉత్తమం.
ప్రతి రోజు ఒకే సమయంలో నిద్రపోవడం, ఒకే సమయంలో లేవడం శరీరంలో సరైన నిద్ర అలవాటును పెంచుతుంది. అలాగే ప్రతిరోజూ కొన్ని నిమిషాలు యోగా, ధ్యానం చేయడం ద్వారా మానసిక ఉల్లాసం పెరిగి శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. ఇది గుర్రు తగ్గించడంలో సహాయపడుతుంది.
ఈ సులభమైన చిట్కాలను పాటించడం వల్ల గుర్రు సమస్య తగ్గిపోతుంది. అయితే మీరు ఏ మార్పులను చేసినా గుర్రు సమస్య కొనసాగితే నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఎందుకంటే దీని వెనుక ఇతర ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)