Eggs Benefits: బ్రౌన్ ఎగ్స్ vs వైట్ ఎగ్స్.. రెండింటిలో ఏంటి తేడా?.. ఆరోగ్యానికి ఏవి మంచివి
జిమ్ జాయిన్ అవుతున్నవారు.. కొత్తగా డైట్ మొదలుపెట్టినవారు ఎవరైనా సరే ప్రొటీన్ కోసం కోడి గుడ్డునే ఎంచుకుంటారు. తక్కువ రేటుకే మంచి పోషకాహారంగా దొరికే గుడ్లకు నిరంతరం డిమాండ్ ఉండనే ఉంటుంది. మార్కెట్లో గుడ్లలో అనేక వైరైటీలు కనిపిస్తుంటాయి. కొన్ని ఫారం గుడ్లని, నాటు గుడ్లని ఇలా రకరకాల పేర్లు చెప్పి అమ్ముతున్నారు. తెల్ల రంగు గుడ్లతో పోలిస్తే గోధుమ రంగు గుడ్డులోనే పోషకాలు ఎక్కువ అనే వార్తలు కూడా అప్పట్లో హల్ చల్ చేశాయి. మరి ఇంతకీ అసలు ఏ రంగు గుడ్డు మంచిది ఈ రెండింటిలో ఉన్న తేడా ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం..

మానవ శరీరానికి గుడ్డు ఒక ముఖ్యమైన పోషకాహారం. తేలికగా ఎవ్వరైనా చేసుకుని తినగలిగే పోషకాహార సోర్స్ గా గుడ్డుకు పేరుంది. మరి మంచి విటమిన్లు శరీరానికి అందాలంటే ఏ గుడ్లను ఎంచుకోవాలి? అనే సందేహం కలుగుతుందా? చాలా మంది బ్రౌన్ రంగులో ఉండే ఆహారాల్లోనే పోషకాలు ఎక్కువని భావిస్తారు. ఉదాహరణకు బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్, బ్రౌన్ షుగర్ వంటివి ఆరోగ్యమైనవని అనుకుంటారు. మరి ఇందులో ఏది వాస్తవం.. ఇందులో ఉండే తేడాలు ఏంటో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు.
రెండింటి మధ్య ఇదే తేడా..
గుడ్లు ఇలా రెండు రంగుల్లో ఉండటానికి కారణం. ఆ గుడ్లు పెట్టే కోడి బ్రీడ్ పై ఆధారపడి ఉంటుంది. కోడి ఏ రకానికి చెందినదైతే ఆ రంగు గుడ్లను ఉత్పత్తి చేస్తుంది. ఎర్రటి ఈకలు ఉన్న కోళ్లు ఎక్కువ శాతం గోధుర రంగు గుడ్లను పెడతాయి. అంతేకానీ ఈ రంగుకు గుడ్డులో ఉండే పోషక విలువలకు ఎలాంటి సంబంధం లేదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
బ్రౌన్ ఎగ్స్ ఎందుకు తినాలి..
తెల్ల గుడ్డు ద్వారా ఏ రకమైన పోషకాలు లభిస్తాయో అలాగే బ్రౌన్ ఎగ్స్ లోనూ ఉంటాయి. గుడ్డులోని పోషకాలను అంచనా వేయాలంటే ఆ కోడి తినే ఆహారం మీదనే డిపెండ్ అయ్యిుంటుంది. సహజంగా లభించే గడ్డి, గింజలు వంటివి తిని పెరిగే కోళ్లలో ఒమెగా 3, విటమిన్ డి, యాంటి ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే గుడ్లను పెడతాయి. మంచి ఆహారం తినే కోళ్లు పెట్టే గుడ్ల వల్ల ఎక్కువ ప్రయోజనాలుంటాయి.
పోషక విలువల్లో ఏవి బెస్ట్..
గోధుమ రంగు గుడ్లు, తెల్ల గుడ్ల పోషక విలువలు దాదాపు ఒకేలా ఉంటాయి. రెండు రకాల గుడ్లలో దాదాపు 70 నుంచి 75 కేలరీలు, 6 గ్రాముల ప్రొటీన్, 1.5 గ్రాముల మంచి కొవ్వులు, 186 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ ఉంటాయి. విటమిన్ డి తో పాటు కాల్షియం 28 మిల్లీ గ్రాములు, ఐరన్ 0.8 మిల్లీ గ్రాములు, విటమిన్ ఎ వంటి ముఖ్యమైన పోషకాలు అందుతాయి.
ఏ రకం గుడ్లను ఎంచుకోవాలి..
కఈత్రిమంగా పెంచే కోళ్ల కన్నా సహజమైన పద్ధతిలో అన్ని రకాల గ్రాసాన్ని తినే కోళ్లు మంచి నాణ్యమైన గుడ్లను ఇస్తాయి. స్వేచ్ఛగా తిరిగే కోళ్లు కీటకాలు, గింజలు, ధాన్యాలు వంటివి ఎక్కువగా తినే వీలుంటుంది. అందుకే కోళ్ల రకాలను బట్టి వాటి గుడ్లను ఎంచుకోవడం ముఖ్యం. పచ్చసొనతో తినే వారు రోజుకు ఒక గుడ్డు, కేవలం ఎగ్ వైట్ ను మాత్రమే తింటే రోజుకు మూడు చొప్పున తీసుకోవడం ఆరోగ్యకరమని నిపుణులు చెప్తున్నారు.